Tuesday, November 14, 2017

08/11/17, 8:54:45 AM: Mani-TTE-Tenali: *శివ తాండవం*
🕉🔔🕉🔔🕉🔔🕉🔔🕉
సమస్త జగత్తుకే తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులు. వారు నాట్యప్రియులు. ఇద్దరూ కలిసి కైలాస పర్వతంపై ఆనంద నాట్యం చేస్తారంటున్నాయి పురాణాలు. పార్వతి చేసే నాట్యానికి ‘లాస్యం’ అని, శివుడి నాట్యానికి ‘తాండవం’ అని పేరు. ఉభయులు సాగించే లాస్య తాండవాలే లోకానికి క్షేమదాయకాలని ప్రాచీన సాహిత్యం ప్రవచిస్తోంది.
శివ తాండవ నృత్యం ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే, అకుంఠిత శివార్చనాతత్పరుడైన రావణుడి ‘శివ తాండవ స్తోత్రం’ చదవాల్సిందే. అతడు శివుడికి ప్రియ భక్తుడు. అది అపూర్వం. అనితరసాధ్యం. శివుడి కరుణ కోసం కైలాస పర్వతాన్నే ఎత్తిపట్టుకోవడానికి సిద్ధమయ్యాడంటే, రావణుడి శివభక్తి పారమ్యం అపారం. తన పేగులనే తెంచి, వీణాతంత్రులుగా మార్చి, శివ స్తుతి చేసిన ధన్యుడు రావణుడు. అతడు లంకానగరంలో ప్రతి నిత్యం సూర్యోదయం లోపే కోటి శివలింగాల్ని అర్చించేవాడంటే, ఆశ్చర్యం కలగక మానదు. ఇంతటి భక్తుడైన రావణుడి శివ తాండవ స్తోత్రం ఎంతో రమణీయం.
శివుడి జటాజూటం అనంతమైన ఆకాశ గోళమే! దానికి ఆది, అంతం లేవు. అందుకే ఆయనకు వ్యోమ(ఆకాశ)కేశుడు అని పేరు. అంతంలేని ఆకాశగోళం లాంటి శివుడి జటాజూటం నుంచి ఉత్తుంగ తరంగాలతో పెల్లుబికి ఎగిసే గంగానది, సుడులు తిరుగుతూ నృత్యం చేస్తుంది. తాండవం చేస్తున్న శివుడి నొసలు కదులుతూ పలు భంగిమల్ని ప్రదర్శిస్తుంటాయి. మూడో కంటి నుంచి రేగే మంటలు, ఆయన నృత్యానికి తాళం వేస్తున్నట్లు కదలాడుతుంటాయి.
ఇలా ఒకవైపు గంగానది రూపంలో నీళ్లు, ఫాల నేత్ర రూపంలో అగ్ని- ప్రళయాల్ని సృష్టిస్తుంటాయి. ఇవేవీ పట్టనట్లుగా శిరస్సుపై చంద్రుడు ప్రసన్నుడై ఉండి, వెన్నెలతో చిరునవ్వులు చిందిస్తుంటాడు. రావణుడు తన తొలి శ్లోకంలోనే ఇంత అద్భుత వర్ణన చేస్తాడు. అలాంటి చంద్రశేఖరుడిపై తనకు భక్తి అనుక్షణం నిలిచే ఉండాలని కోరుకుంటాడు.
మహేశుడి కడగంటి చూపులతోనే విశ్వమంతా రంగస్థలమవుతుంది. ఒక్క క్షణమైనా ఆగకుండా కదలుతున్న ఆయన చూపులతో, భువనమంతా చైతన్యం సంతరించుకొంటుంది. ఆయన చూపుల్లో పార్వతి చూపులూ కలిసి, వినూత్న శోభను ఆవిష్కరిస్తుంటాయి. పార్వతీ పరమేశ్వరుల చూపుల వర్షంలో తడిసిన ఈ లోకానికి ఇక ఏ ఆపదలూ ఉండవు. అది అమృత వర్షమే! ఆ ఆది దంపతుల చూపుల కలయిక, లోకంలోని భార్యాభర్తల మధ్య అన్యోన్యానురాగం పెంచేదిగా ఉందనడంలో సందేహం లేదు. ఏ జంట అయినా కన్నులపంటగా ఉండాలని శివతత్వం చెబుతోంది. అదే అర్ధనారీశ్వరాద్వైతం!
మహేశ్వరుడు తాండవ నృత్యం చేస్తుంటాడు. ఆయన పాదాల కింద భువనాలన్నీ పీఠభూములై, రంగస్థల వేదికలుగా మారతాయి. ఆ తాండవ నృత్యాన్ని దర్శించడానికి దేవతలందరూ వెళతారు. తలలు వంచి నమస్కరిస్తుంటే, ఆ తలల్లోని పూల నుంచి పుప్పొడులు రాలిపడుతుంటాయి. అవి శివుడి పాదాలు కందిపోకుండా కాపాడుతుంటాయి.
మహేశుడు తల వూపుతూ నృత్యం చేస్తుంటే, జటాజూటం వూడిపోతుంది. పాములు ఆ శిరోజాల్ని బంధిస్తుంటాయి. ఆయన తలపై ఉన్న చంద్రుడు కళల్ని అమితంగా కురిపిస్తుంటాడు. ఆ వెన్నెలను ఆస్వాదించడానికి భక్తులంతా చకోరాలవుతారు. ఆ ఆనందం అమృత ప్రవాహంగా మారుతుంది. ఆయన నొసటి భాగం జ్ఞాన యజ్ఞానికి వేదిక వంటిది. మూడో కన్ను యజ్ఞకుండం. వెలువడుతున్న జ్ఞానాగ్ని- కర్మలను దహించివేస్తుంటుంది. కోరికలు మన్మథుడి వంటివి. అందుకే అతడికి ‘కాముడు’ అని పేరు. శివుడి మూడో కన్ను జ్ఞానాగ్నితో ప్రజ్వరిల్లుతూ, కర్మ అనే మన్మథుణ్ని కాల్చివేస్తుంటుంది. కోరికలపై విజయం అంటే అదే!
జీవుడే కాముడు. అతడికి పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు ఉంటాయి. పూల బాణాల వంటి వాటి బారి నుంచి తప్పించుకోవాలంటే, కోరికల్ని జయించాలి. అది శివుడి ఫాలనేత్రానికే సాధ్యమవుతుంది. అందుకే శివుణ్ని ఆరాధించాలి!

No comments:

Post a Comment