Thursday, October 17, 2019

*బ్రహ్మమును నేనే అని హృదయంలో ధ్యానించు.....*

అస్తభేదం...

భేదాలన్నీ తొలగినట్టిది. భేదాలు ఉండేది శరీర మనోబుద్ధుల స్థాయిలోనే. ఆత్మలో - బ్రహ్మములో ఏ భేదాలు లేవు. ఉండవు. శరీరం ఉన్నదంటే నలుపు ఎరుపు అని; లావు సన్నం అని, పొడుగు పొట్టి అని, అందం అనాకారం అని ఇలా భేదాలుంటాయి. ఇక ఇంద్రియాల స్థాయిలో కూడా భేదాలే. శబ్దం వినిపించే స్థాయిలో, స్పర్శ తెలిసే స్థాయిలో, రూపాన్ని చూచే స్థాయిలో, రసాన్ని ఆస్వాదించే స్థాయిలో, గంధాన్ని గ్రహించే స్థాయిలో ఎక్కువ తక్కువలుంటాయి. భేదాలుంటాయి.

ఇక మనోస్థాయిలో కామక్రోధాలు, లోభమోహాలు, మదమాత్సర్యాలు, అహంకారం, అందరికన్న గొప్పగా ప్రత్యేకంగా ఉండాలనే భావన, ఇది ఇలా ఉండకుండా అలా ఉంటే బాగుండేదని, ఆ పనిచేస్తే బాగుండేదని, ఈ పనిచేయకుంటే బాగుండేదని, ఇలా ఎన్నో భావనలు, ఉద్రేకాలు. వీటిలో భేదాలు, అలాగే బుద్ధి స్థాయిలోని ఆలోచనలలో భేదాలు. స్వార్థం, పరోపకారం మొదలైనవి. అయితే ఈ భేదాలన్నీ శరీర, ఇంద్రియ, మనోబుద్ధుల స్థాయిలోనే గాని ఆత్మస్థాయిలో లేవు. ఆత్మ అనేది ఒక రూపం లేని చైతన్యం. సర్వవ్యాపి. దానికి ఏ ఇంద్రియాలు గాని.. మనోబుద్ధులుగాని లేవు. కనుకనే ఏ భేదాలు లేవు. అనుభవాలు గాని, ఆలోచనలు గాని లేవు. అది ఒక నిశ్చల, ప్రశాంత, గంభీర, తత్వం.

అనపాస్త లక్షణం...

ఎప్పుడూ ఉండే లక్షణం. అది సత్ - చిత్ - ఆనందం ఈ ప్రపంచం లేని కాలం ఒకటి ఉంటుంది గాని.. చైతన్యం లేదా బ్రహ్మం లేని కాలమంటూ అసలు ఉండదు. అందుకే అది.. 'సత్' చిత్, జ్ఞానస్వరూపం, క్షేత్రానికి కొన్ని తెలుసు కొన్ని తెలియదు, కాని ఆత్మకు తెలియనిది లేదు. ఆనందం, పరిపూర్ణ ఆనందం. క్షేత్రానికి పరిమిత ఆనందం. కొంచెం సేపు సుఖం, కొంచెం సేపు దుఃఖం, కాని ఆత్మకు.. ఎప్పుడూ ఒక్కటే ఆనందం.

నిస్తరంగ జలరాశి.. నిశ్చలం...

అలలు లేని సముద్రం లాగ నిశ్చలం. ఆత్మను లేదా బ్రహ్మమును సముద్రంతో పోలుస్తారు. సముద్రం కూడా అనంతమైనది. ఐతే నిజంగా అనంతం కాదు కాని అంతం కనిపించదు. అనంతమైనదేదైనా నీలం రంగులో కనిపిస్తుంది. నిజంగా సముద్రజలం నీలం రంగు కాదు. సముద్రం నుండి ఒక కాలువను త్రవ్వితే అందులో ఆ నీరే ప్రవహిస్తుంది కాని నీలం రంగులో ఉండదు. మామూలుగానే ఉంటుంది. అయితే ఎంతో విశాలం, ఎంతో లోతు ఐన సముద్రజలం నీలం రంగులో కనిపిస్తుంది. అలాగే అనంతమైన ఆకాశం కూడా నీలం రంగులో కనిపిస్తుంది. అందుకే రాముడు, కృష్ణుడు మొదలైన వారిని నీలమేఘ శ్యాములుగా చెబుతారు. ఇలా అనంత జలరాశితో కూడిన సముద్రం నిశ్చల శాంతితో ఉంటుంది...

*|| ఓం నమః శివాయ ||*
Forwarded by Suredra pss

No comments:

Post a Comment