Sunday, October 20, 2019

*పోతనామాత్యుల శ్రీమద్భాగవత పద్య మందారాలు

*అల వైకుంఠపురంబులో నగరిలో నా మూలసౌధంబు దా*
*పలు మందార వనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోపలో*
*త్పల పర్యంక రమా వినోది యగు నపన్న ప్రసన్నుండు వి*
*హ్వల నాగేంద్రము పాహి పాహి యన గుయ్యాలించి సంరంభియై*

*వ్యాఖ్య*

           గజేంద్రుడు మొరపెట్టుకునే సమయములో ఆ దేవదేవుడు ఏ స్థితిలో ఉన్నాడో వర్ణించడము ఈ పద్యము‌లోని‌ చిత్రం.  ఒక్క మాటలో చెప్పాలంటే,
ఆ మహా విష్ణువు అప్పుడు రమా సాంగత్యములో తెలియాడుతున్నాడు. కానీ మూడు ముక్కల్లో ముడిచి చెప్పడము పోతనామాత్యుని‌ పద్దతి కాదు. రసకేళీ
పరవశుడైన ఆ రమాధవుని స్థితికి ఒక చలనచిత్రాన్ని రూపొందించినాడు. కన్నుల
ముందు అతనికి కదలాడేటట్టు చూపినాడు *అల వైకుంఠపురం*; ఆ పురంలో  *అంతఃపురం*; ఆందులో  ప్రధాన సౌధ సమీపములో *అమృత సరోవరం*; అక్కడ చంద్ర కాంత వేదికపై కలువల పానుపు; ఆ పానుపుపై క్రీడిస్తున్న నారాయణుడు ~ ఇదీ పోతన కట్టిన చిత్రతోరణము!

         ఇంత వివరంగా ఎందుకు చిత్రించినట్లు? ఎవరు మొర పెట్టినా,  తలుపు  తట్టినా,  లెక్కింపని స్థితి అది! ఎక్కడో గజేంద్రుడు ఆక్రందిస్తుంటే, ఇక్కడ ఇంతటి
రస పారవస్యములో ఉన్న స్వామి సంరంభించడము సామాన్యము కాదు; జీవాత్మ పరమాత్మల మధ్య ఉన్న అంతులేని అఘాతాన్ని, అపార వ్యత్యాసాన్ని‌ ఎంతో మెలకువతో చిత్రించినాడు. అతడు రమావినోదియైనా, ఆర్తుని మొర విని
పరుగెత్తడానికి కారణం   ఒక్క మాటలో‌ సూచించినాడు కవి. అదే
*ఆపన్న‌ ప్రసన్నుండు* అనేది. *ఎక్కడున్నా జనార్దనుడు ఆర్తత్రాణ పరాయణుడే;*


          గజేంద్రుడున్న‌ కరుణావస్థకు,  ఉపేంద్రుడున్న శృంగార రస స్థితికి‌ మధ్య
ఆర్తి ఒక సేతువైయింది ~ అదే ఈ పద్యము లోని‌ కొస మెరుపు!

~~~ ( సేకరణ : పి. యల్. నరసింహాచార్య దాసన్ ) ~~~
‌

No comments:

Post a Comment