Monday, October 7, 2019

శ్రీమాత్రే నమః

శ్రీదేవీ శరన్నవరాత్రులలో అమ్మవారు తోమ్మిదవరోజున *శాక్తేయానుసారము సిద్ధిదాత్రిగా సౌమ్యమున మహిషాసురమర్థని గా దర్శనమిస్తుంది*

*శ్రీ సిద్ధి ధాత్రీ దేవి*

సర్వవిధ సిద్ధులను ప్రసాదించు తల్లిగనుక సిద్ధి దాత్రి. పరమేశ్వరుడు సర్వ సిద్ధులను దేవి కృపవలనే పొందెనని దేవీపురాణమున పేర్కొనబడింది. ఈమె పరమశివునిపై దయదలచి, ఆయన శరీరమున అర్ధబాగమై నిలచెను. సిద్ధిధాత్రీదేవి చతుర్భుజ, సింహవాహన. ఈమె కమలముపై ఆసీనురాలై యుండును. ఈమె కుడివైపున ఒకచేతిలో చక్రమును, మఱొకచేతిలో గదను ధరించును. ఎడమవైపున ఒక కరమున శంఖమును, మఱియొక హస్తమున కమలమును దాల్చును. నిష్ఠతో ఈమెను ఆరాధించువారికి సకలసిద్ధులును కరతలామలకము.

ఈమె కృపచే భక్తులయొక్క, సాధకులయొక్క లౌకిక, పారమార్ధిక మనోరథములన్నియును సఫలములగును. సిద్ధిదాత్రి మాత కృపకు పాత్రుడైన భక్తునకు కోరికలెవ్వియును మిగిలియుండవు. అట్టివానికి భగవతీదేవి చరణ సన్నిధియే సర్వస్వమగును. భగవతీమాత యొక్క స్మరణ ధ్యాన పూజాదికముల ప్రభావము వలన ఈ సంసారము నిస్సారమని బోధ పడును. తన్మహత్వమున నిజమైన, పరమానందదాయకమైన అమృతపదము ప్రాప్తించును.

*శ్లోకం*

సిద్ధగంధర్వయక్షాద్యై, అసురైరమరైరపి
సేవ్యమానాసదా భూయాత్‌ సిద్ధిదా సిద్ధిదాయినీ

*శ్రీ మహిషాసురమర్థిని దేవి*

అమ్మవారి నవఅవతారాల్లో మహిషాసురమర్దినీదేవిని మహోగ్రరూపంగా భావిస్తారు. దేవీనవరాత్రులలో  అమ్మ మహిషాసురుడిని సంహరించిన అశ్వయుజ శుద్ధ నవమిని ‘మహర్నవమి’గా జరుపుకుంటారు. సింహవాహనాన్ని అధిష్టించి ఆయుధాలను ధరించిన చండీదేవి సకల దేవతల అంశలతో మహాశక్తి స్వరూపంగా  మహిషమర్ధనిగా దర్శనమిస్తుంది.

ఈ తల్లిని పూజిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. మహిషాసురమర్దిని ఆరాధన వల్ల భయాలన్నీ తొలగిపోతాయి. సర్వకార్యాల్లో విజయం సిద్ధిస్తుంది.

అమ్మవారికి చండీసప్తి పారాయణ.. హోమం జరిపి.. గారెలు,పానకం,వడపప్పు నివేదన విశేషం..

*మహిషమస్తక నృత్తవినోదిని,
స్ఫుటరణన్మణి నూపుర మేఖలా
జననరక్షణ మోక్షవిధాయినీ,
జయతి శుంభనిశుంభ నిషూదినీ*🌹🌹🌸🌸🌸🙏🙏🙏💐💐

No comments:

Post a Comment