Friday, May 31, 2019

By VEERAMALLAYYA ఏ నిమిషానికి ఏమి జరుగుతుందో మనకు తెలియదు. ధర్మకార్యాలను వాయిదా వెయ్యకుండా, తొందరగా చేయాలి. పనుల ఒత్తిడి పెరిగి, ప్రాధాన్యాలు వెర్రితలలు వేస్తున్న ఈ రోజుల్లో అందరికీ హితవు చెపుతున్నది ఈ శ్లోకం.

శ్లో. శతం విహాయ భోక్తవ్యం
సహస్రం స్నానమాచరేత్l
లక్షం విహాయ దాతవ్యం
కోటిం త్యక్త్వా హరిం భజేత్ll

...ఆర్యధర్మ.

వంద పనులు మాని సమయానికి భోజనం చేయాలి. వేయి పనులున్నా(పొద్దున్నే) స్నానం చేయాలి. లక్ష ఖర్చులున్నప్పటికీ దానధర్మాలకు ధనం కేటాయించాలి. కోటి పనులున్నా దేవుడికి దండం పెట్టేందుకు సమయాన్ని కేటాయించాలి.

*** *** ***

ఏ వృత్తి వారైనా, తలమునకలయ్యే పని ఉంటే అశ్రద్ధ చేసేది భోజనాన్నే. సమయం లేదని ఆకలి చంపుకోవద్దు. ఆకలి కడుపుతో చేస్తున్న పనిపై శ్రద్ధ, ఏకాగ్రత తగ్గుతుంది. సమయానికి అన్నం తినకుంటే అనారోగ్య హేతువు కాగలదు. అందువల్ల వందపనులున్నా, సమయానికి అన్నం తినాలి. తినటానికి నోచుకోని సంపద ఎందుకు? వేయి పనులున్నా శారీరక శుచిత్వం కొరకు స్నానమాచరించాలి. ఈ విధమైన శుచిత్వం చేస్తున్న పనిపై ఏకాగ్రతను పెంచగలదు. ఈ జన్మలో మనం కడుపునిండా తింటున్నామంటే పూర్వజన్మ సుకృతమే కదా! చేసిన పుణ్యకర్మలే కదా. అందువల్లే లక్ష ఖర్చులున్నా దానానికి కొంత సమయాన్ని, ధనాన్ని పక్కన పెట్టాలి. దైవానికి కృతజ్ఞత తెలపటం మన నిత్యకృత్యం కావాలి.కోటిపనులున్నా ఈ కార్యక్రమాన్ని వాయిదా వేయకూడదు. దైవస్మరణ మన రోజువారీ కార్యక్రమాల్లో ఒక భాగమై పోవాలి.

No comments:

Post a Comment