Saturday, August 31, 2019

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
శ్రీ మహా గణాధి పతయే నమః

*శ్రీ గణేశ పురాణం - 3వ రోజు*



భీముడు అనే రాజు కుండిన నగరాన్ని రాజధానిగా చేసుకుని విదర్భను పాలించేవాడు. భార్య చారుహాసిని. అనేక భోగభాగ్యాలు అనుభవిస్తూ ధర్మ బద్ధంగా రాజ్యాన్ని పాలించేవాడు కానీ సంతానలేమి వారిని బాధిస్తూ ఉండేది. దానితో ఒకనాడు మంత్రులకు రాజ్యాన్ని అప్పజెప్పి అరణ్యవాసానికి భార్యతో సహా పయనమయ్యాడు. మార్గ మధ్యంలో విశ్వామిత్ర మహర్షి ఆశ్రమానికి వెళ్ళి ఆయన దర్శనం చేసుకుని తన సమస్యను వెల్లడించారు. దానికి సమాధానంగా తన గత జన్మలో చేసినదైవ అపరాధం వల్ల అలా జరిగిందని చెప్పి, ఆ రాజు గత జన్మలో ధన మదంతో వారికి 7 తరాలనుండి కులదైవంగా ఉన్న గణపతి పూజ మానివేయడం వల్ల ఈ జన్మలో సంతానం లేకపోవడం జరిగిందని చెప్పాడు.
దానికి రాజు, వారికి గణపతి ఎలా కులదైవం అయ్యాడో వివరించమని అడుగగా విశ్వామిత్ర మహర్షి చెప్పనారంభించాడు. ఆ రాజుకి 7 జన్మల పూర్వంలో ఆ వంశంలో వల్లభుడు అనే రాజుకు లేక లేక ఒక శిశువు కలిగాడు. కానీ వాడు గుడ్డి, చెముడు, మూగ, అవిటివాడుగా పుట్టాడు. దానితో వారు చాలా దుఃఖించి, ఆ శిశువు సహజస్థితికి వచ్చుటకు మణి, మంత్ర, ఔషధ, దేవపూజలు, తీర్థయాత్రలు చేయసాగారు. అయినా ఫలితం లేకపోఇంది. వానికి దక్షుడు అని పేరు పెట్టారు. ఒకనాడు రాజు కోపంతో తన భార్యను ఇక కనిపించవద్దని, బిడ్డను కూడా తీసుకుని ఎక్కడికైనా దూరంగా పొమ్మనెను. దానితో ఆమె బిడ్డను తీసుకుని గ్రామ గ్రామాలు బిచ్చమెత్తుకుంటూ తిరుగసాగింది. ఇలా ఉండగా ఒకనాడు ఒక బ్రాహ్మణ బాలుని దేహముపైనండి వచ్చిన గాలిసోకగానే, తన బిడ్డయొక్క లోపాలన్నీపోయి బాగుపడ్డాడు. దానితో ఆశ్చర్యచకితులై ఆ బ్రాహ్మణ కుమారుని కోసం ఎంతప్రయత్నించినా జాడ దొరకలేదు. అలా తిరుగుతున్న వారికి ఒక గణేశ భక్తుడు కలిసి, వారికి గణేశ మంత్రాన్ని ఉపదేశించాడు. దానిని వారు శ్రద్ధా నియమాలతో జపించడంతో వారికి గణపతి బ్రాహ్మణ బాలుని రూపంలో సాక్షాత్కరించి క్రమంగా గజాననుడిగా మారి వారితో, "మీ తపస్సుకి చాలా సంతోషించాను. మీకు వరాలివ్వాలని ఉంది. కానీ నేనే వరాలిస్తే నా మహా భక్తుణ్ణి కించపరచినట్లు అవుతుంది. నేను మీకు ఇవ్వాలనుకున్న వరాలు మీకు అతడిస్తాడు. అతడు నా భక్తులలో అగ్రగణ్యుడు. అతని పేరు ముద్గల మహర్షి." అని చెప్పి అంతర్ధానమయ్యాడు.
ముద్గలుని జాడ ఒక మహర్షి వలన తెలుసుకుని, ఆ మహాత్ముని దగ్గరకు చేరారు. ఆ సమయంలో ముద్గలుడు గణపతియొక్క సువర్ణ ప్రతిమను పూజిస్తూ కనిపించాడు. దక్షుడిని చూడగానే ముద్గలుడు ప్రసన్నుడై దక్షుని ఆలింగనం చేసుకున్నాడు. తరువాత తనకు, గణేశునికి అభిన్నమని చెప్పి గణేశ రూపంతో సాక్షాత్కరించాడు కూడా. పిదప దక్షుణకు ఏకాక్షర మంత్రాన్ని ఉపదేశించి దానిని నియమనిష్ఠలతో సాధన చేయమని, దానివలన దక్షునకు ఇహ పర సౌఖ్యాలు కలుగుతాయని చెప్పాడు. ఆ ఏకాక్షర మంత్రాన్ని దక్షుడు నియమ నిష్ఠలతో పుష్కరకాలం అనుష్ఠించాడు.


అదే సమయంలో కౌండిన్య పురమును పాలిస్తున్న చంద్రసేనమహారాజు కాలధర్మం చెందాడు. అతనకి సంతానం లేకపోవడం వల్ల రాజుగా ఎవరిని పట్టాభిషేకం చేయాలా అని అలోచిస్తున్న సమయంలో శ్రీ ముద్గలమహర్షి వచ్చి, ఆ రాజ్యం యొక్క పట్టపుటేనుగుకు రత్నాల మాలను ఇచ్చి, ఆ మాలను ఎవరి మెడలో వేస్తే వారే రాజుగా అర్హులు అని చెప్పగా, వారు ఆ విధంగానే చేసారు. పిమ్మట ఆ ఏనుగు ఆ ఊరును దాటి, గణేశ అర్చనలో ఉన్న దక్షుని మెడలో ఆ హారాన్ని వేసింది. దానితో మంత్రులు దక్షుని సకల రాజమర్యాదలతో రాజ్యానికి తీసుకువచ్చేరు. దక్షుడు శ్రీ ముద్గలమహర్షిని దర్శించుకుని, ఇది అంతా వారి కరుణయే అని చెప్పి, వారి ఆశీస్సులతో రాజుగా పట్టాభిషిక్తుడై ధర్మబద్ధంగా రాజ్యాన్ని పాలించసాగాడు. దక్షుడు కుండిన నగరంలో ఒక జీర్ణ దేవాలయాన్ని ఉద్ధరించి, వరద గణపతిని అందు ప్రతిష్ఠించాడు. ఆ నాటినుండి గజాననుడు వారి కులదైవమైనాడు. వల్లభుడు అనే రాజుకు గణపతి కలలో కనిపించి తన కుమార్తె వీరసేనను దక్షునకు ఇచ్చి వివాహం జరిపించమని చెప్పాడు. గణేశుని ఆదేశ ప్రకారం వీరసేనకు, దక్షునకు వివాహం అయింది. వారికి బృహద్భానుడను కుమారుడు కలిగాడు. బృహద్భానునికి ఖడ్గధరుడు, అతనికి సులభుడు, సులభునకు పద్మాకరుడు, పద్మాకరుడికి వపుర్దీప్తి, వపుర్దీప్తికి చిత్రసేనుడు, చిత్రసేనుడికి భీముడు కలిగాడు.

ఇలా విశ్వామిత్ర మహర్షి భీమరాజు వంశావళిని తెలియజేసాడు. దానితో భీమరాజు తనకు ఆ గణపతి ఎలా ప్రస్సన్నుడౌతాడు: ఎలా సాక్షాత్కరిస్తాడు?" అని ప్రార్థించాడు. దానికి విశ్వామిత్రుడు భీమునికి గణపతి ఏకాక్షర మంత్రాని ఉపదేశించి దక్షుడు ప్రతిష్ఠించిన గణపతి దేవాలయంలో అనుష్ఠించమని చెప్పాడు. భీముడు ఉపవాస నియమంతో మంత్రజపం చేస్తూ కూర్చున్నా, నిలబడినా, భోజనం చేస్తున్నా, శయనిస్తున్నా ఆ గజాస్యునే స్మరిస్తూ ధ్యానిస్తూ కాలం గడుపుతూ వచ్చాడు. నీటియందైనా, భూమియందైనా, ఆకాశమందైనా..ఎక్కడైనా ఆ గణేశుని స్వరూపమునే దర్శిస్తూ వచ్చాడు. భీముని అనన్యభక్తికి మెచ్చి గజాననుడు ప్రత్యక్షమై వరము కోరుకోమనగా గణేశునిపై నిశ్చల భక్తిని కోరాడు. గజాననుడు ఆ వరాన్ని అనుగ్రహించడమే కాక, వారికి ఒక గొప్ప పుత్రుడు పుడతాడని ఆశీర్వదించాడు. దానితో వారికి అందమైన పుత్రుడు ఉదయించాడు. వానికి "రుక్మాంగదుడు" అని నామకరణం చేసాడు. రుక్మాంగదుడు కూడా గణేశ ఏకాక్షర మంత్రాన్ని క్రమంతప్పకుండా అనుష్ఠిస్తూ సకల విద్యా పారంగతుడయ్యాడు.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Forwaded By Balakoteswara Rao 

No comments:

Post a Comment