21/10/17, 5:41:04 PM: +91 94401 56845: కార్తీకపురాణం - రెండవ రోజు పారాయణము
తృతీయాధ్యాయము
బ్రహ్మర్షి
ఐన శ్రీ రాజర్షి ఐన జనకునికి ఇంకా ఇలా చెప్పసాగాడు; ‘రాజా! స్నాన దాన జప
తపాలలో దేనినిగానీ, కార్తీకమాసంలో ఏ కొద్దిపాటిగా ఆచరించినప్పటికీ కూడా –
అది అక్షయమైన ఫలాన్నిస్తుంది. ఎవరైతే సుఖలాలసులై శరీర కష్టానికి జడిసి
కార్తీక వ్రతాన్ని ఆచరించరో, – అటువంటి వాళ్ళు వంద జన్మలు కుక్కలుగా
పుడతారు.
శ్లో || పౌర్ణమ్యాం కార్తీకమాసి స్నానాందీస్తూ నాచరన్ |
కోటిజన్మసు చండాలయోనౌ సంజాయతే నృప ||
శ్లో || క్రమాద్యోనౌ సముత్పన్నో భవతి బ్రహ్మరాక్షసః |
అత్రై వోదాహరంతీ మ మితిహాసం పురాతనమ్ ||
భావం:
కార్తీక పౌర్ణమి నాడు, స్నాన దాన జపోపవాసాలలో ఏ ఒక్కటీ ఆచరించని వాళ్ళు
కోటి పర్యాయాలు చండాలపు యోనులలో జన్మించి, తుదకు బ్రహ్మరాక్షసులుగా
పరిణమిస్తారు. ఇందుకు ఉదాహరణంగా ఒక గాథను చెబుతాను విను.
తత్వనిష్టోపాఖ్యానము:
అతి
పూర్వకాలంలో ఆంధ్రదేశం లో తత్వనిష్ఠుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. సకల
శాస్త్ర పారంగతుడు, అసత్యములను పలుకని వాడూ, అన్ని భూతముల యందునూ దయాళువూ,
తీర్థాటన ప్రియుడూ అయినా ఆ విప్రుడు ఒకానొక తీర్థయాత్రా సందర్భముగా
ప్రయాణిస్తూ మార్గమధ్యములో గోదావరీ తీరానగల ఒకానొక ఎత్తైన మర్రిచెట్టు మీద –
కారు నలుపు కాయచ్చాయ గలవాళ్ళూ, ఎండిన డొక్కలు కలవాళ్ళూ, ఎర్రని నేత్రములు –
గడ్డములూ కలవాళ్ళూ, గుచ్చబడిన ఇనుపతీగెలకు మల్లే పైకి నిక్కీ వున్నా
తలవెంట్రుకలతో, వికృత వదనారవిందాలతో, కత్తులూ, కాపాలాలూ ధరించి, సర్వ జీవ
భయంకరులుగా వున్నా ముగ్గురు బ్రహ్మరాక్షసులు చూశాడు. ఆ రాక్షసులవలన భయము
చేత ఆ మర్రిచెట్టు నాలుగు వైపులా కూడా పన్నెండు మైళ్ళు దూరంలో ఎక్కడా
ప్రాణి సంచారమనేదే ఉండేది కాదు. అటువంటి భయంకర స్వరూపులైన ఆ రాక్షసులను
అల్లంత దూరం నుంచే చూసిన తత్వనిష్ఠుడు అదిరిపడ్డాడు. దానితో బాట ఆ
రాక్షసులు కూడా తనను చూడటంతో మరింత భయపడినవాడై – శోకాకులచిత్తముతో
శ్రీహరిని స్మరించసాగాడు
తత్వనిష్ఠుడి శరణాగతి:
శ్లో || త్రాహి దేవేశ లోకేశ! త్రాహి నారాయ ణావ్యయ
సమస్త భయవింధ్వంసిన్! త్రాహిమాం శరణాగతం
వ్యాసం పశ్యామి దేవేశ! తత్వోహం జగదీశ్వర ||
అంటే
– “దేవతలకూ, లోకాలకూ కూడా యజమానివయినా వాడా ! నారాయణా ! అవ్యయా ! నన్ను
కాపాడు. అన్ని రకాల భయాలనూ అంటాము చేసేవాడా ! నిన్నే శరణుకోరుతున్న నన్ను
రక్షించు. ఓ జగదీశ్వరా! నువ్వు తప్ప ఇంకొక్క దిక్కు ఎరుగని వాడను. నన్ను
కాపాడు రక్షించు” అని ఎలుగెత్తి స్మరించుచు రాక్షస భయముతో అక్కడ నుంచి
పారిపోసాగాడు. అతనిని పట్టి వధించాలనే తలంపుతో ఆ రాక్షసత్రయము అతని వెనుకనే
పరుగెత్తసాగినది. రక్కసులా పారునికి చేరువవుతున్న కొద్దీ, సాత్వికమైన
విప్ర తేజస్సు కంటబడటం వలనా – తెరిపి లేకుండా అతనిచే స్మరించబడుతూన్న
హరినామము చెవులబడుట వలనా – వెంటనే వారికి జ్ఞానోదయమైంది. అదే తడవుగా ఆ
బాపనికి ఎదురుగా చేరుకొని, దండ ప్రణామాలాచరించి, అతనికి తమ వలన కీడు
కలుగబోదని నమ్మబలికి, ‘ఓ బ్రాహ్మణుడా! నీ దర్శనంతో మా పాపాలు నశించిపోయాయి.
అని పునః పునః నమస్కరించారు. వారి నమ్రతకు కుదుట పడిన హృదయముతో –
తత్వనిష్ఠుడు ‘మీరెవరు? చేయరాని పనులు వేనిని చేయడం వలన ఇలా అయిపోయారు? మీ
మాటలు వింటుంటే బుద్ధిమంతుల్లా వున్నారు. మరి ఈ వికృత రూపాలేమిటి? నాకు
వివరముగా చెప్పండి. మీ భయభధావళి తొలగే దారి చెబుతాను’ అన్నాడు.
ద్రావిడుని కథ:
పారుని
పలుకులపై, ఆ రక్కసులలో ఒకడు తన కథనిలా వినిపించసాగాడు. ‘విప్రోత్తమా! నేను
ద్రావిడుడను. ద్రావిడ దేశమందలి మంధరమనే గ్రామాధికారినైన నేను, కులానికి
బ్రాహ్మణుడనే అయినా – గుణానికే కుటిలుడనీ, వంచనామయ వచః చమత్కారుడినీ అయి
ఉండేవాడిని. నా కుటుంబ శ్రేయస్సుకై అనేక మంది విప్రుల విత్తాన్ని
హరించాను. బంధువులకుగాని, బ్రాహ్మణులకుగాని ఏనాడూ పట్టెడన్నమయినా పెట్టి
ఎరుగను. నయవంచనలతో బ్రాహ్మణా ధనాన్ని అపహరించడం చేత నా కుటుంబము నాతో సహా
ఏడూ తరాల వాళ్ళు అధోగతుల పాలయిపోయారు. మరణానంతరము దుస్సహమైన నరకయాతనలు
అనుభవించి చివరికిలా బ్రహ్మరాక్షసుడనయ్యాను. కృపాయత్త చిత్తుడవై నాకు
ముక్తినిచ్చే యుక్తిని చెప్పు’ అన్నాడు.
ఆంధ్రదేశీయుని గాథ:
రెండవ
రాక్షసుడిలా విన్నవించుకోసాగాడు – ‘ ఓ పవిత్రుడా ! నేను ఆంద్రుడను.
నిత్యమూ నా తల్లిదండ్రులతో కలహించుచు, వారిని దూషించుచు ఉండేవాడిని. నేను
నా భార్యాపిల్లలతో మృష్టాన్నన్ని తింటూ, తల్లిదండ్రులకు మాత్రం చద్ది
కూటిని పడవేసేవాడిని. బాంధవా బ్రాహ్మణా కోటికేనాడూ ఒక పూటయినా భోజనము
పెట్టక – విపరీతముగా ధనార్జన చేసి ఆ కావరముతో బ్రతికేవాడిని. ఆ శరీరము కాలం
చేసాక నరకానపడి ఘోరాతిఘోరమైన బాధలనుభవించి చివరికి ఇక్కడిలా పరిణమించాను. ఆ
ద్రావిడునికివలెనే – నాకు కూడా ముక్తి కలిగే దారిని బోధించుము’ అని
అన్నాడు.
పూజారి కథ:
అనంతరం
మూడవ రాక్షసుడు ముందరకు వచ్చి ఇలా మొరపెట్టనారంభించాడు. ‘ఓ సదాచార
సంపన్నుడా ! నేను ఆంధ్రదేశపు బ్రాహ్మణుడను. విష్ణ్వాలయంలో పూజారిగా
ఉండేవాడిని. కాముకుడనూ, అహంభావినీ, కఠినవచస్కుడనీ అయినా నేను – భక్తులు
స్వామి వారికి అర్పించే కైంకర్యాలన్నిటినీ – నా వేశ్యలకు అందచేసి, విష్ణు
సేవలను సక్రమముగా చేయక గర్వముతో తిరిగేవాడిని. తుదకు గుడి దీపాలతో నూనెను
కూడా హరించి, వేశ్యలకు ధారపోసి వారితో సంభోగ సుఖములనుభవించుచు పాపపుణ్య
విచక్షణా రహితుడనై ప్రవర్తించేవాడిని. ఆ నా దోషాలకు ప్రతిఫలంగా నరకమును చవి
చూసి, అనంతరము ఈ భూమిపై యోనులలోనూ, నానా నీచ జన్మలనూ ఎట్టి కట్టకడికీ
బెట్టిదయిన బ్రహ్మరాక్షసునిగా పరిణమించాను. ఓ సదాయుడా! నన్ను మన్నించి –
మరలా జన్మించే అవసరం లేకుండా – మోక్షాన్ని పొందే మార్గాన్ని ప్రవచించవయ్యా’
అని ప్రార్ధించాడు.
బ్రహ్మరాక్షసులు ఉత్తమగతి పొందుట:
తమ
తమ పూర్వ భవకృత మహాఘరాశికి – ఎంతగానో పాస్చాత్తాప పడుతోన్న ఆ రక్కసులకు
అభయమిచ్చి ‘భయపడకండి – నాతో కలిసి కార్తీక స్నానానికి రండి. మీ సమస్త
దోషాలూ నశించిపోతాయి’ అని చెప్పి వారిని తన వెంట బయలుదేర దీశాడా
బ్రాహ్మణుడు. అందరూ కలిసి కావేరీ నదిని చేరారు. అక్కడ తత్వ నిష్ఠుడు –
బ్రహ్మరాక్షసుల నిమిత్తమై సంకల్పం చేసి తానూ స్వయముగా ముందు స్నానం చేసి
పిపిమ్మట రక్కసుల చేత కూడా స్నానం చేయించాడు. అనంతరము –
శ్లో || అముకానాం బ్రహ్మరాక్షసత్వ నివారణార్థం |
అస్యాం కావేర్యామ్ – ప్రాతః స్నాన మహం కరిష్యే ||
అనే
సంకల్పంతో అతడు విధివిధానంగా స్నానం చేసి, తత్ఫలాన్ని బ్రహ్మరాక్షసులు
ధారపోయగా – వారు విగతదోషులూ – దివ్యవేషులూ అయి తక్షణమే వైకుంఠానికి
ప్రయాణమయ్యారు.
విదేహరాజా ! అజ్ఞానము వలన కానీ,
మోహ – ప్రలోభాలవలన గానీ, ఏ కారణము చేతనైనా గాని – కార్తీక మాస సూర్యోదయ
కాలాన కావేరి నదిలో స్నానమాచరించి, విష్ణువును పూజించిన వాళ్లకు
నిస్సందేహముగా పది వేళా యజ్ఞాలు చేసిన ఫలము కలుగుతుంది. అందువల్ల – ఎదో ఒక
ఉపాయం చేసైనా సరే కార్తీకం లో కావేరి స్నానమును తప్పకుండా చెయ్యాలి. కావేరీ
లో సాధ్యము కాకపొతే గోదావరిలోనైనా, మరెక్కడైనా సరే – ప్రాతః స్నానం మాత్రం
చేసి తీరాలి. అలా ఎవరైతే కార్తీక దామోదర ప్రీతిగా ప్రాతః స్నానము చేయరో,
వాళ్ళు పది జన్మలు ఛండాలపు యోనులలో పుట్టి, అనంతరము ఊరపందులుగా
జన్మిస్తారుసుమా!
కాబట్టి – ఎటువంటి మీమాంసతోటీ నిమిత్తం లేకుండా స్త్రీలుగాని, పురుషులుగాని కార్తీక మాసం లో తప్పనిసరిగా ప్రాతః స్నానం ఆచరించాలి.
చతుర్థాధ్యాయము:
జనకుడు
అడుగుతున్నాడు: “హే బ్రహ్మర్షీ! నువ్వింతవరకూ కార్తీక మహాత్మ్యాన్ని
అసాధారణ ధోరణిలో చెప్పావు. ఐతే ఏ సంకల్పంతో ఈ వ్రతం ఆచరించాలో – ఏ ఏ దానాలు
చేయాలో కూడా తెలియజేయి.”
వసిష్ఠ ఉవాచ: అన్ని
పాపాలనూ మన్ను చేసేదీ, పుణ్యాలను అగన్యాలుగా మార్చేదీ అయినా ఈ కార్తీక
వ్రతానికి ఫలానా ‘సంకల్పము’ అనేది హాస్యాస్పదమయిన విషయము. ఈ కార్తీక వ్రతం
ఆచరించడం వలన నశించనంతటి పాపం అనేది ఇంకా ఈ ప్రపంచంలో పుట్టనే లేదు.
అందువల్ల వ్రత ధర్మాలనూ, తత్ఫలాలనూ చెబుతాను విను.
కార్తీక
మాసపు సాయంకాలము శివాలయంలో దీపారాధన చేయడం వలన అనంతమైన ఫలం వస్తుంది.
శివాలయ గోపురద్వారా, శిఖరాలయందుగానీ – శివలింగ సన్నిధినిగానీ దీపారాధన
చేయడం వలన అన్ని పాపాలూ అంతరించిపోతాయి. ఎవరైతే కార్తీకములో శివాలయములో
ఆవునేతితోగానీ, నువ్వులనూనెతో గాని, ఇప్ప – నారింజ నూనెలతో గాని దీప సమర్పణ
చేస్తారో – వాళ్ళు ధర్మవేత్తలవుతారు. ఆఖరికి ఆముదపు దీపాన్నయినా
సమర్పించిన వాళ్ళు అత్యంత పుణ్యవంతులవుతారు. కనీసము, కాంక్షతో గాని –
నలుగురి నడుమా బడాయి కోసం గానీ దీపాన్నిచ్చే వాళ్ళు కూడా శివప్రియులవుతారు.
ఇందుకు ఉదాహరణ గా ఒక చిన్న కథ చెబుతాను విను.
కార్తీక దీపారాధన మహిమ:
పూర్వము
పాంచాలదేశాన్ని పరిపాలించే మహారాజొకడు, కుబేరుని మించిన సంపద కూర్చుకుని
ఉన్నా, కుమారులు లేని కారణంగా కృంగిపోయిన వాడై, కురంగపాణికై తపస్సుకు
కూర్చున్నాడు. మధ్యకాలంలో అటుగా వచ్చిన పిప్పలుడనే ముని – అతని తప్పస్సుకు
కారణమడిగి తెలుసుకుని, ‘ఓ రాజా! ఈ మాత్రపు కోరికకు తపస్సుతో పనిలేదు.
కార్తీక మాసములో శివప్రీతిగా వ్రతమాచరించి, బ్రాహ్మణులను దీపాదాన దక్షిణలతో
సంతోషపెట్టు. అలా చేస్తే – నీకు తప్పక పుత్రిక సంతానము కలుగుతుందని
చెప్పాడు. ఋషి వాక్యమును శిరోధార్యముగా తలచి – ఆ పాంచాలుడు తన పట్టణము
చేరి, కార్తీక వ్రతమాచరించి, శివప్రీతికై బ్రాహ్మణులకు దీపదానములను చేసాడు.
తత్ఫలముగా మహారాణి నెల తప్పి యుక్తకాలంలో పురుష శిశువును ప్రసవించింది.
రాజా దంపతులు ఆ శిశువుకి ‘శత్రుజిత్తు’ అని పేరు పెట్టారు.
శత్రుజిత్తు చరిత్రము:
ఆ
శత్రుజిత్తు దిన దిన ప్రవర్ధమానుడై పెరిగి యువకుడై, వీరుడై వేశ్యలంగాణా
లోలుడై, అప్పటికీ తృప్తి చెందక, పరస్త్రీరక్తుడై, యుక్తా యుక్త విచక్షణా
నాస్తికుడై, శాస్త్ర ధిక్కరియై వర్ణసంకర కారకుడై హితవు చప్పవచ్చినవారిని
చంపుతానని బెదరించుచు, స్వేచ్చాచారియై ప్రవర్తింపసాగాడు. అటువంటి సందర్భంలో
– సౌందర్యరాశి సింహమధ్యమా, అరటి దోనెలవంటి తొడలు గలదీ, చిలుకవలె చక్కని
పలుకులు గలదీయైన ఒక బ్రాహ్మణా పత్ని తారసిల్లింది. శత్రుజిత్తు ఆమె పట్ల
మోహితుడయ్యాడు. అనుపమానా సౌందర్య, సౌర్య, తేజో విరాజితుడైన ఈ యువరాజుపట్ల ఆ
బాపనిది కూడా మోజు పడినది. తత్కారణముగా – ఆమె రోజూ రాత్రి తన భర్త –
నిద్రపోగానే సంకేత స్థలంలో రాజకుమారుని కలిసి – సురత క్రీడలలో సుఖించేది.
రంకూ-బొంకూ దాగవు కదా! ఎదో విధంగా ఈ సంగతి ఆ బాపని దాని భర్తకు
తెలిసిపోయింది. అది మొదలు అతనొక కత్తిని ధరించి – ఈ రంకు జంటను
ప్రత్యక్షంగా చూసి, వారి గొంతులుత్తరించాలని తిరుగుతున్నాడు.
మహాకాముకురాలయిన జారిణిగాని, ఆ శత్రుజిత్తుగాని ఈ సంగతి ఎరుగరు. రోజులిలా
గడుస్తూ ఉండగా ఒకానొక కార్తీక పౌర్ణమి సోమవారం నాడు రాత్రి ఆ కాముకులు తమ
సురత క్రీడలకై ఒకానొక శిధిల శివాలయాన్ని సంకేత స్థలముగా ఎంచుకున్నారు..
అపరాత్రివేళ
వాళ్ళు అక్కడ కలుసుకున్నారు. గర్భగుడిలో అంతా చీకటిగా ఉంది. ఆ బాపనిది తన
చీరచెంగు చింపి వత్తిని చేసింది. రాజకుమారుడు ఎక్కడినించో ఆముదమును
తెచ్చాడు. ఇద్దరూ కలిసి అక్కడి ఖాళీప్రమిదలో ఆ రెంటినీ జోడించి దీపం
పెట్టారు. ఆ దీపపు వెలుగులో ఒకరి అందాలొకరు చూసుకుంటూ సంభోగములో
లీనమయ్యారు. ఈ విషయాన్ని ఆ బాపన దాని మొగుడెలాగో తెలుసుకున్నాడు. కత్తి
పట్టుకుని వచ్చి ముందుగా శత్రుజిత్తునీ, అనంతరం తన భార్యనూ తెగనరికి – తానూ
కూడా అదే కత్తి తో పొడుచుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ విధంగా వాళ్ళు
ముగ్గురూ ఆ రాత్రి అక్కడికక్కడే విగతజీవులు కాగానే – పాశహస్తులైన యమదూతలూ –
పవిత్రాత్ములైన శివదూతలూ – ఒకేసారి అక్కడకు చేరారు. శివదూతలు
రాకుమారుడినీ, రంకులాడినీ తమ విమానంలో కైలాసానికి తీసుకుపోసాగారు. యమదూతలు
అమాయకపు బాపదిని తమతో నరకము వైపు లాగుకొని పోసాగారు. అందుకచ్చెరుపడిన
పారుడు – ‘ఓ శివదూతలారా! కానీ పని చేసిన వారికి కైలాస భోగము – నా వంటి
సదాచారుడిని నరక యోగమునా?’ అని ప్రశ్నించగా, అందులకా శివదూతలు – ‘వీరెంత
పాపాత్ములయినా – ఈ రోజు కార్తీక పూర్ణిమ సోమవారం కాబట్టి, శివాలయంలో –
అందునా – శిధిలాయములో శివలింగమునకు ఎదురుగా దీపారాధన చేశారు గనక, వారి
పాపాలూ, నేరాలూ నశించి పుణ్యాత్ములయ్యారు. ఏ కారణం చేతనైనా సరే కార్తీక
మాసములో అందునా పౌర్ణమినాడు, పైగా సోమవారంనాడు దేవాలయములో దీపారాధనము చేయడం
వలన అత్యధిక పుణ్యాత్ములైన వీళ్ళని పాపకర్ములుగా భావించి చంపిన కారణముగా
నువ్వు పుణ్యహీనుడివి, పీపాపాత్ముడివీ అయ్యావు. అందుకే నీకు నరకము – అని
చెప్పారు.
బ్రాహ్మణుడికీ, శివపారిషదులకూ జరిగిన
సంభాషణను విన్న శత్రుజిత్తు తానూ కలుగజేసుకుని, ‘ అయ్యలారా! దోషులము
మేమైయుండగా, మాకు కైవల్యమిచ్చి మమ్మల్ని చంపినా పుణ్యాత్ములను చేసిన ఆ
అమాయకుడిని నరకానికి పంపడం భావ్యము కాదు. కార్తీకమాసము దొడ్డదయితే, అందునా
పౌర్ణిమ గొప్పదయితే, సోమవారం మరీ ఘాన్నమియనదయితే, దీపారాధన మరీ
పుణ్యకరమైనదయితే మాతోబాటే కలిసి మరణించిన ఆ బాపనికి కూడా కైలాసమీయక
తప్ప’దాని వాదించడం జరిగింది. తత్ఫలముగా – శత్రుజిత్తు తానూ, తన ప్రియురాలూ
ఆచరించిన వత్తీ, తైలముల పుణ్యము తాముంచుకుని, ఆ దీపమును వెలిగించిన
పుణ్యమును బ్రాహ్మణునికి ధారపోయగా, శివదూతలా విప్రునికూడా యమదూతలు నుండి
విడిపించి – కైలాసానికి తీసికొని వెళ్లారు.
కాబట్టి,
ఓ మిధిలానగరాధీశ్వరా! కార్తీక మాసములో తప్పనిసరిగా – శివాలయములో గాని
విష్ణ్వాలయములో గాని దీపారాధన చేసి తీరాలి. నెల పొడుగునా చేసినవాళ్లు
జ్ఞానులై, తద్వారా మోక్షాన్ని పొందగలుగుతారు. అందునా శివాలయములో చేసిన
దీపారాధన నిరంతర మోక్షప్రదాయినిగా గుర్తించు. నా మాట విని – కార్తీక మాసము
నెల పొడుగునా నువ్వు శివాలయములో దీపారాధన చెయ్యి.’
ఏవం శ్రీస్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యమందు చతుర్దాధ్యాయ సుమాప్తహ
-: రెండవ రోజు పారాయణము సమాప్తము :-
No comments:
Post a Comment