Saturday, June 29, 2019

పాంచభౌతికంబు ప్రాణుల దేహము/
జీవుడున్నవరకె జిలుగు వెలుగు/
పంచభూతములకు ప్రభువువు నీవెగా/
శివపురీశ దేవ చిద్విలాస/🙏

ఏలుకొనెడి దొరవు ఏకాంబరేశ్వరా//
భృతివి ధృతివి నీవె పృధ్విలింగ!/
కరుణజూపు తల్లి కామాక్షి విభుడవు/
శివపురీశ దేవ చిద్విలాస/🙏

జలమునందు వెలసి జంబుకేశ్వరునిగా/
రంగధామమందు పొంగు నీట/
జగములేలుసామి జలలింగమైతివా/
శివపురీశ దేవ చిద్విలాస/🙏

అరుణగిరిని చుట్టుటవని పరిక్రమము/
అగ్నిలింగమమరనాధు డిచట
ఆత్మజ్ఞానమొసగు అరుణాచలేశ్వరా!/
శివపురీశ దేవ చిద్విలాస/🙏

ఊపిరున్నవరకె ఉనికి జీవులకని/
వాస్తవంబు తెలుపు వాయులింగ/
కల్మషముల కడుగు కాళహస్తీశ్వరా!/
శివపురీశ దేవ చిద్విలాస/🙏

అంబరమున నిల చిదంబర నిలయుడు/
తాండవమును సల్పు తన్మయమున/
నట్టువాంగమిచట నటరాజ వేదిక/
శివపురీశ దేవ చిద్విలాస/🙏

పృధివ్యాపస్తేజోవాయురాకాశాత్ ... పంచభూతముల నిర్దేశకుడు మహాదేవుని స్మరిస్తూ పద్యకుసుమాంజలి 🙏 by Subrahmanyam M

No comments:

Post a Comment