Friday, October 4, 2019

*పోతనామాత్యుల శ్రీమద్భాగవత పద్య మకరందాలు ~ 1*

            ~~~ ( సేకరణ : పి. యల్. నరసింహాచార్య దాసన్ ) ~~~

          పోతన విరచిత భాగవతము లోని అన్ని స్కందాలలోనుండీ ఒక ఏబది పద్య రత్నాలను ఏరి కోరి, వాటికి తనదైన వ్యాఖ్యలను జతచేసి *Dr. సి.* *నారాయణ రెడ్డి గారు* దాదాపు డెబ్బైవ దశకములో గ్రంధస్తము చేసినారు. అందులోని వాటిని రోజుకొకటి చొప్పున భాగవతులకు చేరవేద్దామనే సంకల్పముతో ఈ రోజు మొదటి పద్య మకరందాన్ని మీకు పంపుతున్నాను:

*శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్ లోక ర*
*క్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకు‌న్ దానవో*
*ద్రేక స్థంభకు గేళిలోల విలస దృగ్జాల సంభూత నా*
*నా కంజాత భవాండ కుంభకు మహా నందాంగనా ఢింబకున్*

            పోతన మహా భాగవతములోని మొదటి పద్యమిది; అంటే, నాందీ శ్లోకము లాంటిది; ఈ పద్యములో నమస్కృతీ ఉంది, కథా విష్కృతీ ఉంది.

           *మహానందనా ఢింభకుడు* భాగవతా కథా నాయకుడు; అతని
స్మరణము వస్తు వరణమే కదా!  భాగవతాన్ని తెనుగించమని ఆనతిచ్చిన వాడు
*రామభద్రుడు*; ఈ కృతిని అందుకున్నవాడు *నందనందనుడు*; అందుకే పోతన ఆ నందకుమారుని అనంత ముఖ అవతార రహస్యాలను ఈ పద్యములో పొందు పరచినాడు;

          *లోక రక్షైకారంభకుడు* అని అనడములో పరమాత్ముని స్థితి కరత్వాన్ని, భక్తి పాలన కళా సంరంభకుడని‌ అనడములో గజేంద్రుని లాంటి ఆర్తులను ఆదుకునే గుణాన్ని ~~

          *దానవోద్రేక స్థంబకుడు* అని అనడములో హిరణ్య కశిపుని వంటి
రాక్షస ప్రవృత్తులను అణగార్చే పనితనాన్ని ~~

         *కేళీలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకుడు* అని అనడములో ప్రధానముగా సృష్ఘి లీలలను కేళీ శబ్ధముచేత
ఒక రకముగా కృష్ణ లీలను ధ్వనింపజేసినాడు;  ఇంతటి మహార్థా‌న్ని ధ్వనింపజేస్తూనే పోతన తనకు వెన్నతో పెట్టిన పద్య విద్యను మరువలేదు.

        *డింభకుణ్ణి మనస్సులో అనుకున్నాడు; *ఆరంభకున్* *సంరంభకున్*
*స్థంభకున్* *కుంభకున్* ~ అంటూ సమాసాంతములో అంత్యప్రాసలు కూర్చే
వింత విద్య  ఇది; చెవికి చవులూరించే నాద సుఖము బిందు పూర్వక *భ* కారా‌న్ని పునరుక్తము చేసి మహత్తర నాదాన్ని పూరించినాడు పోతన. పదము అర్థము పొందిన మధుర సమ్మేళనమే ఈ పద్యము; ఈ పద్యములో ఆయన
ఆశిస్తున్నదు ఏ కృతిభర్త ఇచ్చే ఆశీస్సులు కాదు; అసలీ కృతికి ఏ నరపతీ కృతిపతి కాడు; శ్రియఃపతి తప్ప‌!

         అంతటి సిరిదొరను అమాయకుడు అర్థించేందేమిటి? కేవలం కైవల్యం, శరీర, ఇంద్రియ విముక్తమైన ఆత్మ కేవలమైనది. అది పొందే స్థితి కైవల్యము;
ముముక్షువైన పోతన కాంక్షించేది కేవలము కైంకర్యమే కానీ కాసులు కాదు.
( సశేషం...)

No comments:

Post a Comment