అయినా
వారిని న్యాయ శాస్త్ర నైపుణ్యమే “మణికుట్టి”ని చేసినది. తిరువిసైనల్లూరు
తూర్పున ఆరు మైళ్ళ దూరమున ‘మనలూరు” అనే గ్రామమున్నది. ఆ ఊరిలో
శ్రీనివాసయ్యర్ అనే తర్కశాస్త్ర మహావిద్వాంసులొకరుండే వారు. బెంగాలులో
ప్రసిద్ధి గాంచిన ‘నవ్య న్యాయ’మనే తర్క శాస్త్రములో దక్షిణాదిలో పాండిత్యము
సంపాదించిన వారు వీరు ఒక్కరు దక్క వేరే ఇంకెవ్వరూ లేరు. వారి వద్ద మన
“వాంజీశ్వరన్’ తర్క శాస్త్రమభ్యసించారు.
బెంగాలంటే
మన ప్రక్క వారందరికీ సాధారణంగా రామకృష్ణ పరమహంస, కాళీమాత గుర్తుకు
వస్తారు. మతవిషయకమయిన పరిజ్ఞానమున్న మరికొంతమందికి చైతన్యమహా ప్రభు,
రాధాకృష్ణులు, గుర్తుకు వస్తారు. (కాళం, కృష్ణ అనే రెండు పాదాలకూ నలుపు అనే
అర్థం). సాధారణంగా బెంగాలీలంటే భక్త్యావేశపూరితులనే మన అభిప్రాయం అయితే
బెంగాలులో pure reasoning కోసమే ఏర్పడి కేవలం బుద్ధివాదం ద్వారా
తర్కశాస్త్రం చిగిర్చి పరిడవిల్లింది. వైదిక మతంలో షడ్దర్శనములని
పిలువబడుతున్న షట్చాస్త్రములలో గౌతముడు ప్రసాదించినది తర్కశాస్త్రం. ఈ తర్క
శాస్త్రమును అభివృద్ధిపరచి నవ్యన్యాయమను పేర సాధించారు గంగేశోపాధ్యాయుల
వారు.
గంగేశమిశ్రోపాధ్యాయుల
వారు బంగాళదేశమునకు చెందినవారు. చరిత్ర పరిశోధకులు. వారి కాలము 13వ
శతాబ్దమునకు ముందు ఉండడానికి సాధ్యం కాదని అభిప్రాయపడుతున్నారు. వీరు తమ
“తత్త్వచింతామణి” గ్రంథములో గౌతముడొసగిన తర్కశాస్త్రమును 64వాడములుగా
విభజించి, అభివృద్ధి పరచి నవీన తర్కమైన నవ్య న్యాయమును సాధించారు. ‘నవం’
అంటే క్రొత్తది అని అర్థం. ‘నవ్యం’ అనేది దాని నుంచి సాధించబడిన పదమే.
‘మణి’ అని వాడుకలో పిలువబడే ‘తత్త్వచింతామణి’ పుస్తకమునకు మధురానాధుడు,
జగదీషుడు, వాసుదేవ సార్వభౌముడు, రఘునాథ శిరోమణి, మొదలయిన పండితులు
వ్యాఖ్యానము చేసినారు. (ఎన్నో సంవత్సరముల ముందు ఆస్ట్రేలియా, వెస్టిండీస్
లలో క్రికెట్ ఆడిన వారి పేర్లు, హాలీవుడ్ సినిమాలలో నటించిన వారి పేర్లు,
సినిమాలు సంవత్సరాలు, ఇన్ని వివరాలు జ్ఞాపకం ఉంచుకుంటున్నారు కదా! విదేశీ
విద్యావంతులు “ఈ రకమైన మహోన్నతమైన ఒక తర్కమా!” అని ఆశ్చర్యపోతున్న తర్క
శాస్త్రంపై ఆధార గ్రంథాలు వ్రాసిన వారి పేర్లు మీ చెవుల్లో పడాలనే
చెప్పాను). ఆశ్చర్యమేమంటే పై ఆధార గ్రంథములు వ్రాసిన వారందరూ
భక్త్యావేశములకు పేరుపొందిన బంగాళీయులే. అందులో విశేషముగా కృష్ణ గిరి
జిల్లాకు చెందినా నవ ద్వీపమునకు చెందిన వారే. ఈ ప్రాంతంలో తొమ్మిది గంగ
దీవులు ఉన్నందున దీనికి నవ ద్వీపమని పేరు వచ్చినది. సరి! ప్రదేశమో!
నవద్వీపం! అందు ఉద్భవించిన శాస్త్రం ‘నవ్య న్యాయం’. నవద్వీపము బంగాళీయుల
వాడుక భాషలో ‘నదియా’ అయినది. చైతన్య మహా ప్రభువులు కూడా నదియాలోనే పుతారు.
వారు 15 శతాబ్దం చివరి దశాబ్దం నుండి 16వ శతాబ్దం మొదటి దశాబ్తం వరకు
జీవించి ఉన్నారు. వాసుదేవ సార్వభౌములు వారికి senior contemporary వారి
వద్ద చైతన్యులూ, రఘునాథ శిరోమణి శిష్యులుగా ఉన్నారని చెబుతారు. పరమ భాగవత
సహజంగా, తనను తాను మరచి భగవన్నామంలో లీనమయిపోతూ ఉండే చైతన్యులు బుద్ధి
ప్రకాశంలో కూడా వెనుకంజ వేసిన వారు కాదు. ఆ విషయం అలా ఉండనీండి. పైన
చెప్పిన నాల్గయిదు తర్కశాస్త్ర మహావిద్వాంసుల సరసన ఇంకొక పేరు చేర్చవలసి
ఉన్నది. వారు గదాధరులు (పరమహంసకు కూడా గదాధరుడనే పేరు).
గంగేశుని
‘తత్త్వచింతామణి’ పైన ఉన్న అనేక వ్యాఖ్యాన గ్రంథములకు కొలికి పూసా లేక
శిరోమణిగా చెప్పుకోదగినది రఘునాథ శిరోమణి వ్రాసిన దీధితి – ఈ కాలంలో
శిరోమణి పట్టం ఇస్తున్నారే అది వీరిని దృష్టిలో ఉంచుకొనే. మహా విద్వాంసులు,
జ్ఞాన భాస్కరులు వీరు. ఈ వ్యాఖ్య ఎంతో సులభగ్రాహ్యంగా, స్పష్టంగా
వ్రాశారు. దీధితి అంటే ప్రకాశం, కాంతి అని అర్థం. లలితా సహస్రనామములలో
అమ్మవారి గోళ్ళకాంతుల గురించి ‘నఖదీధితి’ అని చెప్పబడినది. రఘునాథ శిరోమణి
వ్రాసిన ‘దీధితి’లోని పది వాదములనెత్తి వీనికి గదాధరుడు విస్తృతమైన వ్యాఖ్య
చేసినారు. అది చాల ఆపేద్ద పుస్తకమయినప్పటికీ, ఒక్క వాక్యం కూడా అనవసరంగా
వాడినట్లు తోచదు. గదాధరుడు వ్రాసినాడు కాబట్టి దాని పేరు ‘గదాధరి’ అయినది.
న్యాయశాస్త్రమునకు గోపుర శిఖరము వంటిది ఈ గ్రంథము. ఇందులో వివరించిన పది
వాదములలో అయిదు క్షుణ్ణంగా చదివితేనే బుద్ధిమంతుడు అవుతారు. పదీ చదివితేనో?
మహా బుద్ధిమంతుడు. అందులో బ్రాహ్మణ్య వాదాన్ని అర్థం చేసుకొన్న వారికన్నా
బుద్ధిమంతులీ పృథ్విలో లేరని చెబుతారు.
(సశేషం)
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
No comments:
Post a Comment