ఆ
బాలుడు ‘కుట్టిశాస్త్రి’ అని మీకు నే చెప్పకుండానే తెలిసి ఉంటుంది. మహా
ప్రతిభాశాలి అయిన విద్వాంసుడు కూర్చోమన్నట్లు సైగ చేసినా వీరు కూర్చొనలేదు.
గొంతు పెంచి చెప్పదలచినది ధైర్యంగా ఖరాఖండిగా చెప్పారు. అమరసింహుడు,
సదస్యులు ఆనంద సంభ్రమాలకు లోనయినారు. తర్కశూరుని ప్రశ్నలకు సరి అయిన
జవాబులిచ్చారు. ‘కుట్టిశాస్త్రి’. ఆ పైన 64వాదములలోనూ వంగపండితుని
ప్రశ్నలకు తడుముకోకుండా సమాధానమిచ్చారు. సదస్సులో ఒకటే ఉత్సాహం. సభలో జీవకళ
తిరిగి ప్రవేశించింది. వంగ పండితుని నోరు మూత పడిపోయింది. అంతటితో వదలక మన
కుట్టి శాస్త్రి ‘ఇక నే అడిగే ప్రశ్నలకు తాము సమాధానమియ్యాలి’ అంటూ తర్క
విద్వాంసునికి ఆధార పరీక్ష పెట్టనారంభించారు.
వంగ
పండితులు పరీక్షకు నిలువలేక పోయారు. కుట్టిశాస్త్రిని నోరు మూసుకోమని సైగ
చేసిన వీరు మౌనం వహించాల్సి వచ్చింది. అవమాన భారంతో తల వంచారు. ‘మన
దేశీయమైన నవ్య న్యాయంలో పోయి పోయి ఒక పసివాని వద్ద నా పరాజయం’ అని
కుంగిపోయి వేరు శరణ్యం లేక పరాజయం అంగీకరించారు. సభలో ఒకటే సంరంభం రాజ్య
గౌరవాన్ని నిలబెట్టిన కుట్టిశాస్త్రిని మిగతా పండితులు, అమరాసిమ్హులు ఎంతో
ఆనందంగా అభినందించారు. ఈ యువక విద్వాంసునకు విజయ స్తంభము
నాటబోతున్నానన్నారు మహారాజు. పిల్లవాడు ఆ గౌరవానికి నిస్సంశయముగా
యోగ్యుడయినప్పటికీ, చిన్న వయస్సులో ఈ రకమైన సన్మానం వలన దృష్టి దోషం
కలుగవచ్చు. ఇంకా ఎంతో అభివృద్ధి పొందాల్సిన వాడవడాన ఈ సామాజిక గౌరవాన్ని
గురించి నిదానంగా ఆలోచించాలన్నారు సదస్యులు. అలా అయితే బిరుదు ఇద్దామన్నారు
రాజుగారు. సదస్సు ఆనందోత్సాహములతో ఆమోదించింది.
తర్క
చింతామణిలో ఈ మహా విద్వాంసుడు తన విశేష ప్రజ్ఞాపాటవాలను చూపించినారు
కాబట్టి ఆ పేరు కలిసి వచ్చేలా ‘చింతామణి కుట్టి’ అనే బిరుదు ఉచితముగా
ఉంటుందని రాజు, పండితులు భావించారు. వాంజీశ్వరన్ ఈవిధముగా ‘చింతామణి
కుట్టి’ అయినారు. తర్క చింతామణిని పండిత లోకంలో సంక్షేపంగా మణి అని పిలిచే
అలవాటుంది అని చెప్పుకొన్నాం కదా! అందువలన చింతామణి కుట్టిని మణి కుట్టి
అని వ్యవహారంలో పిలువనారంభించారు. ప్రేమతో ముద్దుగా పిలిచే పేరు మాదిరి
చక్కగా అమరింది ఈ పేరు. ఏదో చక్రవర్తి, అపర అవతారం అని నలుగురి దృష్టి దోషం
కలిగే బిరుదుగాక మన పసి విద్వాంసునికి ఈ పేరెంతో ముద్దుగా, ప్రియంగా
ఉన్నది కదా!
వీరు కూడా
‘చింతామణి’ గ్రంథము మూలానే తనకీ గౌరవం లభించిన విషయం ఎల్లప్పుడూ కృతజ్ఞతతో
జ్ఞప్తిలో ఉంచుకొన్నారు. తరువాతి కాలంలో వారు వ్రాసిన పుస్తకాలకు చింతామణి
పేరు కలిసి వచ్చేలా ‘బ్రహ్మసూత్రార్థ చింతామణి’, ‘పాఠచింతామణి’,
‘దత్తచింతామణి’, ‘శ్రాద్ధ చింతామణి’ అని పేరు ఉంచుకొన్నారు. ఈరకంగా లోకమంతా
బహుధా ప్రశంసించబడిన తన ప్రియమైన కుమారుని తండ్రి ఎందుకు తిట్టినారనే
విషయం గురించి కదా మనం మొదలుపెట్టాం.
ఆ
రోజుల్లో తెల్లదొరల పరిపాలన స్తిరబడి మద్రాస్ లో హైకోర్టు వచ్చింది.
అందులో హిందూ మత సంబంధమయిన వ్యవహారములను పరిశీలించడానికి పండిత పదవిని
వారేర్పాటు చేశారు. హిందూ ధర్మ శాస్త్ర విషయంలో నిష్ణాతులైన పండితునికే ఈ
ఉద్యోగమిచ్చేవారు. మరి అలాంటి పండితుని నిర్ణయించడం వారి అధికారులకు అలవి
కాదనే ఉద్దేశ్యంతో అభ్యర్థులనెంపిక చేసి పంపవలసినదని ధర్మ పీఠమును
ప్రార్థించేవారు. మన కథ నడిచే కాలంలో అలా పదవి ఒకటి ఖాళీ అయింది.
అభ్యర్ధులను ఎంపిక చేసి పంపవలసినది అని మన మఠ ఆచార్యుల వారిని కోరారు. ఆ
కాలంలో మన మఠం కుంభకోణంలో ఉండేది.
తెల్లవారు
ఇక్కడ ఎన్నో తప్పుడు పనులు చేసి రాజ్యములను హస్తగతం చేసుకొని, తమ
ప్రాచుర్యమునకు ఎన్ని తంత్రములు చేయాలో అన్నిటినీ చేస్తున్నప్పటికీ హిందూ
మత వ్యవహారములలో తలదూర్చి వారి సెంటిమెంట్స్ పై దెబ్బతీయకుండా జాగ్రత్తగా
ఉండేవారు. దానికి కారణం ఏమయినా అవనీండి. ఇప్పుడు మన స్వపరిపాలనలో
రాజ్యాంగంలో మత ప్రమేయము లేని లౌకిక రాజ్యమని పెద్ద దంభంగా వ్రాసికొని మరొక
ప్రక్క. హిందూ మత విషయంలో మాత్రం ప్రవేశించి, రాజకీయ నాయకులు తమ
చిత్తమొచ్చినట్లు మార్పులు, చేర్పులు చేస్తున్నట్లుగా, ఆకాలంలో తెల్లదొరలు
చేయలేదనే విషయం ఒప్పుకొని తీరవలసిందే. అందువలనే న్యాయ శాస్త్రంలో హిందూమత
పరమయిన చిక్కులు వస్తే తమ చిత్తమొచ్చినట్లు తీర్పు నీయకూడదని, ఒక ధర్మ
శాస్త్రజ్ఞుని సలహా తీసుకోవాలని ఈ పదవి ఏర్పాటు చేశారు. సరి! కథాంశంలోనికి
వస్తే మణికుట్టి తండ్రి తాతలు మఠవిద్వాంసులని చెప్పాను కదా! ఇప్పుడు ఈ
గౌరవమును పొంది ఆచార్య స్వామి ఆశీర్వాదమునకై కుంభకోణం వచ్చినారు మణికుట్టి –
స్వామి వారు వేడుకగా ‘హైకోర్టు పండిత ఉద్యోగానికి పోతావా’ అని అడిగారు.
(సశేషం)
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
No comments:
Post a Comment