Tuesday, December 5, 2017

05/12/17, 12:06:06 PM: ‪+91 94413 84759‬: *అద్వైత వేదాంత పరిచయం*

*9.1.4  షట్క సంపత్తి :* నాలుగో అర్హత షట్క సంపత్తి. షట్క అంటే ఆరువిధాలు. షట్క సంపత్తి అంటే ఆరువిధాల అంతర్గత నియంత్రణ. కుటుంబాన్ని, సంస్థని లేదా దేశాన్ని మార్చేముందు, తనని తాను మార్చుకోవటం.
*9.1.4.1 శమ: :* శమ: అంటే శాంతి. తేలిగ్గా చెప్పాలంటే మనసు నియంత్రణ.
*9.1.4.2 దమ: : దమ:* అంటే ఇంద్రియ నిగ్రహం.
*9.1.4.3 ఉపరమ: :* బాహ్యంగా చేసే పనులను తగ్గించుకోవటం. ఆత్మ విచారణ చేసుకోవటానికి సమయం ఏర్పరచుకోవటం. విశ్రాంతిగా, ఒత్తిడి లేకుండా సాధన చేయటం.
*9.1.4.4. తితిక్ష: :*  జీవితంలో ఎదురయ్యే సవాళ్ళను ఎదుర్కొనే మానసిక ధైర్యం. జీవితంలోని అన్నిరకాల అనుభవాలని నిర్వికారంగా భరించటం. దీన్నే స్థితప్రజ్ఞత అని కూడా అంటారు.
*9.1.4.5  శ్రద్ధ: :* శ్రద్ధ అంటే శాస్త్రం మీద, శాస్త్రాన్ని అధ్యయనం చేయటానికి తోడ్పడే గురువు మీద నమ్మకం కలిగి ఉండటం. నమ్మకం అంటే గుడ్డినమ్మకం కాదు, కాని మనకు విషయం సరిగ్గా అర్థమయ్యేదాకా శాస్త్రం చెప్పింది అంగీకరించటానికి సిద్ధపడే మనసు. చెప్పింది చెప్పినట్టుగా స్వీకరించటం, ముందే శంకలు పెట్టుకోకుండా. ఇటువంటి అణకువ
ఉంటే, నాకే అన్నీ తెలుసనే జ్ఞానమదం ఉండదు. శాస్త్ర అధ్యయనానికి జ్ఞానమదం పెద్ద అడ్డంకి.
*9.3. యమ - నియమాలు :*
  మనకి కర్మయోగం మొదటి మూడు అర్హతలని (వివేకం, వైరాగ్యం, ముముక్షుత్వం) యిస్తే, ఉపాసనాయోగం నాలుగో అర్హతని (షట్కసంపత్తి) ఇస్తుందని చూసాం. సాధనచతుష్టయం పొందటానికి, ఈ రెండూ చాలవు. దానికి ఇంకోటి కూడా కావాలి. అది నైతిక విలువలని పాటించే జీవన శైలి.
  నైతిక విలువలు ఏవి? శాస్త్రాల్లో, అనేకచోట్ల ఎన్నో నైతిక విలువలని సూచించటం జరిగింది. అందులో, పది విలువలు చాలా ముఖ్యం. అవి లేనిదే సాధన చతుష్టయం అసాధ్యం. సాధనచతుష్టయం లేనిదే జ్ఞానయోగం అసాధ్యం. జ్ఞానయోగం లేనిదే జ్ఞానం అసాధ్యం. జ్ఞానంలేనిదే మోక్షం అసాధ్యం. మోక్షం లేనిదే స్వేచ్ఛ అసాధ్యం. స్వేచ్ఛ లేకపోతే మనం బెంగలు, ఒత్తిడులు వగైరాలకి బానిసలయి, దు:ఖభూయిష్టమైన సంసారంలో పడి కొట్టుకుపోతాం. పది విలువలని ‘టెన్‌ కమాండ్‌మెంట్స్‌’ ని రెండు తెగలుగావిభజించవచ్చు. 1. యమ, 2. నియమ.
9.3.1 ఐదు నిషిద్ధకార్యాలు  యమ : మొదటి తెగలో చేయకూడని పనులు వస్తాయి.
*9.3.1.1. హింస వర్జనం :* వర్జనం అంటే వదలటం. హింస అంటే బాధించటం. మనోవాక్కాయ కర్మలద్వారా ఏవిధంగానూ ఎవరినీ బాధించ కూడదు. ఒక్కముక్కలో చెప్పాలంటే అహింస పాటించాలి. కొన్ని హింసలు చేయకుండా తప్పించుకోగలము కొన్ని తప్పించుకోలేము.
  తప్పించుకోగలిగిన హింసలని తప్పించుకోవాలి, తప్పించుకోలేని హింసకి, ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. పంచమహా యజ్ఞాలు చేయటం ద్వారా ప్రాయశ్చిత్తం చేయవచ్చు. పంచమహా యజ్ఞాలు 1. భూత యజ్ఞం  2. దైవ యజ్ఞం  3. మనుష్య యజ్ఞం 4. పితృ యజ్ఞం5. ఋషి యజ్ఞం
*9.3.1.2 అసత్య వర్జనం  :* అసత్యం చెప్పకుండా ఉండటం. దీనినే అనృత వర్జనం అని కూడా అంటారు. ఇక్కడ కూడా పై సూత్రం వర్తిస్తుంది. తప్పించుకోగలిగిన అసత్యాలను తప్పించుకోవటం, చెప్పక తప్పని అసత్యాలకి, పంచమహా యజ్ఞాల ద్వారా ప్రాయశ్చిత్తం చేసుకోవటం.
  పంచ సూన గృహస్తశ్య పంచయజ్ఞేన నశ్యతి సూన అంటే తప్పించుకోలేని చెడు. గృహస్తుకి అలాంటి తప్పించుకోలేని చెడులు ఎన్నో  ఉంటాయి. దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి.
*9.3.1.3 స్తేయ వర్జనం :* దొంగతనం చేయకుండా ఉండటం. అక్రమ సంపాదన కూడా దొంగతనం కిందకే వస్తుంది. ఎదుటి వ్యక్తికి సక్రమంగా ఇవ్వాల్సిన రొఖ్ఖం ఇవ్వకపోవటం కూడా దొంగతనం కిందికే వస్తుంది.
*9.3.1.4 మైధున వర్జనం :* పరాయి స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకోకుండా ఉండటం. త్రికరణ శుద్ధిగా అక్రమ సంబంధాన్ని వర్జించాలి.
*9.3.1.5 పరిగ్రహ వర్జనం :* అధిక సంపదని ప్రోగేయకుండా ఉండటం. సానుకూల పద్ధతిలో చెప్పాలంటే, వీలున్నంత సామాన్యంగా జీవించటం. అవసరానికి మించి ఉన్నదాన్ని, తక్కినవారితో పంచుకోవటం. ఈ ఐదింటినీ కలిపి యమ అంటారు.
*9.3.2 పాటించాల్సినవి - నియమ: :* ఐదు సానుకూల విషయాలని పాటించాలి.
*9.3.2.1 శౌచం :*పరిశుద్ధత లేదా స్వచ్ఛత. బాహ్యంగా పరిసరాలు
శుభ్రంగా ఉండాలి. ఆలోచనలు కూడా స్వచ్ఛంగా ఉండాలి.
*9.3.2.2 సంతోష: :* చట్టపరంగా సంపాదించిన సొమ్ముతో తృప్తి చెందటం.
  యల్లబసే నిజ కర్మోపాత్తం। విత్తం తేన వినోదయ చిత్తం॥
*9.3.2.3 తప: :* మన మనసుని అదుపులో పెట్టుకోవటానికి పాటించే నియమం ఏదైనా.ఉదా: ఉపవాసం, మౌనవ్రతం.
*9.3.2.4 స్వాధ్యాయ: :*శాస్త్రాన్ని అధ్యయనం చేయటం.
*9.3.2.5 ప్రణిదానం :* సర్వస్య శరణాగతి చూపటం. ఏ అనుభవం కలిగినా దాన్ని దైవం ప్రసాదించిన కర్మఫలంగా స్వీకరించటం. మంచి జరిగినా, చెడు జరిగినా, ప్రతికూల ఆలోచనలు చేయకుండా, వాటిని మహా ప్రసాదంగా స్వీకరించటం. ఈ ఐదు చేయాల్సిన పనులని నియమ అంటారు. యమ, నియమాలు కలిస్తే నైతిక విలువలు పెంపొందుతాయి.
కర్మయోగం + ఉపాసనా యోగం + నైతిక విలువలు = సాధన చతుష్టయం= జ్ఞాన ప్రాప్తికి అధికారి.

సేకరణ
*పైడి నాగ సుబ్బయ్య*

No comments:

Post a Comment