పృచ్ఛకుల సమస్యలకు సందర్భోచిత పూరణలు
అప్రస్తుత సందేహాలకు.. చమత్కారాలే సమాధానాలు
ఈనాడు,
హైదరాబాద్: పృచ్ఛకులు సంధించే సమస్యలు..ఘట్టం రసవత్తరంగా సాగుతున్న
తరుణంలో అప్రస్తుత ప్రసంగీకుడి సందేహాలు..వాటన్నింటినీ అధిగమిస్తూ జంటకవులు
సందర్భోచితంగా చెప్పిన సమాధానాలు..ఇలా రవీంద్రభారతి సమావేశ మందిరంలోని
గుమ్మన్నగారి లక్ష్మీనరసింహశర్మ ప్రాంగణంలో జంటకవులు డా.ముదిగొండ
అమరనాథశర్మ, ముత్యంపేట గౌరీశంకరశర్మల అష్టావధానం రసవత్తరంగా సాగింది.
ఉస్మానియా విశ్వవిద్యాలయం సంస్కృత విభాగం ఆచార్యులు కె.నీలకంఠం అధ్యక్షతన
జరిగిన ఈ అవధానానికి అనుసంధానకర్తగా ఘట్టి కృష్ణమూర్తి, సమావేశకర్తగా
ముదిగొండ నాగరాజుశర్మ, సమన్వయకర్తగా డి.సి.నరసింహులు వ్యవహరించారు. ముఖ్య
అతిథిగా మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డి హాజరయ్యారు. అంత్యాక్షరి,
సమస్య, దత్తపది, వర్ణన, అనువాదం, ఆశువు, నిషిద్ధాక్షరి, అప్రస్తుతం లాంటి
ప్రక్రియలపై పృచ్ఛకుల ప్రశ్నలకు తమదైన శైలిలో సమాధానాలిచ్చిన జంటకవులు
ఆహుతుల్ని అలరించారు. మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ మహాసభల
ప్రారంభోపన్యాసం అందరితోపాటు తనలోనూ భాషాభిమానాన్ని పెంచిందన్నారు.
‘తెల్లోడి భాషపై మోజు వద్దు.. తేనెలూరు మన తెలుగు ముద్దు’ అంటూ కవిత
వినిపించారు.
* ‘ప్రపంచ తెలుగు మహాసభలు కాబట్టి
నాలుగు దేశాల పేర్లతో తెలుగు పండుగను స్వేచ్ఛావృతంలో చెప్పాలంటూ పృచ్ఛకుడు
బి.రాజశేఖర్‌రెడ్డి సంధించిన దత్తపదికి జంటకవులు తగురీతిలో స్పందించారు.
అమెరికా, జపాన్, దుబాయ్, హాలెండ్ దేశాల పేర్లు వచ్చేలా..
‘కాంతిరేఖలమరికల్యాణములు చింద
ఊహలెండిపోగా ఊతమొచ్చె
నుడుల భాష జపానువ్రతాన
మాదుబాయియంటూ ప్రేమతో మమత పంచ’
అంటూ ఆహూతులను అలరించారు.
*
అనువాదం ప్రక్రియలో భాగంగా శ్రీమద్భాగవతం గ్రంథం దశమ స్కంధంలోని
‘శ్రీకృష్ణ లీలలు’ నుంచి దాసోజు పద్మావతి చెప్పిన ‘ఓయమ్మా నీ కుమారుడు మా
ఇండ్లను పాలు పెరుగు మననీడమ్మా’ అన్న పద్యానికి ‘మాతస్వదీయ సుమనోహర దివ్య
పుత్రః’ అన్న సంస్కృత శ్లోకంతో జంటకవులు సభికుల్ని రంజింపజేశారు.
‘ర’సరమ్యమే
‘ర’ అంత్యాక్షరి ప్రక్రియను సంధించినప్పుడు
‘రామచంద్రుని వర్ణించ ప్రేమతోడ..
భక్త గ్రంథమ్ము వెలజించె భాగవతం..
ధన్యపోతన్న తెలంగాణ దార్శనికుడు..
మహిత బంగరు తెలగాణ మధురవీణ’ అంటూ జంటకవులు రాగమాలాపించారు.
* పరుగులు తీస్తున్న మెట్రో రైలును మరిపిస్తూ ఆశువుగా స్వేచ్ఛావృతంలో పద్యం చెప్పమని కోరినపుడు..
‘ఉరుకులతో పరుగులతో
సరసముగా నగర జనులు సంతోషపడున్
ధరలో విద్యుచ్చకటమా
మెరుపుల మురిపించినావు మెట్రో జయహో’ అంటూ మెట్రో ప్రాజెక్టును కీర్తించారు.
* తెలుగు భాషకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన సేవను కొనియాడుతూ..
‘ముద్దులొలికెడి పద్యాల ముఖ్యమంత్రి..
రస తెలంగాణ వీణకు ప్రథమ తంత్రి
ఆయురారోగ్య భోగ్య విద్యా యశశ్రీ
అగుచు జీవించుగాక చంద్రార్కముగను’ అంటూ సభకు హాజరైన బ్రహ్మశ్రీ నాగఫణిశర్మ ప్రశంసించారు.
అసందర్భ ప్రశ్నలు..చెళ్లుమనే చమత్కారాలు
అవధానం
రసవత్తరంగా సాగుతున్న తరుణంలో అప్రస్తుత ప్రసంగీకుడు నీలకంఠం అసందర్భంగా
అడిగిన సందేహాలకు జంటకవులు సందర్భోచితంగా స్పందించారు.
‘అర్ధాంగి
అంటే అర్థమేమిటంటే..‘తెలంగాణలో అంగి అంటే చొక్కా అని అర్థం. అర్ధాంగి అంటే
సగం చొక్కా అనుకోవచ్చు. భార్య..భర్తలో సగం భవ్యశంకరుడు.’ అంటూ
ప్రత్యుత్తరమిచ్చారు.
* లలిత జ్యుయెలరీ వారి
గుండు బాగుందా? కట్టప్ప గుండు బాగుందా? అన్న ప్రశ్నకు ‘ఏ గుండు లేకుండా
ఉంటే బాగుండు, గుండుమీద పుండు, చుండ్రు లేకుంటే ఇంకా బాగుండు, మనకు గుండు
చేయకుంటే చాలా బాగుండు’. అని సమాధానమిచ్చారు.
*
అవధానులు గారూ మిమ్మల్ని అందరూ పండితులు అంటున్నారు. నాకొక చిన్నసందేహం.
‘అధిక విద్యావంతులు అప్రయోజకులైరి..పూర్ణశుంఠలు సదా పూజ్యులైరి’ అంటారు.
మిమ్మల్ని ఏమనుకోవాలి? అన్నప్పుడు ‘అందులో ఆశ్చర్యమేముందండీ..మొదటిభాగం
మేము, రెండో భాగం మీరు’ అనడంతో కరతాళ ధ్వనులుమిన్నంటాయి.
No comments:
Post a Comment