08/08/17, 8:08:18 AM: +91 80088 84529: సీతాపహరణం – స్వరాపహరణం (పార్ట్ 1)
చాలా
సంవత్సరాల క్రితం ఒక సాయింత్రం మహాస్వామి వారి దర్శనార్థమై చలామంది
భక్తులు వేచిఉన్నారు. పరమాచార్య స్వామి వారు గదినుండి బయటకు వచ్చి భక్తుల
వంక ఒకసారి చూసి, గోడకు ఆనుకుని కూర్చున్నారు. భక్తులందరూ వరుసలో
ఒక్కొక్కరుగా వచ్చి, మహాస్వామి వారికి సాష్టాంగం చేసి, వారి కష్టాలను
చెప్పుకొని, స్వామి వారు చెప్పిన మాటలు విని ముందుకెళ్తున్నారు. ఒక
మధ్యవయస్కుడైన పెద్దమనిషి ఒకరు ఒక పిల్లవాడి చెయ్యి గట్టిగా పట్టుకుని
వరుసలో నిలబడి ఉన్నారు. అతని కళ్ళల్లో నుండి నీరు కారి ఏరులై పారుతోంది. ఆ
పిల్లవాడు ఏ చలనము లేక నిలబడ్డాడు.
అతను
పరమాచార్య స్వామివారి ముందుకు రాగానే సాష్టాంగం చేసి చేతులు జోడించి
నిలబడ్డాడు. ఆ పిల్లవాడు కూడా సాష్టాంగం చేసి నుంచున్నాడు. స్వామి వారు
అతన్ని పరిశీలనగా చూసి, “ఏమప్పా నువ్వు మైలాపూర్ ఆడిటర్ శంకర నారాయణన్ కదూ?
ఎందుకు అంతలా ఏడుస్తున్నావు? ఏమిటి నీ సమస్య?” అని అడిగారు.
పరమాచార్య
స్వామి వారు అలా అనగానే అతని దుఃఖం కట్టలు తెంచుకుంది. మరలా ఏడుస్తూ,
“అవును పెరియవా! భరింపరాని కష్టం వచ్చిపడింది నాకు. ఏమిచేయాలో తెలియటం
లేదు. మీరే నా దేవుడు. మీరే ఎలాగో నన్ను కాపాడాలి. నాకు వేరొక దిక్కు లేదు”
అని మరలా సాష్టాంగం చేసాడు.
పరిస్థితిని
అర్థం చేసుకుని పరమాచార్య స్వామి వారు వాత్సల్యంతో “అరే శంకరా బాధపడకు.
కొద్దిసేపు అక్కడ కూర్చో. అందరూ మాట్లాడి వెళ్ళిపోయిన తరువాత నిన్ను
పిలుస్తాను” అని చెప్పి ఒక స్థలం చూపించారు. ”అలాగే చేస్తాను పెరియవా. మీ
ఆజ్ఞ” అని ఆయన స్వామి ఎదురుగా కొద్దిదూరంలో కూర్చున్నారు.
అరగంట
తరువాత అందరూ భక్తులందరూ స్వామివారిని దర్శించుకుని వెళ్ళిపోయారు. స్వామి
వారి ఇద్దరు సహాయకులు తప్ప ఎవరూ లేరు. ఆడిటర్ శంకర నారాయణన్ ను రమ్మన్నట్టు
సైగ చేసారు. అతను వచ్చి మరలా సాష్టాంగం చేసి నిలబడ్డాడు. మహాస్వామి వారు
అతని వంక ఆప్యాయంగా చూస్తూ, “శంకరా! నీ ప్రాక్టీసు బాగా జరుగుతోంది కదా?
నువ్వు బాగా పేరుగాంచిన ఆడిటరువి. ప్రాక్టిసు గురించి అడగనవసరం లేదులే. సరే
మీ తండ్రి గారు పంచపకేశ అయ్యర్ తంజావూరులో ఉన్నారు కదూ? బావున్నారు కదా?”
కన్నీళ్ళు
తుడుచుకుంటూ ఆడిటర్ స్వామి వారితో “ప్రాక్టిసు బాగా జరుగుతోంది పెరియవా.
మా తల్లితండ్రులు బొంబాయిలో ఉన్న నా తమ్ముణ్ణి చూడ్డానికి వెళ్ళారు. రెండు
నెలలు అయ్యింది. నాకే ఇప్పుడు కష్టం వచ్చింది. దీన్ని భరించడం నా వల్ల
కావట్లేదు. మహాస్వామి వారే నన్ను కాపాడాలి” అని దగ్గరున్న ఆ పిల్లవాణ్ణి
కౌగిలించుకుని ఏడ్చేసాడు.
ఆ
పిల్లవాని విశయంలోనే ఏదో జరిగి ఉంటుందని మహాస్వామి వారు అర్థం
చేసుకున్నారు. మహాస్వామి వారు అతనితో “శంకరా ఏదేమైనా సరే మగవారు ఇలా
ఏడువరాదు. సరే ఎవరు ఈ పిల్లవాడు నీ కుమారుడా?” అని అడిగారు.
”అవును
పెరియవా నా కుమారుడే. పేరు చంద్రమౌళి. వీడికోసమే పెరియవా నా బాధ.
హఠాత్తుగా. . . ” దుఃఖం తన్నుకొస్తుండడంతో ఇంక ఏమి మాట్లాడలేక పోయాడు.
మహస్వామి
వారు కంగారుగా “శంకరా ఏమి జరిగింది హఠాత్తుగా? చంద్రమౌళి పాఠశాలకు
వెళ్తున్నాడా?” అని అడిగి “ఖంగారు పడకుండా ఏమి జరిగిందో సరిగ్గా చెప్పు”
అని అన్నారు.
కళ్ళ నీరు
తుడుచుకొని, కొద్దిగా స్థిమితపడుతూ, “పెరియవా నా కుమారుడు చంద్రమౌళి
మైలాపూర్ లోని పి.యస్.హైస్కూల్ లో ఏడో తరగతి చదువుతున్నాడు. చదువులో చాలా
చురుగ్గా ఉంటూ, తరగతిలో ఉత్తమ విద్యార్థిగా ఉన్నాడు. ఇరవై రోజుల క్రితం
హఠాత్తుగా తన మాట పడిపోయింది పెరియవ. అడిగితే తను మాట్లాడలేక పోతున్నానని
సైగల ద్వారా చెప్తున్నాడు. ఆరోజు నుండి పాఠశాలకు వెళ్ళలేదు. రెండుపూటలా
భోజనం చేస్తాడు. చక్కగా నిద్రపోతాడు. అవన్ని బావున్నాయి పెరియవ కాని
మాట్లాడలేకపోతున్నాడు. నేనేంచేయగలను? మీరే కరుణించి వీడికి మాటలు
ప్రసాదించాలి” కళ్ళ నీరు కారుతుండగా స్వామివారిని ప్రార్థించాడు.
పరమాచార్య
స్వామి వారు కొద్దిసేపు మౌనంగా ఉన్నారు. తరువాత ఆడిటరుతో “పిల్లలతో
దేవాలయానికి వెళ్తంటావా? చంద్రమౌళికి దేవునిపై భక్తి నమ్మకం ఉన్నాయా?” అని
అడిగారు.
”వీడికి చాలా
భక్తి పెరియవ. ప్రతిరోజు స్నానం చేసిన తరువాత కందషష్టి కవచం, రాముడు
ఆంజనేయుడి గురించి కొన్ని శ్లోకాలు చదువుకొని పాఠశాలకు వెళ్తాడు. మా ఇంట్లో
కోదందరాముని పెద్ద చిత్రపటం ఉంది. అది మా తాతల కాలంనాటి తంజావూరు
చిత్రపటం. రోజూ ఉదయం సాయింత్ర సాష్టాంగం చేసి, సీతారాముల పాదములకు నమస్కారం
చేసి కళ్లకద్దుకుంటాడు. ‘నాకు సీతారాములంటే చలా ఇష్టం అని తరచూ
చెప్తుంటాడు’. వారంలో రెండుమూడు రోజులు వాడి తల్లితో కలిసి కపాలీశ్వర,
ముందక కన్ని అమ్మణ్, లుజ్ ఆంజనేయ స్వామి దేవాలయాలకు వెళ్తుంటాడు. ఇంత మంచి
పిల్లాడికి ఇలా జరిగింది” అని ఇక తట్టుకోలేక గట్టిగా ఏడ్చేసాడు.
మహాస్వామి వారు అతన్ని సమాధానపర్చి మృదువచనాలతో “అతణ్ణి మైలాపూర్ లో జరిగే ప్రవచనాలకు తీసుకువెళ్తుంటావా?” అని అడిగారు.
”వెళ్తుంటాడు
పెరియవ. అప్పుడప్పుడు నేనే స్వయంగా తీసుకుని వెళ్తుంటాను. వీడి మాట పడిపోక
ముందురోజు కూడా నేను వీణ్ణి రసిక రంజన సభలో జరిగే రామాయణ ప్రవచనానికి
తీసుకుని వెళ్ళాను. ఆసాంతం చాలా శ్రద్ధగా విన్నాడు. తరువాతి రోజే ఇలా
జరిగింది” అని చెప్పాడు.
స్వామివారు నవ్వుతూ “అంటే నీ ఉద్దేశం రామాయణం వినడంవల్లనే ఇలా జరిగిందనా?”
ఆడిటర్ లెంపలేసుకుంటూ “రామ రామ! అలా కాదు పెరియవ. ఆ తరువాతి రోజే ఇలా జరిగింది అని చెప్తున్నాను పెరియవ” అని అన్నాడు.
”సరే. ఉపన్యాసం ఎవరు చెప్పారు?”
“శ్రీవత్స జయరామ శర్మ, పెరియవ”
“భేష్ భేష్ సోమదేవ శర్మ కుమారుడు. గొప్ప పండిత వంశం. సరేకాని శంకరా
ఇతణ్ణి వైద్యునికి చూపించావా?”
“చూపించాను పెరియవ”
“ఎవరా వైద్యుడు?”
“డాక్టర్ సంజీవి”
“ఏమన్నాడు?”
“అన్ని పరీక్షలు చేసి, ఇతని స్వరపేటిక నరములు రెండు దెబ్బతిన్నాయి. ఆపరేషన్ చేస్తే సరిపోవచ్చు అని చెప్పాడు పెరియవ”
“ఆపరేషన్ తరువాత ఖచ్చితంగా బాగవుతుందని చెప్పలేదా?”
“అతను ఆ హామీ ఇవ్వలేదు పెరియవ. ఎలాగో మీరే వాడికి మాటలు వచ్చేలా చెయ్యలి. కేవలం మీరే చెయ్యగలరు”
పరమాచార్య
స్వామి వారు కొద్దిసేపు మౌనంగా ఉండి ఇలా చెప్పారు “శంకరా ఒక పనిచెయ్యి,
పిల్లాణ్ణి తీసుకుని ఇక్కడి దేవాలయాలన్నీ దర్శించి ప్రార్థించు. ఇక్కడే
మఠంలో భోజనం చేసి రాత్రికి ఇక్కడే ఉండు. రేపు ఉదయం నీ స్నానము అనుష్టానము
పూర్తి చేసుకొని పది గంటలకు నా వద్దకు రా”.
(సశేషం)
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
No comments:
Post a Comment