10/06/17, 11:40:47 PM: +91 80088 84529: ధర్మాకృతి : మణికుట్టి - 7
స్వతంత్రం,
స్వధర్మం విడువకుండా మణికుట్టి మహారాష్ట్ర పేష్వాల సభనలంకరించి
దాక్షిణాత్యవిద్వత్తుకు వన్నెతెచ్చారు. రాజా అధికారానికి లొంగని వారు,
స్వతంత్రులు అయినప్పటికీ రసజ్ఞులయిన రాజాలతో స్నేహధర్మం మహా పండితులెలా
చూసేవారో కూడా వీరి చరిత్ర నుంచి తెలుసుకొనవచ్చును. పేష్వాను తెల్లవారు
బంధించి గంగా తీరంలోని కాన్పూరు పట్టణంలో గృహ నిర్బంధం చేయడానికి తరలి
వస్తున్నారు. విద్వశ్శ్రేష్ఠుడుగా అప్పటికే బహు ప్రసిద్ధులు అయిన మణికుట్టి
ఇంకో రాజాస్థానమునకు పోవచ్చు. అయినప్పటికీ పేష్వా వారిస్తున్నప్పటికీ
‘సుభిక్షకాలంలో పోషించిన నిన్ను నేను దుర్దశలో విడువలేను’ అని చెప్పి
దారంతా బిచ్చమెత్తి జీవిస్తూ వారితో నడిచి వెళ్ళారు. బహుకాలం ఎంతో
స్వారస్యమయిన విజ్ఞానపు విందు చేశారు. తరువాత కాలంలో వారు కాశీ చేరారు.
అప్పుడక్కడ అహోబిల పండితులు అనే మహావిద్వాంసులుండేవారు. ఇప్పటికే మన కథ
పొడిగించాము. అయినా వీరి గురించి ఓ ఉపకథ చెప్పక తప్పడం లేదు. రాజుకో,
ప్రభుత్వానికో తలవంచక తన స్వధర్మ రక్షణ చేసుకోవాలి అనే మన కథ ముఖ్య
ఆదర్శాన్ని జీవితంలో తూ.చ తప్పక పాటించిన వారు ఈ అహోబిల పండితులు.
వీరు
మైసూరు హైదరాలీ చేత విశేష మర్యాదలతో గౌరవింపబడుతూ వారి రాజసభలో ఉంటూ
ఉండేవారు. టిప్పు రాజ్యానికి వచ్చిన తరువాత వారిచే ప్రార్థింపబడి రాజ సభలో
కొనసాగారు. తరువాతి కాలంలో టిప్పుకు సమరసభావం తగ్గింది. స్వమతాన్ని
విస్తరింపజేయవలెననే ఆకాంక్ష పెరిగింది. ఈ పండితుణ్ణి మర్యాదగా పిలిపించి
‘తాము మా మతాన్ని ఎప్పుడు గౌరవింపబోతున్నారు” అని ప్రశ్నించారు. ‘హుజూరు’
అని మటుకు అప్పటికి సమాధానం చెప్పిన అహోబిల పండితులు మరుసటి రోజు సభకు రానే
లేదు. టిప్పు వారింటికి మనుష్యులను పంపగా ఇల్లు ఖాళీగా ఉన్నది.
ప్రాయశ్చిత్తార్థము అహోబిల పండితులు కాశీకి పోయారు.
టిప్పు
తల్లి, హైదర్ భార్య అయిన బీబీకి ఈ విషయం తెలిసింది. వెంటనే పుత్రుని
పిలువనంపి కఠినంగా ఖండించింది. ‘జ్ఞాన వైరాగ్యములు రెండింటిలోనూ
ఉద్ధండులయిన ఈ పండిట్ జీ ఆశీర్వాదముతోనే మన సామ్రాజ్యము వర్ధిల్లినట్లు
నేను, నీ తండ్రి గట్టిగా నమ్మియున్నాము. వారు చెప్పా చేయకుండా పోయే విధంగా
నీవేమి తప్పు చేశావు’ అని అడిగింది. టిప్పు తడబడుతూ విషయం చెప్పాడు. దానికి
బీబీ ‘కుమారా! నీకు ఎంతో వీరధీర పరాక్రమాదులుండవచ్చు. అయినా సత్పురుషులకు
చేసిన ఈ అపకారం వలన ఇక రాజ్యం నిలుస్తుందని నమ్మనవసరం లేదు’ అన్నది.
ఆమె
వాక్కు ఆవిధంగానే ఫలించిందని చరిత్ర తెలిసిన ఎల్లరకు తెలుసు. ఈరకంగా
కాశీలో ముందే స్తిరబడి యున్న అహోబిల పండితుల వద్ద మన మణికుట్టి శిష్యులయి
వేదాంత శాస్త్ర అభ్యాసం చేశారు. నేనింత ముందు చెప్పిన నాలుగు చింతామణి
పుస్తకాలు కాశీలోనే వ్రాశారు. తరువాత కొంతకాలం అక్కడే అధ్యాపకులుగా
శిష్యులకు పాఠాలు చెప్పారు.
కొంతకాలం
కాశీవాసం పూర్తిచేసి, దక్షిణపుదిశగా మైసూర్ చేరి, అప్పటి రాజులయిన మూడవ
కృష్ణ దేవ ఒడయార్ ప్రార్థన ననుసరించి వారి ఆస్థానమును అలంకరించినారు.
ఒడయార్ వారియెడ దైవవిశ్వాసం ఉంచి పూజించేవారు. వీరు తమ స్వాతంత్ర్యమును
ఇసుమంత కూడా విడనాడలేదు. తాము ఇంత జాగ్రత్తగా ఉన్నప్పటికినీ ఎక్కడయినా
స్వధర్మానికి అఘాతం కలిగి ఉండవచ్చునేమోనన్న భయంతో తద్దోషనివృత్తికై ఒక
సోమయాగం చేశారు. దానిని సందర్శింపవచ్చిన ఒడయార్ ‘తాము వాజపేయ యాగం చేయాలి. ఆ
యాగం ముగించి అవబృధస్నానం చేసే వారికి రాజు పట్టు శ్వేత ఛత్రం పట్టి
ఊరేగింపు జరపాలని ఉన్నది కదా! నాకు ఆ భాగ్యం కలుగజేయాలి’ అని
ప్రార్థించారు. “పాశ్చాత్యుల చేతిలో చిక్కి రాజ్యాలున్న కాలంలో నియమాలు,
విధులు సరిగా నిర్వర్తిసూ యాగం చేయడమే ఎంతో కష్టంగా ఉంది.దౌర్బ్రాహ్మణ్య
నివృత్యర్థం తెలియని స్వధర్మాఘాతం వలన కలిగిన దోష నివృత్యర్థం ఏదో కడుపుకు
నిప్పు కట్టుకొని ఈ ఒక్క యాగం ముగించాననిపించాను. ఇంకో యాగం చేయడానికి
భయపడుతున్నాను. జనసమూహం ఈ విషయం గుర్తించాలి’ అని ఎంతో మర్యాదగా, అయినా
ఖచ్చితంగా చెప్పారు.
రాజుగారి
మాటకు లొంగి ఉండాలనే భయము వీరికి లేదు. చక్రవర్తి చేత శ్వేత ఛత్రం
పట్టించుకోవాలనే కోరికా లేదు. సర్వోజీ కాలం ముగిసి శివాజీ పట్టానికి వచ్చిన
తరువాత, దగ్గర దగ్గర 19వ శతాబ్దంలో మణికుట్టి తమిళనాడుకు తిరిగి వచ్చారు.
అప్పుడు ఉన్న మన మఠస్వామి చేసిన అఖిలాండేశ్వరి తాటంక ప్రతిష్ఠలో కూడా పాలు
పంచుకొన్నారు. ముసలితనంలో తిరువిసైనల్లూరు వచ్చి స్తిరబడి అక్కడనే ఆనందయోగం
పొందారు. తండ్రిచే ఇంటినుండి వెలివేయబడినవారు. రాజ్యం వదిలి బిచ్చమెత్తుతూ
పోయిన వారు. కర్ణాటక రాజ్య పల్లకీ పరివారముతో, ఛత్ర చామరాది రాజ
చిహ్నములతో తిరిగి వచ్చిన వీరి చరిత్ర నుండి మనము అనేక పాఠములు
నేర్చుకొనవచ్చును.
మణికుట్టి
శాస్త్రి చేసిన మణిమయమైన పుస్తకములన్నింటిలోనూ మొదట్లో డుండిగణపతి,
విశ్వేశ్వరుడు, మణికర్ణికాగంగా, తిరువడైమరుదూరు మహాస్వామికి నమస్కారం చేసిన
తరువాత తమ ఊర్లో మీమాంస బోధించిన ఈశ్వర శాస్త్రి, నవ్య తర్కం బోధించిన
శ్రీనివాసయ్యర్, కాశీలో వేదాంతం బోధించిన అహోబిలపండితులు మొదలైన వారందరికీ
గురువందనం చేసి గాని విషయం మొదలుపెట్టరు. వారి గురు భక్తి కూడా మనకు
ఆదర్శప్రాయమైనది.
తండ్రి దండనతో ఇహపరం రెండూ సంపాదించుకొన్న మణిపుత్రుడు మన మణికుట్టి.
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
No comments:
Post a Comment