Saturday, June 8, 2019

By MALLIKHARJUN 
32. రత్నగ్రైవేయ చింతాకలోల ముక్తాఫలాన్వితా 

రత్నములు, బంగారము ,ముత్యములతో చేయబడిన కంఠాభరణములను దాల్చినది అని అర్థము . 
కంఠము ఊర్ధ్వ లోకమునకు,మానవ లోకమునకు మధ్యస్థమైన లోకము . మానవ ప్రజ్ఞ, విశిష్ట శుద్ధి  నొందనిదే  దివ్య లోకానుభవములకు పాత్రత పొందదు.ఈ నామమున చెప్పబడిన కంఠాభరణములలో రత్నములు, ముత్యములు, బంగారము ఉన్నవి . రత్నములు బంగారములో పొదగబడినవి . అవి కంఠమున అలంకరించగా చలించుచున్న ముత్యపు హారము ఒకటి కంఠాభరణమునకు తగుల్కొని యున్నది . ముత్యపు హారము చలించుట మనో చాంచల్యమును సూచించును . ఈ చపల స్వభావము ఉపాసకుని కంఠములందు చింతములు కలవారిగా సూచించును . చింతలను గురించి దేవిని ధ్యానించు వారు ఈ కదులుచున్న ముత్యపు హారము వంటి వారు. ముత్యమునకు, చంద్రునకు , మనస్సునకు గల స్వాభావిక సంబంధమును యిచ్చట గమనించదగును . 

కంఠమున పరిశుద్ధి కలిగినకొలది నిశ్చలమైన రత్నము , బంగారము కాంతులు దర్శనమగును . అంతకుపూర్వం చంచలమైన ఆరాధన ఇప్పుడు నిశ్చలమైన ఆరాధనగా పరిణతి చెందును . క్రిందవున్న ముత్యపుహారము తను స్వభావము, దేవి స్వభావము మిశ్రమముగా నుండుటచే కదులుచు నుండును . దానికి ఆధారమైన కంఠాభరణము జీవుని  భూమికయైన దేహపుంజము (మనస్సు , ఇంద్రియములు , శరీరము )అధిష్టించి యున్న ప్రజ్ఞకు సంకేతము . నిశ్చలమైన కాంతిలోక ప్రవేశమునకు కూడా సంకేతము .ఇట్టి వారు దేవిని నిశ్చలముగా ధ్యానము చేయగలరు . 

పై నిశ్చలత్వమును పొందుటకు ఉపాసకుడు వాఙ్మయ తపస్సును చేయవలసియుండును . కంఠపు లోయనుంచి వచ్చు శభ్దములను
దైవముగా దర్శించి మాట్లాడుట ఈ తపోనియమము . ఎట్టి పరిస్థితులలోను అశ్లీలము , అపవిత్రము , అబద్ధము కలుగచేయు ధ్వనులను పలుకరాదు . కంఠాభరణమును , దానిమధ్య వ్రేలాడు ముత్యపు హారమును పై విధముగా ఆరాధన చేయట ఉపశకునకు శ్రేయస్కరము . 
ఓం శ్రీ మాత్రే నమః...

(శక్తి ఆరాధన శ్రీచక్ర ఉపాసన)
శ్రీ గురు దత్త🚩🚩

No comments:

Post a Comment