Wednesday, May 8, 2019

శంకర జయంతి 9/5/2019

శంకర భగవత్పాదులు జీవిత చరిత్ర చూస్తే ఆయన మానవపుతృుడే, కానీ అలాంటి మానవుడు, ధీశాలి మరొకరు ఈ చరిత్రలోనే మళ్లీ పుట్టలేదు అని తెలుస్తుంది ! ఆయన ఒక అవతార పురుషుడు, సాక్షాత్తూ శివస్వరూపం !!!!!!!

శ్రీ శంకరులు కేరళలో కాలడి అనే గ్రామము లో నంబూద్రి బ్రాహ్మణ కుటుంబము లో శివగురువు,ఆర్యామ్బ దంపతులకు జన్మించారు. చిన్నతనంలోనే ఆయన తండ్రి మరణించగా, తల్లి ఆ బాలుడుకి ఐదో ఏట ఉపనయనం చేయించింది . ఆ తరువాత శంకరులు గోకర్ణ క్షేత్రానికి వెళ్ళి, మూడు సంవత్సరాలు సాంగోపాంగంగా వేదాలు నేర్చుకున్నారు. ఆయన ఏకసంథాగ్రాహి. ఆ చిన్న వయసులోనే అందరూ ఆ బాల శంకరుల ప్రతిభ చూసి, ఆయనని భగవంతుని అవతారమని భావించేవారు.
ఒకనాడు ఆయన ఒక ఇంటికి భిక్షకు వెళ్ళగా, ఆ ఇంటి పేద బ్రాహ్మణి ఇంట్లో ఏమీ లేక ,ఒక ఎండిపోయిన ఉసిరి తీస్కుని వచ్చి,బాధతో సిగ్గుపడుతూ ఆ ఉసిరిని భిక్ష గా వేసింది. ఆమె దారిద్ర్యం, ధర్మబద్ధతతో హృదయం కరిగి , శ్రీ శంకరులు ఆశువుగా "కనకధారాస్తవము" అనే మహోత్తరమైన స్తోత్రాన్ని కల్పించి ఆ అమ్మవారిని స్తుతించారు. వెంటనే ఆ పేద బ్రాహ్మణి ఇంట, బంగారు ఉసిరికల వర్షం కురిసింది! అదే శంకరులు చేసిన మొట్టమొదటి స్తోత్రం..కనకధారా స్తోత్రం !
ఎనిమిదవ ఏటనే వేదాలలో పాండిత్యాన్ని సంపాదించి, పన్నెండవ ఏటికి సర్వ శాస్త్రాలను మధించి,పదహారో ఏటికి భాష్యాన్ని రాసి, ముప్పైరెండవ ఏటికి శరీరాన్ని విడిచిపెట్టేసారు.
ఆసేతు హిమాచలం భారతదేశము అంతా మత సంక్షోభములో ఉండగా అవతరించిన శివ స్వరూపము శంకరులు!
ఆయన ఒక వ్యక్తి కాదు ! ఒక వ్యవస్థ . అద్వైత తత్వాన్ని ప్రభోదించి ఈ దేశపుటెల్లలు దాటి అవతలకి పోయేట్టు నాస్తిక వాదులను తరిమి కొట్టారు..

ఈ ఆధునిక వాహనాలు, రోడ్లు ఏమీ లేని రోజుల్లో కాశ్మీరం నుండి కన్యాకుమారి దాకా పర్యటించి ఈ జాతి జీవన విధానాన్ని మార్చిన మహనీయులు..మనపై కరుణతో ఆ శివుడు స్వయముగా దిగివచ్చిన అవతారం...శంకర భగవత్పాదులు!

ఇలాంటి పవిత్రమైన రోజున మనము అందరమూ ఆయన నామస్మరణ చేసుకుంటూ, ఆయన మనకి అందించిన అపూరూపమైన ఆస్తులు... శబ్ద సౌందర్యముతో కూడిన స్తోత్రాలు... పఠిస్తూ...హర హర శంకర జయ శంకర !

No comments:

Post a Comment