13/04/17, 2:35:21 PM: Dakshina Murthy: సంస్కార భారతి సేవాశ్రం
కొక్కొండ గ్రామము, ములుగు మండలం, సిద్ధిపేట జిల్లా
సర్వతోముఖ విజయానికై 108 వాక్యాలు
రచన : CA బెజగామ గణేశ్ శర్మ
సంస్థాపక సంచాలకులు - సంస్కార భారతి వ్యక్తిత్వ వికాస పాఠశాల
Website: www.sanskarabharathi.org Contact No: 9618 117702
“మేము యువతను మారుస్తాము వారు దేశాన్ని మారుస్తారు”.
*ఈ క్రింది 108 వాక్యాలను 40 రోజులపాటు ప్రతిరోజూ ఉదయం లేవగానే గట్టిగా చదవండి. సర్వతోముఖ విజయానికి దగ్గరౌతారు.*
విజయము - లక్షణాలు
1. మానవ జన్మ చాలా గొప్పదని నాకు తెలుసు. భగవంతుడు నాకిచ్చిన ఈ జన్మను సార్థకం చేసుకుంటాను.
2. గొప్ప వారి అడుగు జాడలలో నడుస్తాను. నలుగురికి ఆదర్శంగా జీవిస్తాను.
3. నా లాభం వరకే పరిమితమయ్యేవి కాకుండా అనేక మందికి పనికివచ్చే మహోన్నత లక్ష్యాలను ఏర్పరచుకుంటాను.
4. నిరంతరం నాలోని బలాలను వృద్ధి చేసుకుంటాను మరియు బలహీనతలను సరిచేసుకుంటాను.
5. నా కలలను సాకారం చేయగల తిరుగులేని మనోబలం నాకున్నది.
6. నేను పిరికివాణ్ణి కాదు. నాకు భయం లేదు. జీవితంలో వచ్చే ఏ పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కొంటాను.
7. నేను నా లక్ష్యాలను తప్పకుండా సాధించగలను. నా శక్తి సామర్థ్యాలపైన నాకు అచంచలమైన విశ్వాసం ఉన్నది.
8. నా సంకల్పం చాలా దృఢమైనది. దానికి తిరుగు లేదు.
9. నా లక్ష్యంపై సంపూర్ణ అంకితభావంతో పనిచేస్తాను. లక్ష్యం కోసం ఇతర కార్యక్రమాలన్నీ మానుకుంటాను లేక వాయిదా వేస్తాను.
10. నేను తీసుకున్న నిర్ణయానికి నిబద్దుడనై ఉంటాను. మాట మీద నిలబడతాను.
11.
నా పట్టుదల అత్యంత తీవ్రమైనది. కార్యసాధనలో వచ్చే మధ్యంతర ఓటములన్నీ నా
పట్టుదలను అనేక రెట్లు పెంచుతాయి. లక్ష్యం చేరేవరకూ విశ్రమించను.
12. నేను ప్రతి విషయాన్నీ తార్కికంగా మరియు హేతుబద్ధంగా ఆలోచిస్తాను. అట్టి ఆలోచన నా ప్రగతికి దోహదం చేస్తుందని నాకు తెలుసు.
13. ఎల్లప్పుడూ లక్ష్యాన్ని చేరడానికి దోహదపడే సానుకూల ఆలోచనలను చేస్తాను. ప్రతికూల ఆలోచనలను దగ్గరికి రానివ్వను.
14. నా మనఃప్రవృత్తులను (Mindsets) నిరంతరం పరిశీలిస్తూ ఉంటాను. సరి కాకపొతే మార్చుకుంటాను.
15. విజయానికి క్రమశిక్షణ చాలా అవసరమని నాకు తెలుసు. క్రమశిక్షణతో నడచుకుంటాను.
16. నా జీవితంలో మరియు నా లక్ష్యం సాధించే మార్గంలో అంతులేని ఓపికతో ఉంటాను.
17. కార్య సాధనలో ఎటువంటి పరిస్థితులనైనా, కష్టనష్టాలనైనా, మానావమానాలనైనా సహనంతో భరిస్తాను. నాకు లక్ష్యం ముఖ్యం.
18. నేను నిరంతరం ఉత్సాహంతో పనిచేస్తాను. నీరుగారిపోయే భావనలు రానీయను. మాటలు మాట్లాడను.
19. నా జీవితానికి అవసరమైన లోక జ్ఞానాన్ని, ఇంగిత జ్ఞానాన్ని సంపాదించి ఉపయోగించుకుంటాను.
20. నూతన కార్యాలను, ఉద్యమాలను చేపట్టే విషయంలో ముందుకు ఉరుకుతాను.
21. సరికొత్త ఆవిష్కారాలకై సృజనాత్మకతతో ఆలోచిస్తాను. కొత్తదనాన్ని ఎల్లప్పుడూ ఆహ్వానిస్తాను.
22. నా మనస్సును అటూ ఇటూ తిరగకుండా నా లక్ష్యంపై స్థిరంగా ఉంచుకుంటాను.
23.
నా జీవితలో వచ్చే ప్రతి పోటీని క్రీడా స్ఫూర్తితో స్వీకరిస్తాను. నా
పోటీదారులు నా శత్రువులు కారు. పోటీలో గెలిచినా ఓడినా నిబ్బరంగా ఉంటాను.
విజయము - పనిముట్లు / మెళకువలు
24. నేను కేవలం పరీక్షలకొరకు మాత్రమే కాకుండా నిజమైన విజ్ఞానాన్ని పొందడానికై శ్రద్ధతో మరియు దీక్షతో చదువుతాను.
25. నా కార్యసాధనకై ప్రణాళికా బద్ధంగా పనిచేస్తాను. ఎప్పటికప్పుడు నా ప్రగతిని సమీక్షించుకుంటాను.
26. నాకు అవసరమైన నిర్ణయాలను నేనే విజ్ఞతతో, ధైర్యంగా తీసుకుంటాను. అవసరమైన చోట జ్ఞానవంతులను సంప్రదిస్తాను.
27. ప్రతివారితోనూ సరియైన పద్ధతిలో మాట్లాడతాను మరియు నా అభిప్రాయాలను సరిగా వ్యక్తీకరిస్తాను.
28. నాకున్న వనరులను గుర్తించి సంరక్షించుకుంటాను. వాటిద్వారా వీలైనంత ఎక్కువ లాభం పొందుతాను.
29. కార్యసాధనకు అవసరమైనపుడు ఏ జట్టులోనైనా కలసిపోతాను. జట్టులోని వారందరితో కలసి పనిచేస్తాను.
30. నా నాయకుడి ఆదేశాలను శిరసావహిస్తాను. కాలక్రమంలో నేనే నాయకుడిగా ఎదుగుతాను.
31. నా సమయాన్ని వృధా చెయ్యను. ప్రతి నిమిషాన్నీ సద్వినియోగం చేసుకుంటాను.
32. ఎ పనైనా నిర్ణీత సమయానికే చేస్తాను. సమయ పాలన చేయకపోతే నష్టం కలుగుతుందని, ఇతరులకు కూడా ఇబ్బంది కలుగుతుందని నాకు తెలుసు.
33. నేను చేసే ప్రతి పనీ మనస్ఫూర్తిగా చేస్తాను. పనిలో నాణ్యత ఉండేటట్లుగా చూస్తాను.
34. జీవితంలో వచ్చే ఎలాంటి మార్పులనైనా తట్టుకొంటాను. మార్పులు సహజమన్న విషయం నాకు తెలుసు.
35. మార్గంలో వచ్చే ఒడుదుడుకులనన్నింటినీ ఎదుర్కొంటూ సర్వ శక్తులనూ వినియోగించి అనుకున్న పనిని సాధించి తీరుతాను.
36. నేను చేసే పనికి సంపూర్ణమైన యజమానత్వము (Ownership) తీసుకుంటాను. జయాపజయాలకు బాధ్యత వహిస్తాను.
37. చేసే పనిలో సంపూర్ణమైన జాగ్రత్త తీసుకుంటాను. చేయవలసినవి చేస్తాను మరియు చేయగూడనివి చేయను.
38. సమస్యలకు తొట్రుపడకుండా, సరియైన పద్ధతిలో విశ్లేషించి, పరిష్కారాలను కనుగొంటాను. అవసరమైతే ఇతరులను సంప్రదిస్తాను.
39. జీవితలో మంచిపేరు సంపాదిస్తాను మరియు నిలబెట్టుకుంటాను. పేరు పోగొట్టుకుంటే తిరిగి పొందడం కష్టమని నాకు తెలుసు.
40. జీవితంలో డబ్బు చాలా ముఖ్యమైనది గనుక డబ్బుల విషయయంలో సరియైన సూత్రాలు పాటిస్తాను.
41. జీవితంలో ఓటములు వచ్చినప్పుడు క్రుంగిపోకుండా ధైర్యంగా నిలబడి మళ్ళీ ప్రయత్నించి విజయాన్ని సాధిస్తాను.
42. ఎంతటి కష్టాలు వచ్చినా జీవితంపై విరక్తి తెచ్చుకోను. చావాలని అనుకోను. బ్రతికి ఉండి అనుకున్నది సాధిస్తాను.
43. నా గురించి ఇతరుల అభిప్రాయాలు మరియు సూచనలు తీసుకుంటాను. ఉపయోగపదేవైతే వాడతాను.
విజయము - సద్గుణాలు
44. నేను సద్గుణాలేవో తెలుసుకొని వాటిని అలవరచుకొంటాను.
45. ధర్మమేదో అధర్మమేదో తెలుసుకొని ధర్మాన్ని పాటిస్తాను. అధర్మాన్ని వదలివేస్తాను. నా శక్తి మేర ధర్మాన్ని రక్షిస్తాను.
46. ఎల్లప్పుడూ సత్యమే పలుకుతాను. అబద్ధం చెప్పను. అబద్ధం చెప్పడం మహాపాపం అని నాకు తెలుసు.
47. అనవసరంగా ఇతరులను మాటలతో గాని, పనులతో గాని కష్టపెట్టను. హింసించను. సర్వప్రాణుల యందు దయ కలిగి ఉంటాను.
48. ఎవ్వరి వస్తువులను గాని, ధనాన్ని గాని, పేరు ప్రతిష్టలను గాని ఇంకా ఏదైనా గాని దొంగిలించను.
49. నేను చేసే పాప పుణ్యాలను భగవంతుడు చూస్తుంటాడని వాటికి తప్పకుండా ఫలితం ఉంటుందని నమ్ముతాను.
50. ప్రపంచంలో అందరు మనుషులనూ సమానంగా చూస్తాను.
51. నా మనస్సును అదుపులో పెట్టుకుంటాను. దానిద్వారా నా మనోబలం పెంచుకుంటాను.
52. నాలోని అహంకారాన్ని గుర్తిస్తాను. దాన్ని క్రమక్రమంగా తగ్గించుకుంటాను. అహంకారాన్ని ఆత్మగౌరవంగా పొరబడను.
53. మొండితనం లేదా మూర్ఖత్వం నన్ను నాశనం చేస్తుందని తెలుసు. అందుకే మొండితనాన్ని మానుకొని బుద్దితో ఆలోచిస్తాను.
54. నా విజయానికి అవరోధమైన “నేను గొప్ప” అనే భావనను మనస్సులోనుంది క్రమక్రమంగా తీసివేస్తాను.
55. నన్ను సంపూర్ణంగా కృంగదీసే “నేను తక్కువ” అనే భావనను మానసిక సాధన ద్వారా వదిలించుకుంటాను.
56. ధర్మ విరుద్ధమైనవి, విపరీతమైనవి, ఆచరణ సాధ్యం కానివి అయిన కోరికలు ఎప్పుడూ కోరను.
57. కోపం జ్ఞానాన్ని హరించి వేస్తుంది కావున దాన్ని ఎప్పుడూ అదుపులో పెట్టుకుంటాను.
58. దురాశ నాతో పాపాలను చేయిస్తుంది కావున ఎప్పుడూ దురాశకు లోను కాను.
59. అసూయ నాలో భయంకరమైన అగ్నిని నింపుతుందని తెలుసు. అందువలన అసూయను దగ్గరికి రానివ్వను.
60. పెద్దలపట్ల మరియు జ్ఞానవంతులపట్ల వినయంగా ఉంటాను.
61. ఎవరినీ యాచించను. ఎవరిదగ్గరా ఏదీ ఉచితంగా తీసుకోను. నాది నేను సంపాదించుకొని ఆత్మ గౌరవంతో బ్రతుకుతాను.
62. నిరాడంబరంగా బ్రతకడం ఉత్తమ లక్షణం కాబట్టి నిరాడంబరంగానే బ్రతుకుతాను.
63. వీలున్నంత వరకు ఇతరులపై ఆధారపడకుండా నా పని నేనే చేసుకుంటాను. స్వయం సేవ అనేది చిన్నతనంగా భావించను.
64. నేను ప్రశాంత జీవనం గడపడానికి ఆటంకాలేవో తెలుసుకొని వాటిని తొలగించుకుంటాను. ప్రశాంతంగా బతుకుతాను.
65. తల్లిదండ్రులను ప్రేమిస్తాను. వారికి కావలసినవన్నీ చేసి పెడతాను.
66. ఉపాధ్యాయులను గౌరవిస్తాను. వారినుండి సవినయంగా విద్యను అభ్యసిస్తాను.
67. నిజమైన గురువులకు శుశ్రూష చేసి వారినుండి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నేర్చుకుంటాను. వారిని పూజిస్తాను.
68. పెద్దలను గౌరవిస్తాను. వారినుండి జీవన సత్యాలను నేర్చుకుంటాను.
69. ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా, కొంచమైనా ఇతరులకు సహాయపడతాను.
70. మంచి సంప్రదాయాలను, మంచి ప్రవర్తనను కలిగి ఉంటాను. ఏ ఏ వ్యక్తులతో ఎలా మెలగాలో అలా మెలగుతాను.
71. నాకు సహాయం చేసిన వారిని ఎన్నడూ మరవను. సమయం వచ్చినప్పుడు కృతజ్ఞతతో వారి ఋణం తీర్చుకుంటాను.
72. దుష్టులతో సహవాసము చేయను. మంచివారితో సాంగత్యము చేస్తాను. మంచి పుస్తకాలు చదువుతాను.
73. నా సంస్కృతీ సాంప్రదాయాలను పరిరక్షిస్తాను.
74. ప్రతిరోజూ నా వలన ఏమైనా తప్పులు జరిగాయా అని ఆత్మ పరిశీలనం చేసుకొని తప్పులను సరిదిద్దుకొంటాను.
విజయము – ఆరోగ్యము
75. ఆరోగ్యమే మహాభాగ్యం కావున నా ఆరోగ్యాన్ని కాపాడుకొంటాను.
76. పొగాకు దీర్ఘకాలంలో మనుషులను చంపుతుంది కావున దాన్ని ఏ రూపంలోనూ వాడను.
77. మద్యం నా జ్ఞానాన్ని హరించివేసి అనేక తప్పులను, పాపాలను మరియు నేరాలను చేయిస్తుంది. దాని తెరువు వెళ్ళను.
78. మాదక ద్రవ్యాలు మహా భయంకరమైనవి. జీవితంలో ఏనాడూ వాటి వైపుగాని, వాటిని వాడే వారి వైపు గాని వెళ్ళను.
79. సకాలంలో భోజనం చేస్తాను మరియు నిద్ర పోతాను. ఇవి నన్ను ఆరోగ్యంగా ఉంచుతాయి.
80. పోషక విలువలు ఉన్న మరియు శుచియైన ఆహారపదార్థాలనే తింటాను.
81. శరీర శుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తాను.
82. సెల్ ఫోన్, కంప్యూటర్ మొదలైన ఎలక్ట్రానిక్ పరికరాల అనవసర వాడకానికి బానిసను కాను. అవి నా ప్రగతికి నిరోధకాలు.
83. ధ్యానం, యోగ మొదలైన వాటిని చేస్తాను. మనస్సును ఉల్లాసంగా ఉంచుకుంటాను.
84. ప్రతినిత్యం క్రీడలకొరకో, వ్యాయామం కొరకో, నడక కొరకో కొంత సమయాన్ని వెచ్చిస్తాను.
విజయము – సమాజము
85. నా సమాజాన్ని చక్కగా మలచుకొని ఆనందంగా జీవించడానికి ఉపయోగపడే ఒక సుందర ప్రదేశంగా మార్చుకుంటాను.
86. నేనే కాకుండా నా ప్రక్కన ఉన్నవారి శ్రేయస్సు కూడా కోరుకుంటాను.
87. నా సమయంలో, ధనంలో, బలంలో, విజ్ఞానంలో ఎంతో కొంత సమాజ సేవకై వెచ్చిస్తాను. కానీ అపాత్రదానం చేయను.
88. నా మతాన్ని పాటిస్తాను మరియు అన్ని మతాలనూ గౌరవిస్తాను.
89. ప్రతి మతం లోని మంచిని మరియు మానవత్వపు విలువలను తీసుకుని ఆచరిస్తాను.
90. మానవత్వపు విలువలకు వ్యతిరేకంగా ఉన్న ఏ మతాన్నీ గౌరవించను.
91. రంగు బట్టలు ధరించి ప్రజల్ని మోసం చేసే దొంగ బాబాలను, స్వాములను, తాము మహర్షులమని ప్రకటించే వారిని నమ్మను.
92. గొప్ప వ్యక్తుల ఆశయ సాధన కోసమై పనిచేస్తాను కానీ వారికి గుళ్ళు గోపురాలు కట్టి వారి విగ్రహాలకు పూజలు చేయను.
93. మతం లోని మంచి సూత్రాల ద్వారా మనస్సును శుద్ధి చేసుకుంటాను. సత్ప్రవర్తనను అలవరచుకుంటాను.
94. డబ్బుల కోసం ఏనాడూ మతాలు మారను.
95. మూడ విశ్వాసాలను ఎప్పుడూ సమర్థించను.
96. జ్ఞానాన్ని సముపార్జించుకొని, ప్రతి ప్రాణిలోనూ భగవంతున్ని చూసే సాధన చేస్తాను.
97. ఎవరికీ లంచం ఇవ్వ వలసిన పరిస్థితిని తెచ్చుకోను. లంచగొండితనానికి వ్యతిరేకంగా పోరాడతాను.
98. ఇతరులతో మాట్లాడేటప్పుడు సభ్యత మరియు సంస్కృతి పాటిస్తాను.
99. ప్రజా ప్రదేశాలలో ఉమ్మడం, చెత్త వేయడం, మల మూత్ర విసర్జన చేయడం వంటివి అసలే చేయను. వాటిని ఖండిస్తాను.
100. వాహనాలను పద్దతిగా, ఇతరులకు ఇబ్బంది కలగకుండా నడుపుతాను. తప్పుడు పార్కింగ్ చేయను.
101. నా స్వంత పనుల కోసం, వేడుకల కోసం రోడ్డును మూసివేసి ఇతరులకు ఇబ్బంది కలిగించను.
102. సెల్ ఫోన్లు కాని, టీవీలు కాని, స్పీకర్స్ కాని ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా వాడను.
103. మరుగుదొడ్లను సరియైన పద్ధతిలో వాడుకుంటాను. నా తర్వాత వాడే వారిని దృష్టిలో పెట్టుకుంటాను.
104. ప్రజా సౌకర్యాలను వాడుకునే విషయంలో క్యూ పద్ధతిని పాటిస్తాను. పిల్లలకు మరియు వృద్ధులకు ప్రాధాన్యత ఇస్తాను.
105. ప్రజా ప్రదేశాలలో పొగ త్రాగడం, మద్యం సేవించడం, మాదక ద్రవ్యాలు సేవించడం మొదలైనవి చేయను మరియు ఖండిస్తాను.
106. నేను చేసే ఏ పని వలన కూడా ఇతరుల హక్కులకు భంగం వాటిల్లకుండా చూసుకుంటాను.
107. జాతీయ వనరులను, జాతీయ సంపదను రక్షిస్తాను. రాజ్యాంగంలో పొందుపరచబడిన ప్రాథమిక బాధ్యతలను నెరవేరుస్తాను.
108. దేశభక్తిని కలిగి ఉంటాను. భారతదేశం ప్రపంచంలో మహోన్నత స్థాయికి ఎదగడానికి అహర్నిశలూ నా వంతు పాత్రను పోషిస్తాను.
-----జై హింద్------
సంస్కారభారతి
సేవాశ్రం అనేది స్వామి వివేకానంద సిద్ధాంతాల ఆచరణ కొరకై ఏర్పడిన ఒక
ధార్మిక సంస్థ. యువత వ్యక్తిత్వ వికాసం కోసమై కంకణం కట్టుకున్నది. సంస్కార
భారతి, సిద్ధిపేట జిల్లా, ములుగు మండలంలో గల కొక్కొండ గ్రామంలో “సంస్కార
భారతి వ్యక్తిత్వ వికాస పాఠశాల”ను స్థాపించి దాని చుట్టుప్రక్కల ఉన్న పది
గ్రామాలను దత్తత తీసుకొన్నది. దత్తత తీసుకున్న గ్రామాల యువతకు వ్యక్తిత్వ
వికాస విద్యను మరియు శిక్షణను ఇస్తున్నది. విద్యార్థుల కొరకై సంస్థ
సంస్థాపకులు CA బెజగామ గణేశ్ శర్మ గారు మూడు సంవత్సరాలు శ్రమించి “విజయం
కావాలంటే” అనే పుస్తకం వ్రాశారు. ఇది ఇంగ్లీషు భాషలోకి కూడా
అనువదించబడినది. ఈ రెండు పుస్తకాలు www.sanskarabharathi.org అనే వెబ్ సైట్
లో చదువవచ్చు. సంస్థ కార్యక్రమాలు కూడా వెబ్ సైటులో చూడవచ్చు. మీరు పైన
చదివిన వాక్యాలపై, మా సంస్థ ఏర్పాటుపై మరియు మా పుస్తకాలపై మీ
అభిప్రాయాల్ని దయచేసి ganeshsharma123@yahoo.com అనే మెయిల్ idకి గాని 9618117702 మొబైల్ నంబరుకు SMS ద్వారా గాని లేక Whatsapp ద్వారా గాని పంపమని మనవి చేస్తున్నాము.
మీకు గనుక పై వాక్యాలు నచ్చితే whatsappలోను ఇతర మీడియా లోను మీకు తెలిసిన వారితో పంచుకోండి.
No comments:
Post a Comment