*అహంకార మమకారాలు....
నేను, నాది.. అనే భావాలే అహంకార మమకారాలు. అహంకారం పుట్టిన తర్వాతనే మమకారం పుడుతుంది. అహంకారమంటే దేహాన్ని నేను అనుకోవటమే. మమకారమంటే అన్నింటిని నావి, నావారు అనుకోవటం. ఈ భావాలను తొలగించుకోవాలి. ఎందుకంటే ఇది అధ్యాస, భ్రమ. ఎలా తొలగించుకోవాలో క్రిందటి శ్లోకంలో చెప్పారు. స్వ - ఆత్మ- నిష్టా అని. 'ఆత్మలో నిష్ఠ కలిగి' అని. ఆత్మలో నిష్ట కలిగి అధ్యాసను తొలగించుకునే సాధనా మార్గం...
నీ దేహాన్ని, దేహం చేసే పనులను.
నీ మనస్సును, మనస్సు చెందే ఉద్రేకాలను, అనుభవాలను.
నీ బుద్ధిని, బుద్ధిలో కలిగే ఆలోచనలను, అలజడులను, వీటన్నింటిని చూసే సాక్షిగా నీదేహంలోని ఆత్మను గుర్తించాలి.
ఆ ఆత్మ యొక్క స్వభావం ఏమిటో కూడా తెలుసుకోవాలి. అది నిరాకారం అని, నిర్గుణం అని, నిర్వికారం అని, సర్వవ్యాపి అని, అన్నింటికి చైతన్యాన్ని ఇచ్చి తాను మాత్రం అసంగంగా ఉండేదని... ఇలా ఆత్మయొక్క స్వభావాన్ని మననం చేసి దానిని బాగా వంట పట్టించుకోవాలి.
ఇలా ఆత్మ ఈ దేహమనోబుద్ధులను, వాటి వృత్తులను సాక్షిగా చూస్తున్నదని గ్రహిస్తూ.. గుర్తిస్తూ.. క్రమంగా ఆ 'ఆత్మ నేనే' ననే దృఢ నిర్ణయానికి రావాలి. అదే ఆత్మకు దగ్గరగా రావటం.
సోఽహం...
అదే నేను అని గుర్తించటమే ఆత్మవైపు జరగటం, ఆత్మతో తాదాత్మ్యం చెందటం. కనుక అనాత్మతో తాదాత్మ్యాన్ని వదిలించుకొని ఆత్మతో తాదాత్మ్యం చెందాలంటే... 'స్వ - ఆత్మ - నిష్ట' లో నిలవాలి. నిలవాలంటే మనం ఏంచేయాలి..
"శరీర మనోబుద్ధులను వాటి వృత్తులను సర్వకర్మలను కేవల సాక్షిగా చూస్తూ జీవించటం ప్రారంభించు". ఈ సాక్షి ఎవరు.. అనే ప్రశ్న రాగానే ఇది ఆత్మ, అది నేనే. నేను ఆత్మనే 'అహం బ్రహ్మాస్మి' అనే భావన దృఢంగా కలుగుతుంది. కనుక ఈ అభ్యాసాన్ని నిరంతరం కొనసాగించాలి. చాలాకాలం కొనసాగించాలి. అలా అయితేనే ఎన్నో కోట్ల జన్మల నుండి 'దేహమే నేను' అనే భ్రమ, అధ్యాస తొలగిపోతుంది. ఆత్మనే నేను అనే భావం బుద్ధిలో దృఢంగా నాటుకుంటుంది. ఆత్మలో నిష్ఠ కుదురుతుంది. అదే "సద్వృత్తి".
బ్రహ్మాకారవృత్తి...
'చైతన్యమే నేను' అనే భావమే బ్రహ్మాకారవృత్తి. ప్రవాహంలా కదిలిపోతున్న ఆలోచనలను గుర్తించేదే చైతన్యం. దేహేంద్రియాల కదలికలకు ఆధారమైనదే చైతన్యం. ఈ చైతన్యాన్ని గుర్తించిన తర్వాత దానివైపు జరగటానికి ప్రయత్నించాలి. అంటే ఆ చైతన్యంతో తాదాత్మ్యం చెందాలి. అంటే చైతన్యం నేనే ననే భావన రావాలి. అదే దగ్గరగా జరగటం అంటే ఇలా చైతన్యానికి దగ్గరపడి దానితో తాదాత్మ్యం చెంది, అదే నేనుగా ఉండిపోవాలి...
Forwarded by Sunanda pss
No comments:
Post a Comment