Wednesday, July 3, 2019

ముదిగొండ శంకరారాధ్యుల వారిచే రచింపబడిన " భావలింగ శతకము " లోని కొన్ని పద్యరత్నాలు......by Ravishankar Mudigonda

36)ఆ.వె.
 మొదలు జూడ నీవె తుద జూడగా నీవె
నడుమ నేనటన్న నవ్విపోరె
ఏదియైన నీవె యెన్నటికిని నీవె
పాప భయ విభంగ భావలింగ


37)ఆ.వె.
 నీరులేని చేను, నీతిలేని నరుండు,
దాన గుణము లేని ధనిక వరుడు,
జపము లేని భక్తి సాగునా చెడిపోక
పాప భయ విభంగ భావలింగ


38)ఆ.వె
 తెలుసు నన్న మాట, తెలియ దన్నను మాట,
మాట వట్టిదన్న మాట యయ్యె
ఇట్టి మాట బెట్టి యెంత జేసితివౌర,
పాప భయ విభంగ భావలింగ


39) ఆ.వె
 కన్ను నిల్పు వాడు ఘనయోగ వర్యుండు,
మనసు నిల్పువాడు మహిని శివుడు,
మాట నిల్పువాడు మరి యెవ్వడో కాన
పాప భయ విభంగ భావలింగ


40)ఆ.వె.
 పలుక దగిన మాట తలుప దగిన తలంపు,
వెదకి చూడ లేదు విశ్వము నను,
నరులు దేనినమ్మి,  మురియుచు నున్నారొ,
పాప భయ విభంగ భావలింగ.....

No comments:

Post a Comment