Wednesday, August 7, 2019

⭕ *శివానందలహరి* ⭕
▪▪▪▪▪▪▪▪▪
శ్లోకం-6

【●】 *అవతారిక:*

తర్కశాస్త్రం మొదలైన శాస్త్ర పదాలు ఒకసాధనమాత్రంగానే గుర్తింౘాలి.‌
అంతేగాని శాస్త్ర మే సర్వమూ అన్నవిధంగా, తర్కశాస్త్ర పదాలు వల్లిస్తూ,
కంఠక్షోభం తెచ్చుకుని ప్రయోజనం లేదనీ, ఆ తర్కశాస్త్ర పదాలు మృత్యువును
నివారించ లేవని చెప్పి, పరమ శివుని పాద పద్మము లను సేవించి మోక్ష సుఖమును పొందమని శంకరులు ఈ శ్లోకంలో హితబోధ చేశారు.

[●][●][●][●][●][●][●][●][●][●][●]

శ్లో" _ఘటోవా మృత్పిండోప్యణురపి చ ధూమోగ్నిరచలః_
_పటోవా తంతుర్వా పరిహరతి కిం ఘోరశమనమ్,_
_వృథా కంఠక్షోభం వహసి తరసా_ _తర్కవచసా_
_పదాంభోజం శంభోర్భజ పరమసౌఖ్యం వ్రజ సుధీః !!_

[●][●][●][●][●][●][●][●][●][●][●]

【●】 *తాత్పర్యం:*

ఓ తర్కశాస్త్ర పండితుడా ! ఘటము, మట్టిముద్ద, అణువు, పొగ, అగ్ని,
పర్వతము, వస్త్రము వంటి తర్కశాస్త్ర పదములలో, ఏవియు కూడా
భయంకరమైన మృత్యువును తొలగింపలేవు. అందుచే తీవ్రమైన ఈ తర్క
వాక్కులచే నీవు కంఠశోషను కల్గింౘు కుంటున్నావు. దయాసముద్రుడైన
శివుని పాదపద్మాన్ని భజింౘు,. పరమోత్కృష్టమైన మోక్షసామ్రాజ్యాన్ని
అనుభవింౘు. (శాస్త్ర వాదనల వల్ల కాక, పరమేశ్వర పాదపద్మభజనము
వల్లనే, మానవత్వానికి సార్థకత కలిగించే మోక్షానందము లభిస్తుందని
భావము.)

【●】 *వివరణ:*

*మానవులు వివిధ శాస్త్ర ములు చదివి,ఆ శాస్త్ర ములలో వారు గొప్ప
పండితులైనా,* వారికి మరణ కాలం దగ్గరైనపుడు ఆ శాస్త్రజ్నానం,
వారిని మృత్యు దేవత నుండి రక్షించదు.కొన్ని కొన్ని పడికట్టు పదాల ద్వారా , ఒక్కొక్క శాస్త్రం, పరిచయమై, పలువురి ద్వారా ఆ పదాలు ప్రసిద్ధి చెందు తాయి. కుండకు మట్టి కారణం.
మట్టికి పృధ్వి పరమాణువులు కారణం.అగ్ని ఉన్న చోటనే పొగ ఉంటుంది. " యత్ర యత్ర వహ్నిః తత్ర తత్ర ధూమః " కొండపై పొగ కనపడుతూ వుంది కాబట్టీ అక్కడ అగ్ని ఉంటుంది.దారాల పోగులు తప్ప అక్కడ వేరుగా వస్త్ర మేమీ ఉండదు. మొదలైన తర్కశాస్త్ర పదాలను వల్లె వేసినంత మాత్రాన,కంఠానికి శ్రమయే మిగులుతుంది. అంతేగానీ,ఆ తర్క శాస్త్ర జ్నానం,యముడి కాల నిర్ణయాన్ని మార్చలేదు.ఆ శాస్త్ర పండితుని కలకాలం జీవింప చేయలేదు.
కాబట్టి శాస్త్ర పదాలు తఱౘుగా వల్లింౘడం మాని ఆ పరమ శివుని పాద
పద్మాల్ని సేవిస్తే, శాశ్వతమైన మోక్షానందం సిద్ధిస్తుందని శంకరులీ శ్లోకంలో
చెప్పారు.
అలాగే శంకరులు తమ భజగోవింద శ్లోకంలో కూడా ఇలాంటి విషయాన్నే
చెప్పారు.
" భజ గోవిందం , భజ గోవిందం గోవిందం భజ మూఢ మతే
సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుకృణ్కరణే "
*తాత్పర్యం:*
_ఓ మూఢ బుద్ధి గలవాడా ! గోవిందుణ్ణి సేవింౘు , మరణ కాలం సమీపించి
నప్పుడు, డుకృణ్కరణే అంటూ నీవు వల్లించే ధాతు పాఠం నిన్ను రక్షింౘదు.,
శివుని పాద పద్మాలు సేవించి మోక్షసౌఖ్యాన్ని పొందితే , _మరణ భయం_
_ఉండదని శంకరులు మానవులకు ఈ శ్లోకం ద్వారా హితోపదేశం చేశారు._
◆◆◆
 (సేకరణ:ముత్యంపేట మల్లికార్జున శర్మ)🙏🏻 By MALLIKHARJUN 

No comments:

Post a Comment