Tuesday, October 29, 2019


*పరోక్షజ్ఞానం.....*

లోకవాసన, దేహవాసన, శాస్త్రవాసన.. ఈ మూడింటి వల్లనే వేదాంత శాస్త్రాల్లో చెప్పిన విధంగా అపరోక్ష జ్ఞానం కలుగదు.

జ్ఞానం అంటే శాస్త్రజ్ఞానం. ఇది పరోక్షజ్ఞానం. ఈ పరోక్షజ్ఞానమే అపరోక్ష జ్ఞానం కావాలి. అనుభవజ్ఞానం కావాలి. అదే మోక్షం. అయితే దీనికి అడ్డుపడేవే వాసనలు. అవే..

1) లోకవాసన
2) దేహవాసన
3) శాస్త్రవాసన.

మోక్షాన్ని పొందాలంటే అపరోక్ష జ్ఞానాన్ని పొందాలంటే ముందు పరోక్ష జ్ఞానాన్ని పొందాలి. అలా పొందాలంటే శాస్త్రాలను అధ్యయనం  చేయాలి. అవి చక్కగా అర్థం కావాలంటే శాస్త్రజ్ఞానం, అనుభవజ్ఞానం కలిగిన ఒక సద్గురువును ఆశ్రయించాలి.

అప్పటిదాకా సాధారణంగా అందరికీ 'నేను ఈ దేహాన్నే' అనే భ్రమ ఉంటుంది. అది పోవాలి. నేను ఈ దేహాన్ని కాదు. దేహమనోబుద్ధులతో కూడిన ఈ క్షేత్రాన్ని కాదు. ఈ క్షేత్రాన్ని తెలుసుకొనే ఈ క్షేత్రానికి చైతన్యానిచ్చి, దాని పని అది చేసుకోవటానికి వీలు కల్పించే నిరాకార, నిర్గుణ, నిర్వికార, చైతన్యాన్ని, చావు పుట్టుకలు లేని, శాశ్వత సర్వవ్యాపక చైతన్యాన్ని అని దృఢంగా భావన కలగాలి. సంశయ రహితంగా ఈ దృఢభావన కలగటమే ఆత్మజ్ఞానం, ఇదే.. పరోక్షజ్ఞానం.

ఇట్టి భావన కలగటానికి శాస్త్రజ్ఞానమూ కావాలి. దేహేంద్రియాల పోషణా జరగాలి. అవసరమైనంత వరకు ఈ లోకాన్ని అనుసరిస్తూ కూడా రావాలి. అయితే ఒకసారి ఈ జ్ఞానం కలిగిన తర్వాత అది అనుభవానికి రావాలంటే అనుభూతి కలగాలంటే, నేను బ్రహ్మమును అనే భావన స్థిరపడి బ్రహ్మముగానే ఉండిపోవాలంటే.. ఈ లోకవాసన, దేహవాసన, శాస్త్రవాసన ఉండరాదు. ఇవే నిజంగా మనకు అడ్డమౌతాయి.

లోకంలోని జనులంతా పుట్టిన దగ్గర నుండి చచ్చేదాకా ఉండే ఈ జీవితాన్ని గురించి ఆలోచిస్తారే గాని, ఇంతవరకు ఎన్ని జన్మలెత్తాము.. ఇంకా ఎన్ని జన్మలెత్తాలి.. జన్మలెందుకు వస్తున్నాయి? జన్మలొస్తే నష్టం ఏమిటి.. రాకుండా చెయ్యాలంటే ఈ జన్మలో ఏంచేయాలి? అని ఆలోచించరు. నిజంగా జంతువులు ఇలాంటి ఆలోచన చేయలేవు. ఎందుకంటే వాటికసలు బుద్ధే లేదు గనుక. మానవులకు బుద్ధి ఉంది గదా! మరి వారెందుకు చేయరు.. అంటే వారు బుద్ధిని దీనికోసం ఉపయోగించరు.

అలా ఉపయోగించకుండా దానిని దేహపోషణ, భార్యాబిడ్డల పోషణ, ధనసంపాదన, కీర్తిప్రతిష్టలు సంపాదన, భోగాల సంపాదన, వీటిలో పడిపోయి పూర్తిగా వీటికే జీవితాన్ని అంకితం చేస్తారు బుద్ధిని దీనికే ఉపయోగిస్తారు. అంటే భగవంతుడు ఒకందుకు ఇచ్చిన బుద్ధిని దాని కొరకు ఉపయోగించకుండా మరొకందుకు ఉపయోగిస్తున్నారు. అంటే వ్యర్థం చేస్తున్నారు. దుర్వినియోగం చేస్తున్నారు. మరి అట్టివారిని అనుసరించవచ్చునా.. అయ్యో అనుసరించ లేకపోతున్నామే అని బాధపడవచ్చునా... కనుక లోకం ఏమనుకుంటుందో, ఎవరు ఏమనుకుంటారో ...

అయ్యో! ఇది లోకవిరుద్ధం కదా! అందరూ అలా సంపాదించుకుంటుంటే మనమేమిటి అన్ని వ్యవహారాలు వదిలేస్తున్నాం.. అందరూ ఇంకొక ఇల్లు, మరొక ఇల్లు, మా పెద్దోడికొక ఇల్లు, మా బుజ్జిగాడికొక ఇల్లు, మా వృద్ధాప్యంలో విస్రమించి సయనించటానికి తీసుకోవటానికొక ఇల్లు అని ఇలా కట్టించుకొని మురిసిపోతుంటే, ఉన్న ఇల్లునే వదిలేస్తున్నామేంటి.. అనే పిచ్చి ఆలోచనలు చెయ్యకూడదు. భాద్యతలు బరువులు, బంధాలు పెంచుకుంటూ పోయి బంధంలో ఇరుక్కుపోగూడదు...
Forwarded by Surendra pss 

No comments:

Post a Comment