23/05/17, 4:39:46 PM: +91 94413 84759: #భక్తులు_భగవంతుడు
భక్తులు ఎలా ఉంటారు?
ఆ భక్తులను ఆదుకొనే భగవంతుడు ఏం చేస్తుంటాడు?
అనే
విషయాల గురించి వివరించి చెబుతుంది ఈ కథాసందర్భం. ఇది వ్యాసభాగవతం ఏకాదశ
స్కంధం ఇరవైతొమ్మిదో అధ్యాయంలో ఉన్న విషయం. కృష్ణుడి భక్తులైన
ఉద్ధవుడికి, కృష్ణుడికి మధ్య జరిగిన సంభాషణ సారాంశమే ఇది.
దాసోహం అన్నవారిపై దయ..
భక్తుడనేవాడు
ముందుగా మనస్సును అదుపులో పెట్టుకోవాలి. మనోనిగ్రహం ఉన్నవారినే భగవంతుడు
అనుగ్రహిస్తాడు. మనోనిగ్రహాన్ని కలిగిన భక్తుడు భగవంతుడి పాదపద్మాలను
ఆశ్రయించి ఉంటాడు. అలా ఉన్నప్పుడే అనాయాసంగా సిద్ధి కలుగుతూ ఉంటుంది.
అలాంటి భక్తులను భగవంతుడి మాయ దరిచేరదు. యోగాభిమానం, కర్మాభిమానం అనేవి
స్వామి పాదాలను ఆశ్రయించిన వారికి ఉండనే ఉండవు. అలా స్వామికి దాసోహం అంటూ
ఆయన పాదాలను కొలిచేవారికే భగవంతుడు స్వాధీనుడౌతాడు. దీనికి ఉదాహరణగా
రామాయణంలో రామావతారం కనిపిస్తుంది. రాముడు వానరులతో నేస్తం కట్టాడు. ఆ
రోజున రాజా రామచంద్రప్రభువుకు జై అంటూ ఎందరెందరో గొప్పగొప్ప రాజులు తమ
రత్న కిరీటాలను తీసి వినయంగా రాముడి పాదాల ముందుంచి దాసులయ్యారు. అలాంటి
వారిని మాత్రమేకాక సామాన్యమైన వానరులతో రాముడు స్నేహం చేశాడంటే తనను
ఆశ్రయించిన భక్తులంటే భగవంతుడికి ఎంత ఇష్టమో అవగతమవుతుంది. భగవంతుడంటే
విడిగా ఎక్కడో ఉండడు. భక్తుడి గుండెల్లో లోలోపల అంతర్యామిగా ఉంటాడు.
భక్తుడు కాదలచినవాడు చెయ్యాల్సిన ప్రధానమైన పని ఒకటుంది. అదేమంటే తాను చేసే
కర్మలన్నీ భగవంతుడికి సమర్పించటమే. దానితోపాటు నిరంతరం భగవంతుడినే
స్మరిస్తూ ఉండాలి. అలా అలవాటు చేసుకుంటే కొద్దిరోజుల్లోనే మనస్సు, ఆత్మ
స్వామిపరం అవుతాయి. భగవంతుడి మీదే అవి లగ్నమవుతాయి. అలాగే భగవంతుడికి
భక్తుడు కాదలచినవాడు అంతకుముందే భగవంతుడికి భక్తులైన సాధుపురుషులుండే
పుణ్యస్థలాలను దర్శించాలి. పర్వదినాల్లో పితరులతో కలిసికానీ, ఒంటరిగాకానీ,
గీత నృత్యవాద్యాలతో స్వామికి ఉత్సవాలు చేయాలి. ఎప్పటికప్పుడు తన హృదయంలో
ఉన్న భగవంతుడిని చూసుకొంటుండాలి. జ్ఞానదృష్టితో సర్వప్రాణుల్లోనూ, అన్ని
పదార్థాల్లోనూ, భగవంతుడిని దర్శించి అంతా భగవంతుడి స్వరూపమేనని అనుకోవాలి.
మనుషుల్లో కానీ, మరెక్కడా కానీ కుల, వర్గ తదితర భేదాలను పాటించకూడదు.
అన్నింటినీ అందరినీ సమానంగా చూడగలిగినవాడే నిజమైన జ్ఞానవంతుడు. ఇలాంటి
జ్ఞానం ఉన్నవారికి మనస్సులో స్పర్ధ, ఈర్ష్య, తిరస్కారం, అహంకారంలాంటి
దోషాలు తొలగిపోతాయి. సర్వప్రాణులు భగవంతుడేనన్న భావన వచ్చి ఉంటుంది కనుక
వైషమ్యాల వైపు మనస్సు పోదు. సర్వమూ బ్రహ్మమే అన్న భావంతో భక్తులిలా
అభ్యాసం చేస్తే త్వరలోనే జ్ఞానోదయమౌతుంది. అంతా బ్రహ్మస్వరూపంగానే
కనిపిస్తుంది. ఇలాంటి స్థితి ఏర్పడ్డప్పుడు భక్తుడికి భక్తివిషయంలోకానీ,
భగవంతుడి విషయంలోకానీ ఉన్న సందేహాలన్నీ వాటంతట అవే తొలగిపోతాయి. భగవత్
సాక్షాత్కారం అప్పుడు లభిస్తుంది. దీన్నే భక్తిమార్గమని, భాగవతా ధర్మమని
అంటారు.
Credits: SowjanyaKumar
No comments:
Post a Comment