28/09/17, 8:40:34 PM: +91 80088 84529: పెద్ద డాక్టర్ (పార్ట్ 1)
నాకు
గుర్తున్నంతవరకు అది 1957వ సంవత్సరం అనుకుంటా. కంచి పరమాచార్య స్వామివారు
జయేంద్ర సరస్వతి స్వామివారు చెన్నై టి. నగర్ లోని రామేశ్వరం రోడ్డులోని ఒక
ఇంట్లో మకాం చేస్తున్నారు. ఆ వీధి చివర్లో ఉత్తరం వైపున నేను మా
తల్లితండ్రులతో కలిసి నివసిస్తున్నాను. అప్పుడు నా వయస్సు 22 సంవత్సరాలు.
సెకెండరి గ్రేడ్ టిచర్స్ ట్రైనింగ్ స్కూల్ లో చదువుతున్నాను.
కొన్నిసార్లు
మహాస్వామివారు ఉదయంపూట గాని సాయింత్రంవేళలో కాని మా ఇంటి ముందు నుండి
వెళ్ళేవారు. అప్పుడు మా అమ్మ ఇంటిముందు ముగ్గువేసి చేతిలో హారతి పళ్ళెం
పట్టుకుని నిలబడేది. స్వామివారు మాఇంటి ముందు నుండి వెళ్ళినప్పుడల్లా
స్వామికి హారతిచ్చి నేలపై పడి నమస్కరించేది. నాగరిక మనస్తత్వం, ధిక్కార
ధోరణి, యువరక్తం, మంచి చెడులు తర్కించలేని పరిణతి ఉన్న నేను మా అమ్మను
తిట్టేవాడిని అలా చేసినప్పుడల్లా. “ఇతను ఒక సన్యాసి. ఎందుకు అతనికి
నమస్కరిస్తావు? ఇలా అనాగరికురాలిగా అతనికి నమస్కరిస్తే, ఆయన నిన్ను
కాపాడతాడా? ఇకనుండి ఇటువంటి తప్పు పనులు చెయ్యవద్దు”. ఈ నా మాటలు విని మా
అమ్మ “పోరా పో! ఊరికే నీపని చూసుకో” అని బదులిచ్చేది.
రెండేళ్ళ
తరువాత 1959లో చెన్నై మైలాపూర్ లోని పి.యస్. హైస్కూల్ లో ఉపాధ్యాయుడుగా
పనిచేస్తున్నాను. కొన్ని సంవత్సరాల తరువాత మా అమ్మకు ఆరోగ్యం చాలా
పాడయ్యింది. అధిక రక్తపోటు వల్ల, మెరుగైన చికిత్స కోసం ఆమెని చెన్నైలోని
తారమణిలో గల వి.హెచ్.యస్ ఆస్పత్రిలో చేర్పించాము. అప్పుడు నేను మైలాపూర్
కపాలేశ్వర దేవాలయం దగ్గర్ళోని కళ్యాణి హోటల్ (ఇప్పుడు అది లేదు) యజమాని మణి
అయ్యర్ కుమారులిద్దరికి ట్యూషన్ చెప్పేవాడిని. వారి కుటుంబం పరమాచార్య
స్వామికి భక్తులు. వారు తరచూ కంచి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకునేవారు.
స్వామివారి పాదసేవ కంటే మించినది ఏమి లేదు వాళ్ళ అభిప్రాయం.
మణి
అయ్యర్ మైలాపూర్ దగ్గర మండవేలిలో ఉండేవారు. వాళ్ళ ఇంట్లో హాల్ ఎదురుగా
ఉన్న చిన్న పూజగదిలో పరమాచార్య స్వామివారి చిత్రపటం ఉండేది. దాని ముందు
ఎప్పుడూ ఒక దీపం వెలుగుతూ ఉండేది. నేను హాల్లో ఉన్న ఊయలలో కూర్చుని
పిల్లలకు పాఠాలు చెప్పేవాడిని. పూజగది ఎప్పుడూ తెరిచి ఉండటం వల్ల నాకు
స్వామివారి చిత్రపటం కనపడగానే ఒళ్ళు జలదరించి వెంటనే వెళ్ళి పూజగది తలుపు
వేసి వచ్చేవాణ్ణి. ఇలా చాలాసార్లు జరిగింది.
అప్పుడే
చెప్పినట్టుగా నేను మా అమ్మ అరోగ్యం గురించి ఆందోళన చేందేవాణ్ణి. మా అమ్మ
నన్ను ఒంటరివాణ్ణి చేసి వదిలి వెళ్ళిపోతుందేమో అనే బాధతో కళ్ళల్లో నీళ్ళు
తిరిగేవి. ఒకరోజు నేను పాఠం చెబుతుండగా అప్పుడే ఇంటికి వచ్చిన మణి అయ్యర్
నాతో, “ఏంటి సార్! చాలా ఆందోళన పడుతున్నారు. కళ్ళు కూడా ఎర్రబడ్డాయి, ఏంటి
విషయం?” అని అడిగారు. కళ్ళు తుడుచుకుంటూ “ఏం లేదు మణి అయ్యర్! మా అమ్మగారి
ఆరోగ్యం బాగాలేదు. హైపర్ టెన్షన్. వి.హెచ్.యస్ ఆస్పత్రిలో చేర్చాను. అదే
విషయమై బాధగా ఉంది” అని చెప్పాను.
మణి అయ్యర్: “మంచి డాక్టరుకు చూపించావా?”
నేను: “చెప్పాను కదా వి.హెచ్.యస్ ఆస్పత్రిలో చేర్పించాను అని”
మణి అయ్యర్: “మరి వాళ్ళు ఏమి చెప్పారు?”
నేను: “ఆరోగ్యం బావుంది భయపడాల్సినది ఏమి లేదని చెప్పారు. కాని నాకు వాళ్ళ మాటలపై విశ్వాసం లేదు”
మణి అయ్యర్: “సార్ మీ సమస్య తీరేట్టు మిమ్మల్ని ఒక పెద్ద వైద్యుని దగ్గరకు తీసుకువెళ్తాను. వారిని చూడడంతోటే మీ అమ్మగారు బాగవుతారు”
నేను:
“అలాగా? ఎవరు ఆ డాక్టర్? వారికి చూపిస్తే మా అమ్మకు నయమవుతుందా? వారు
ఎక్కడుంటారు? వారిని ఎప్పుడు కలవొచ్చు? ఇప్పుడే మా అమ్మను తీసుకుని రానా?”
నా సమాధానంలోని ప్రశ్నలలో ఆ అమ్మ ఆరోగ్యం బాగుపడాలనే ఆరాటం, ఆత్రుత, ఉత్సాహం ఉన్నాయి.
మణి అయ్యర్: “మీ అమ్మగారు రావాల్సిన పనిలేదు. నువ్వు ఒక్కడివి వస్తే చాలు”
నేను: “మణి అయ్యర్! అనారోగ్యం నాకు కాదు, మా అమ్మకి. నేను వస్తే మా అమ్మకి ఎలా నయమవుతుంది? ఆ పెద్ద డాక్టరు మా అమ్మను పరీక్షించడా?”
మణి అయ్యర్: “అవసరం లేదు సార్. ఆ పెద్ద డాక్టరు కేవలం మిమ్మల్ని చూసినంత మాత్రం చేత మీ అమ్మగారి ఆరోగ్యం బాగవుతుంది”
నేను:
కొంచం అపనమ్మకంతో ”నన్ను చూస్తే మా అమ్మ గారి ఆరోగ్యం బాగవుతుందా? అంతటి
ఘనుడా? సరే అలాగైతే నేను ఇప్పుడే వస్తాను పదండి వెళ్దాం అతని దగ్గరికి”
(సశేషం)
#KanchiParamacharyaVaibhavam - #కంచిపరమాచార్యవైభవం
No comments:
Post a Comment