20/09/17, 5:21:02 PM: +91 98490 65431: *ధ్యానం*
అప్పుడే
తెల్లవారింది. చీకటికి వీడుకోలు పలికినట్లయింది. పశుపక్ష్యాదులు ప్రపంచం
కన్నా ముందే నిద్రలేచాయి. సూర్యుడి రాకతో, కొలనులో కలువలు కళ్లు తెరిచాయి.
మొక్కలపైన మొగ్గలు పువ్వులయ్యాయి. ఆ తరవాత మెల్లగా మనిషీ నిద్రలేచాడు.
అతడితో పాటు మనసూ రెక్కలు విచ్చుకొంది. ఇంట్లోంచి బయటకు వచ్చిన అతడికి ఆ
ఉదయంవేళ కొత్తగా కనిపించింది. మనసు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉన్నట్లు మనిషికి
అనిపించింది.
నిన్నటి
సూర్యుడే ఈరోజూ వచ్చాడు. ఎన్నాళ్ల నుంచో ఉంటున్న చెట్లే ఈ పూటా
కనిపిస్తున్నాయి. మనిషి చుట్టూ గల పంచభూతాత్మకం యుగాలనాటిదే. అయినా, ఇప్పటి
పొద్దు అతడికి నూతన అనుభూతి కలగజేస్తోంది. ఉదయంపూట పక్షుల కిలకిలారావాలతో,
విశ్వంలో ఒక సంగీత కచేరి వినిపిస్తోంది. ‘ఏమిటి... ఇందులోని రహస్యం’ అని
ఆలోచనలో పడ్డాడు మనిషి!
పైపైన
చూస్తే, ప్రపంచంలో కనిపించేదంతా పాతదానిలాగే ఉంటుంది. ఎరుకతో గమనిస్తే,
క్షణక్షణానికీ మారిపోతున్న ప్రకృతి ఎంతో సరికొత్తగా తోస్తుంది. చరాచర
సృష్టిలో, పాతది మళ్లీ కనిపించటమన్నది అసంభవం. పదార్థం నిర్విరామంగా
మారిపోతుంటుంది. అది అనుక్షణం రూపం మారుస్తుంటుంది. అందువల్ల, ప్రస్తుతంలో
ప్రతిదీ కొత్తదే! జ్ఞాపకాల్లో, పుస్తకాల్లో, సాంకేతిక యంత్రాల్లో
నిక్షిప్తం చేసుకున్నవాటిలో మాత్రమే పాతవాటిని చూడగలం. ఈ క్షణంలో మనిషి
కట్టెదుట ఉన్న ప్రకృతి మటుకు నిత్య నూతనం!
ఒకే
చెట్టును మనిషి రెండుసార్లు చూడలేడు. కనురెప్పలు మూసి తెరిచేలోపు, అది
మారిపోయి ఉంటుంది. క్షణకాలం కిందటి చెట్టు, ఈ క్షణంలోని చెట్టు ఒకటి కావు.
అవి కొలతల్లో వేర్వేరు. నిన్నటి చెట్టు ఆకు ఈరోజు కొంత పెరిగి ఉంటుంది.
ఆకాశంలో గల మేఘం మరునిమిషంలో వానచినుకై రాలి పడుతుంది. రగిలే నిప్పు,
తదుపరి క్షణాల్లో నివురైపోతుంది. మట్టిలో విత్తనం అంకురమవుతుంది. మొగ్గ ఆ
తరవాత పుష్పమై వికసిస్తుంది. ఇదంతా నిర్విరామంగా సాగే ఒక రూపాంతర క్రియ.
రూపాంతరం
అంటే, ఒక రూపం లోంచి మరొక రూపంలోకి మారడం. ఇలా, ఒక దానినుంచి మరో రూపానికి
చేరేది చైతన్యమే! ఆ చైతన్యమే దివ్య శక్తి. అదే పరబ్రహ్మం. ‘ఈ ప్రపంచమంతా
దేవుడి దేహం’ అనేవారు ప్రఖ్యాత తత్వవేత్త ఓషో. నిత్యం నూతన త్వాన్ని
సృష్టించే దేవుడి శరీరం ఒక అద్భుత జీవన సౌందర్యం! నూతనత్వం అనేది దైవం
మనసారా ఆడుకునే ఆట. అది జీవితం పొడవునా అలా సాగిపోతూనే ఉంటుంది. మనిషే
దాన్ని గమనించలేకపోతున్నాడు. ఆ జీవన ఉత్సవంతో ఉత్సాహం పొందలేకపోతున్నాడు.
కారణం ఏమిటి?
మనిషి
హద్దు, అదుపు లేని ఆలోచనా ప్రవాహంలో పడి కొట్టుకుపోవడమే దీనికి కారణం.
ఆధునిక మానవుడు యంత్రమయ్యాడు. పొద్దున నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే
వరకు ఉరుకులు, పరుగుల జీవితం అతడిది. అది గతం నుంచి భవిష్యత్తుకు, దాని
నుంచి గతానికి మధ్య వూగే డోలాయమాన మానసిక పరిస్థితి. అలా యాంత్రిక
జీవనానికి అలవాటు పడిన అతడి మనసు మొద్దుబారిపోతుంది. సున్నితత్వాన్ని
కోల్పోయి, చివరికి స్పందించే గుణమంతటినీ పోగొట్టుకుంటుంది.
నిద్ర
సమయంలో మనసు, శరీరం పూర్తి విశ్రాంతి పొందుతాయి. ఆ గాఢ నిద్ర- ధ్యానం
వంటిది. అందులో స్పృహ ఉండదు. గాఢనిద్రలో ఆలోచనలు ఉండవు. ఆ తరవాత, మనసు
తిరిగి ఉత్తేజితమవుతుంది. తిరిగి సహజ శక్తి పొంది హుషారవుతుంది. సమర్థంగా
పనిచేయడానికి సంసిద్ధంగా ఉంటుంది.
ధ్యానం
అనేది స్పృహతో కూడిన నిద్ర. అప్పుడు శరీరం నిద్రిస్తుంటుంది. మనసుకు
ఆలోచనలు కలలుగా వస్తుంటాయి. ఎరుకతో గమనిస్తుంటే, అన్నీ క్రమంగా తగ్గిపోయి
చివరికి మనసు ఖాళీ అవుతుంది. ఆ క్షణాలు అద్భుతమైనవి. అనంతరం కళ్లు తెరచిన
మనిషికి ఇక జీవితమంతా నిత్య నూతనమే!
- మునిమడుగుల రాజారావు
No comments:
Post a Comment