Thursday, October 26, 2017

22/10/17, 10:25:29 PM: Mani-TTE-Tenali: మహావిష్ణువు అవతార ఘట్టాలు కేవలం పురాణ కథలు కావు. రాక్షస సంహారానికే పరిమితమైనవీ కావు. అవి మానవాళికి నీతిమార్గ ప్రబోధకాలుగా ఉంటాయి. మార్గదర్శకత్వం వహిస్తాయి. ఆ ఘట్టాలు భక్తితత్వాన్ని ప్రస్ఫుటపరచి, ఆధ్యాత్మిక కాంతులు ప్రసరింపజేస్తాయి. మానవ జీవన పరమార్థాన్ని విశదపరుస్తూ, సదా తోడునీడగా నిలుస్తాయి.

భగవానుడి లీలాగాథలు అనేకం. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాల్ని అదుపుచేసే శక్తిని మనిషికి అవి ప్రసాదిస్తాయి. అతడు నిత్య జీవితంలో అనుష్ఠించాల్సిన నియమాల్ని, పాటించాల్సిన ధర్మాల్ని తేటతెల్లం చేస్తాయి. ఆ పురాణ ఘట్టాలు- వేదోపనిషత్తుల సారాన్ని అందరికీ సరళంగా, సులభంగా అర్థమయ్యేలా వివరించే విజ్ఞాన భాండాగారాలు!

విష్ణువు ఆవతారాల్లో నాలుగోది నరసింహావతారం. సర్వమయుడైన విష్ణుదేవుడి విశ్వరూపాన్ని అది తెలియజెబుతుంది. చెక్కుచెదరని భక్తితత్వం ఒక్కటే భగవంతుణ్ని ప్రసన్నం చేసుకుంటుందన్న సందేశమిస్తుంది.

నరసింహుడిది పూర్తిగా నరరూపం కాదు. సింహరూపమూ కాదు. రెండూ ఏకమైన ఆకృతి అది! చూడగానే భీతి కలిగించే రూపం.

విధాతను హిరణ్యకశిపుడు అనేక వరాలు కోరాడు. వాటి ప్రకారం, సాధారణంగా అతణ్ని ఎవరూ ఏ విధంగానూ చంపలేరు. యజ్ఞ వరాహమూర్తిగా అవతరించి హిరణ్యాక్షుణ్ని వధించిన శ్రీమన్నారాయణుడు, ఆ తరవాత హిరణ్యకశిపుడి సంహారానికి ఉగ్ర నరసింహ అవతారం ధరించాడు. విధాత వరాలకు భంగం వాటిల్లకుండానే, దానవ సంహారం పూర్తిగావించాడు. ఆ స్వామిది నరుడు, మృగం కాని నరసింహ రూపం. అది రాత్రి, పగలు కాని సంధ్యాసమయం. ఆ స్థలం గృహానికి వెలుపల కాదు. లోపలా కాదు. ద్వారం మధ్యలో- ఆకాశం, భూమి కాని చోట నరసింహుడి తొడలపై రాక్షస వధ పూర్తయింది. ప్రాణ సహితాలు లేదా రహితాలు కాని గోళ్లతో ఆ దానవుడి ఉదరభాగాన్ని చీల్చివేశాడు. హిరణ్యకశిపుడి సంహారంతో, అన్ని లోకాల్నీ అంతకాలమూ పట్టిపీడించిన పెనుసమస్య పరిష్కారమైంది.

యజ్ఞం, వేదం, ధర్మం, గోవులు ఎక్కడ ఉంటాయో అక్కడ లక్ష్మీసమేత నారాయణుడుతప్పక ఉంటాడు. ఆయన ముఖ్య ఆవాసం మానవ హృదయమే!

ప్రహ్లాదుడు పరమ భక్తుడు. తనలో కొలువై ఉండే నారాయణ రూపాన్ని నిరంతరమూ స్మరించుకునేవాడు. అందులోనే ఆనందం పొందేవాడు. మూఢత్వం మూర్తీభవించినవాడు హిరణ్యకశిపుడు. దైవద్వేషం, అహంకారం అతడి మమకారాన్ని సైతం తుంచివేసింది. కుమారుణ్ని పలురకాలుగా హింసించడమే దీనికి తార్కాణం. ‘భగవానుడు సర్వవ్యాపి అంటావా? రుజువు చూపించు’ అని హుంకరించాడు. అక్కడి స్తంభంలో చూపాలని ప్రహ్లాదుణ్ని గద్దించాడు. దాన్ని గదతో రెండుగా చేశాడు. అంతే! మహోగ్రరూపంతో నారసింహుడు ఆవిర్భవించడం, ఆ దానవుణ్ని హతమార్చడం జరిగిపోయాయి.

బ్రహ్మాదులు, ఇతర దేవతాగణం ఎంతగా స్తుతించినా- నారసింహుడు శాంతించలేదు. మహాలక్ష్మి సైతం ఆ ఉగ్రరూపాన్ని చూసి భీతి చెందింది. మహాభక్తుడైన ప్రహ్లాదుడి ప్రార్థనతో స్వామి శాంతించాడు. ఆ భక్తికి దాసుడయ్యాడు. అనంతరం, అంతటి ఉగ్రరూపమూ వెన్నెల కురిపించింది.

అప్పుడు ప్రహ్లాదుడు అంటాడు- ‘దేవా! నిన్ను సంతోషపరచడానికి, నీలో సాయుజ్యం పొందడానికి లోకంలో ఏవీ సరిపోవు. నీ ముందు ప్రతాప పౌరుషాలు, సౌందర్యాలు, సత్కార్యాలు, పుణ్యాలు, నైపుణ్యాలు అసలే పనిచేయవు. జప తపాలు, వేదాధ్యయనాలు సైతం నీ ఎదుట వృథా అవుతాయి. ఎందరికి ఎంత ప్రజ్ఞ కలిగినా, బలమున్నా, ఎన్ని నియమ నిష్ఠలున్నా అవేమీ నీ ముందు కొరగావు. నిశ్చలమైన భక్తి ఒక్కటే మార్గం. నిరంతరమూ దివ్యనామ స్మరణే నీ అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది’ అని చేతులు జోడిస్తాడు ప్రహ్లాదుడు. అతడి నోటి వెంట ‘భాగవతం’ కర్త పోతన పలికించిన ఆ మాటలే భక్తితత్వ ఆంతర్యానికి సూచికలు!

No comments:

Post a Comment