20/11/17, 8:37:29 AM: MVMRAO: తెలుగుజాతి ఆస్తి శ్రీ చాగంటి
ఆయన
కనపడితే జనం పాదపూజ చేస్తారు. ఆయన పేరు వినగానే మహానుభావుడండి అని చేతులు
జోడిస్తారు. తెలుగునాట ఆయన తెలియని గడప లేదు. ఆ గొంతు వినటంతోనే రోజును
ప్రారంభించేవారు ఎందరో. ఆ గొంతు వినపడిన ఇంట మరో గొంతు వినిపించదు. ఉదయపు
నడకలో చాలామంది జేబుల్లో నుంచి ఆయన ప్రవచన ధార ప్రవహిస్తూంటుంది.
కోటికొక్కరికే సాధ్యం అయ్యే అసా”ధారణ”శక్తి, ఆకర్షణశక్తి, జ్ఞాపకశక్తి,
సరస్వతీకటాక్షం ఆయన సొంతం. ఆయన వస్తున్నట్టు తెలిస్తే ఆ ప్రాంగణాలు,
ప్రాంతాలు కిక్కిరిసిపోతాయి.
బోధించడమే
కాదు..ఆచరించి చూపడం ఆయన విశిష్టత. హైందవం పరాయికరణ చెందుతున్న ప్రమాదకర
దశలో ఆయన బోధలు మేలుకొలుపుగా నిలిచాయి. హిందు ధర్మాచరణ, కర్మాచరణ పట్ల
మళ్లీ విశ్వాసాన్ని కలిగించాయి. తన ప్రసంగాలతో యావత్ హిందు జాతికి భక్తి
మార్గంపై ఉన్న అనురక్తిని రెండింతలు చేశారు. ఆయన అత్యంత నిరాడంబరుడు,
ప్రాతఃస్మరణీయులు. వేలాది ప్రసంగాలతో కోట్లాదిమందిని ఆరాధకులుగా చేసుకున్న
ఆదర్శమూర్తి శ్రీ చాగంటి కోటేశ్వరరావు. తమ ప్రభుత్వానికి సలహాదారుడిగా
ఉండటానికి అంగీకరించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రే పొంగిపోయి కృతజ్ఞతలు
చెప్పిన విశిష్ట వ్యక్తి. భక్తి అంటే వయస్సు మీదపడిన తర్వాత వచ్చే వైరాగ్యం
అని, పుక్కిట పురాణాలు వినటం, సంప్రదాయాలు తెలుసు కోవడం టైమ్ కిల్లింగ్
వ్యవహారమని భావించే వాళ్ల మెదళ్లను మార్చి వేసే స్ఫూర్తి మంత్రం చాగంటి. ఓ
ప్రభంజనం వీస్తోంది తెలుగునేల మీద. చాగంటి కోటేశ్వరరావు దాని చిరునామా.
ఎన్నో తెలుగు కుటుంబాల్లో గౌరవ సభ్యుడాయన. ఎందుకంటే, వారి లోగిళ్ళలో ఆయన
ప్రవచనంతోనే వారికి రోజు మొదలవుతుంది. ఆయన గొంతు వినబడుతున్నప్పుడు, వేరే
మరే గొంతూ ఆ ఇళ్ళలో వినబడదు. ఇంటి పెద్ద మాట్లాడుతున్నప్పుడు మిగతా వారంతా
మౌనంగా వినడం మన తెలుగిళ్లలో సంప్రదాయం కదా! ఇళ్ళ సంగతి కాస్సేపు పక్కన
పెడితే, ఎక్కడైనా సరే, వారి ప్రవచన ప్రాంగణాలు భక్త జనంతో కిక్కిరిసి
ఉండటానికి కారణమేమిటి? కూర్చోవడానికి కుర్చీ దొరకడం మాట అటుంచి కనీసం
నిలబడటానికే స్థలం సరిపోనంతగా ఎదిగిన ఉన్నత ఆధ్మాత్మిక శిఖరం బ్రహ్మశ్రీ
చాగంటి కోటేశ్వర రావు గారు. అందుకే ఆయన ప్రాత:స్మరణీయులు అయ్యారు లక్షలాది
తెలుగువారికి.
ఎన్నెన్నో
వ్యక్తిగత, మానసిక, ప్రవర్తన సంబంధిత సమస్యలకి పరిష్కారం డివోషన్. దానిని
ఎమోషనల్ గా కనెక్ట్ చేస్తూ… రిలీఫ్ ఇచ్చే బిలీఫ్ చాగంటి గారు. భక్తి ఓ
భుక్తి మార్గం అయిపోయిన రోజుల్లో…డబ్బే ఆధ్యాత్మిక అవసరాలకి వారధి కడుతున్న
కాలంలో…ఓ ధార్మిక పవనం తెలుగు రాష్ట్రాల్లో రివ్వున వీస్తోంది. అద్భుతాలు
చేస్తోంది. భారత రామాయణ భాగవత భగద్గీతలకి ఆయన అభినవ దూత. లలితా సహస్రం నీ
సమస్యకి పరిష్కారం తెలుసా? ర్యాంకుల కోసం పడికొట్టుకుపోకండి…విభీషణుడు నీ
గురించి ఓ మాట చెప్పాడు విను…. పార్వతీ దేవికీ నీలాగే ఓ సందేహం వచ్చింది.
దానికి పరమశివుడు చెప్పిన సమాధానం ఇప్పటికీ నిలిచిన వాస్తవం ఇదిగో
తెలుసుకో… అంటూ కలుపుగోలుగా ఆయన చెప్పే ప్రవచనం… నిజానికి ఆధ్యాత్మిక
ఉత్తేజం. ప్రసార మాధ్యమాల విస్తృతి… అంసఖ్యాకమైన అభిమానజనం…నెత్తినెట్టుకు
కొలిచేంత ఆకర్షణ ఉన్నా ఆయన నడత ముందు అవన్నీ చాలా చిన్న సంగతులుగా
తోస్తాయ్.
డొక్కశుద్ధి
ఉండొచ్చు. కానీ తెలిసిన విషయాల్ని సామాన్యులకి పంచాలన్న చిత్తశుద్ధి
ఎందరికుంటుంది చెప్పండి ? జీవితం ఊక మీద పొర్లడం లాంటిది. నీకు అంటుకునేది
చివరికి నీతో వచ్చేదీ ఏం లేదు… నాకు తెలిసింది నేను చెప్తున్నానంతే… ఏమీ
ఆశించి కాదు. ఇదివరకు నా భోజనం కూడా నేనే తెచ్చుకునేవాడిని… ఇప్పుడు చక్కెర
వ్యాధి కదా…అందుకని అప్పుడప్పుడూ పళ్లో పలహారమో కాస్త ఎంగిలి పడుతున్నా…
అంతకు మించి మీరేం శుశ్రూషలు చేయకండి… అంటూ ఆయన సున్నితంగా తనదైన పద్ధతిలో
తిరస్కరిస్తారు రాచమర్యాదని. అది ఆయన రాజముద్ర. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.
భార్యకీ సర్కారీ కొలువు. ఒక కూతురు, ఒక కొడుకు. కుటుంబ బాధ్యతలూ తీరినయ్.
ఇంతటి సౌకర్యవంతమైన జీవితాన్ని కూడా తోసిరాజని… నిరంతర ప్రయాణాలతో చిరంతర
ప్రసంగాలు సాగిస్తూ అనంత ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలుగు నేల నాలుగుచెరగులూ
వ్యాప్తి చేస్తున్న జ్ఞానవాహిని చాగంటికి గారికి వేన వేల వందనాలు.
No comments:
Post a Comment