Tuesday, November 19, 2019

భస్మధారణ వైదిక సంస్కృతి. శైవమతాలన్నీ వేదం నుండి స్వీకరించిన సంప్రదాయమిది. శైవ, వైష్ణవాది శాఖలకు చెందని స్మార్తశ్రౌత ధర్మానుయాయులందరూ భస్మధారణ  చేయడం గమనించదగిన అంశం. అగ్నిహోత్ర విధులలో  యఙ్ఞ ప్రసాదంగా భస్మాన్ని ధరించుతారు.
యఙ్ఞ స్వరూపం శివునిగా దర్శించిన శాస్త్రాలు భస్మధారణను పేర్కొన్నాయి.
కర్మకాండలో యఙ్ఞస్వరూపంగా పేర్కొనబడినదే, ఙ్ఞానకాండలో ఙ్ఞానాగ్నికి సంకేతంగా చెప్పబడుతోంది.
“అగ్నిసారం భస్మం”, “అగ్నినా రయిమశ్నవత్” – అని వేదోక్తి. ఐశ్వర్యకరమైనది అగ్ని. ఆ అగ్నిస్వరూపాన్ని సోమరూపమైన జలంతో కలిపి ధరించడం విధి. ‘అగ్నిషోమాత్మకం జగత్’ అన్నవిధంగా, శివ – శక్త్యాత్మకమైన అగ్నిషోమతత్త్వానుసంధానమే జలంతో కలిపి భస్మాన్ని ధరించడంలోని ఆంతర్యం.
“భాసనాత్ భసితం ప్రోక్తం భస్మ కిల్బిష భక్షణాత్” అని శివపురాణ వాక్యం.
“భర్త్యనాత్ సర్వపాపానాం భాసనం తస్య విద్యయా” అని సూత సంహిత. భాసనము చేత భస్మం. అనగా ‘ప్రకాశ స్వరూపం’, ఙ్ఞాన ప్రకాశం చేతనే కర్మలో దహింపబడుతాయి. సర్వపాపాలను నశింపజేసి, ఙ్ఞానదీప్తిని అందించేది భస్మం.
అగ్ని సారమైన భస్మం ఐశ్వర్య స్వరూపం కనుకనే ‘విభూతి’ అని నామాంతరం. ‘భూతిర్విభూతిరైశ్వర్యం’ అని నిఘంటువు. ఐశ్వర్య వాచకమైన ‘విభూతి’ నామంతోనే భస్మాన్ని వ్యవహరించడం దాని మహత్తును వ్యక్తపరుస్తున్నది.
మహాభస్మ మహాదేవో మహామాయావభాసకః (సూతసంహిత). మాయాశక్తి నుండి కలిగిన జగత్తునకు సత్తాస్ఫూర్తులను అనుగ్రహించిన మహాదేవుడే ‘ప్రకాశకుడు’ కనుక ఆ పరమాత్మకే ‘మహాభస్మ’ అని పేరు. భస్మానికి, భర్తునికీ అభేదభావం. భస్మం శివస్వరూపం.
ఙ్ఞానాగ్ని స్సర్వకర్మాణి భస్మసాత్కరుతేకిల!
తేన్యై భస్మనాగాత్ర ముద్ధూళయతి ధూర్జటిః!! (బోధసారం)
ఙ్ఞానాగ్ని యందు సర్వకర్మ బంధములు నశిస్తున్నాయి. నిష్క్రియమైన బ్రహ్మతత్త్వం ప్రాప్తమైనప్పుడు మాయా సంబంధమైన కర్మలు – మరి జన్మలను కలిగించడంలో సమర్థములు కావు – భస్మమయిన విత్తనాలు మరి మొలకెత్తని విధంగా.
ఙ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహుః పండితం బుధాః (భగవద్గీత) – ఙ్ఞానాగ్నియందు కర్మలు దహనమైన స్థితిని పొందిన వాడే పండితుడని బుధులు చెప్తున్నారు.
భిన్నత్వములన్నీ భస్మస్థితిలో ఏకత్వాన్ని పొందుతున్నాయి. ఆ ఏకత్వ స్థితియే బ్రాహ్మీ స్థితికి సంకేతంగా భాసిస్తోంది. జగద్బీజ నాశకుడైన (కర్మల నుండి ముక్తినిచ్చే) ఙ్ఞానమూర్తియైన శివునకు ప్రియమై ప్రకాశిస్తోంది.
భాసతే భిన్న భావానామపి భేదోనభస్మని!
స్వస్వభావ స్వభావేన భస్మ భర్గస్య వల్లభమ్!!(బోధసారం)
మంత్రసహితంగానూ, మంత్రరహితంగానూ భస్మాన్ని ధరించవచ్చు.
ఉద్ధూలనం త్రిపుండ్రంచ ఙ్ఞానాంగత్వేన సాదరమ్
ఆ మనంతి ముని శ్రేష్ఠాః శ్వేతాశ్వతర శాఖ్యిః (సూతసంహిత)
భస్మం ఙ్ఞానవైరాగ్యాలకు చిహ్నం. అందుకే భస్మ త్రిపుండ్రధారణ, ఉద్ధూళనం ఙ్ఞానానికి సహకరిస్తుందని శ్వేతాశ్వతరోపనిషత్తు సాదరంగా విధిస్తున్నది.
భస్మములో అగ్ని, నీరు, పృథివి, అనే మూడు ప్రత్యక్ష భూతముల మేళనం ఉంది. ఇది ఉపనిషత్తులు చెప్పిన ‘తేజోబన్న” మూలను (తేజస్సు, ఆపస్సు(జలం), అన్నం) తెలియజేస్తున్నదని భావించవచ్చు.
సూతసంహిత ప్రకారంగా అడ్డముగా మూడు రేఖలతో భస్మధారన చేయాలి.
భస్మోద్ధూళనం చైవ తథా తిర్యక్ త్రిపుండ్రమ్!
౧. మహాపాప వినాశాయ విధత్తే వైదికీశ్రుతిః!!
౨. రక్షార్థం సర్వజంతూనాం విధత్తే వైదికీ శ్రుతిః!!
౩. మంగళార్థం చ సర్వేషాం...
౪. పవిత్రార్థం చ సర్వేషాం...
౫. స్నానత్వేనైవ సర్వేషాం...
౬. వ్రతత్వేనైవ సర్వేషాం
౭. తపస్త్వేనైవ సర్వేషాం...
౮. యఙ్ఞత్వేనైవ సర్వేషాం...
ఇలా ఎనిమిది ప్రయోజనాలు చెప్పారు.
౧. మహాపాపనాశనం ౨. సర్వజంతువులకు రక్ష, ౩. మంగళములు కలిగించునది, ౪. పవిత్రతను ఇచ్చునది, ౫. జలస్నానం చేసినప్పటికీ, భస్మధారణ చేతనే పూర్తి శుద్ధి అవుతుంది, ౬. వ్రతనియమాలకు అర్హతనిస్తుంది, ౭. తపస్వులకు తపోనియమాలలో భస్మధారణ ముఖ్యం, ఫలదాయకం, ౮. యఙ్ఞములకు కూడా భస్మధారణ అర్హతనీ, శక్తినీ ప్రసాదిస్తుంది.
అగ్నిరితిభస్మ! వాయురితిభస్మ! జలమితి భస్మ! స్థలమితి భస్మ! వ్యోమేతి భస్మ! సర్వం హవా ఇదం భస్మ! మన ఏతాని చక్షూంషి భస్మాని!! – అనే మంత్రంతో భస్మాన్ని ధరించాలని, ‘భస్మజాబాలోపనిషత్తు” చెబుతున్నది. సద్యోజాతాది మంత్రాలతో, మృత్యుంజయ మంత్రంతో కూడా భస్మధారణ చేయవచ్చని శాస్త్రోక్తి.
లలాటే చైవ దోర్ద్రంద్వే తథైవోరసి బుద్ధిమాన్!
త్రిపుండ్రం ధారయేన్నిత్యం భుక్తిముక్తి ఫలప్రదం!!(సూతసంహిత)
వివేకవంతుడు నుదుటిపై, రెండు భుజాలపై, వక్షస్థలంపై త్రిపుండ్రాన్ని ధరించాలి. దాని ఫలితంగా ఇహలోకంలో సుఖ సౌభాగ్యాలను పొందడమే కాక, క్రమంగా మోక్షాన్ని కూడా పొందగలరు.
ఇహభుక్త్వాభిలాన్ భోగాన్ దీర్ఘాయుర్వ్యాధి వర్జితః
జీవితాంతేచ మరణం సుఖేనైవ ప్రపద్యతే!!
భస్మాన్ని త్రిపుండ్రంగా నిత్యం ధరించువారు ఇహలోకంలో దీర్ఘాయుర్దాయం కలిగి, వ్యాధిరహితులై భోగాలననుభవించి జీవితాంతంలో అనాయాసంగా తనువు చాలించుతారు. పరమపదాన్ని పొందుతారు(శివపురాణం)
జలస్నానం శుభ్రతను ఇస్తుంది. భస్మస్నానం ‘శుచి’ని (సూక్ష్మశరీర శుద్ధి)ఇస్తుంది.
జలస్నానం మలత్యాగే భస్మస్నానం సదా శుచిః!!
త్రిపుండ్ర ధారణ చేయకుండా ఆచరించిన కర్మలు వ్యర్థములవుతాయని శాస్త్రోక్తి.
మధ్యమానామికాంగుల్యా మధ్యేతు ప్రతిలోమతః!
అంగుష్ఠేన కృతారేఖా త్రిపుండా ఖ్వాభిధీయతే!!
మధ్యేంగులిభిరాదాయ తిసృ భిర్భస్మ యత్నతః!
త్రిపుండ్రం ధారయేద్భక్త్యా భుక్తిముక్తిప్రదం పరమ్!!
మధ్యవేలు, అనామికతో భస్మాన్ని (ఎడమనుండి కుడి)ధరించి, ఆ రేఖల మధ్య బొటనవేలితో విలోమంగా (కుడి నుండి ఎడమ) ధరించితే త్రిపుండ్రమని పేరు. మూడు వేళ్ళతో భస్మత్రిపుండ్ర రూపంగా ధరించవచ్చు.
భస్మ త్రిపుండ్రంలో ప్రతి రేఖకీ ప్రత్యేకంగా అధిష్ఠాన దేవతలుంటారు.
ప్రథమ రేఖకుః ‘అ’కారం (ఓంకారంలోని మొదటి అక్షరం), గార్హపత్యాగ్ని, భూమి, ధర్మం, రజోగుణం, ఋగ్వేదం, క్రియాశక్తి, ప్రాతస్సవనం, మహాదేవుడు – దేవతలు.
ద్వితీయ రేఖకుః ‘ఉ’కారం(ఓంకారంలోని రెండవ అక్షరం). దక్షిణాగ్ని, ఆకాశతత్త్వం, యజుర్వేదం, మాధ్యందిన సవనం, ఇచ్ఛాశక్తి, అంతరాత్మ, మహేశ్వరుడు – దేవతలు.
తృతీయ రేఖకుః ‘మ’కారం(ఓంకారంలోని మూడవ అక్షరం). ఆహవనీయాగ్ని, పరమాత్మ, తమోగుణం, ద్యులోకం, ఙ్ఞానశక్తి, సామవేదం, తృతీయ సవనం, శివుడు – దేవతలు.
ఇలా ఒక్కొక్క రేఖకు తొమ్మిది చొప్పున మూడు రేఖలకు 27దేవతా శక్తులు దేవతలు.
భస్మంతో శివుని ఆరాధించితే సర్వశ్రేష్ఠం. శివనామంతో, మంత్రంతో అభిమంత్రించిన భస్మం ధరించడం అద్భుత ఫలదాయకం.
ఈశ్యాతే తత్పురుష నమో ఘోరాయతే సదా!
వామదేవ నమస్తుభ్యం సద్యోజాతాయ వై నమః!!
‘శ్రీ శివాయ నమః’ – అనే మంత్రంతో కూడా భస్మాన్ని దాల్చవచ్చు.
స్త్రీలు భస్మాన్ని నుదుటిపై ముంగురులు పడే భాగం వరకు మాత్రమే ధరించాలి. పురుషులు కనుబొమలను దాటనివ్వరాదు.
భస్మధారణ చేసి రుద్రాక్షను ధరించి శివనామాన్ని స్మరించేవాడు త్రివేణీ సంగమంవలె పవిత్రమైన వాడు. ఆతడి దర్శనం, స్పర్శనం పవిత్రుల్ని చేస్తుంది.
థిక్ భస్మరహితం ఫాలం థిక్ గ్రామం శివాలయం!
దిగనీశార్చనం జన్మ దిగ్విద్యామ శివాశ్రయామ్!!(శివపురాణం)
భస్మం లేని నుదురు వ్యర్థం. అదేవిధంగా శివాలయం లేని ఊరు, ఈశ్వరార్చన చేయని జన్మ, శివుని ఆశ్రయించని(బోధించని) చదువు వ్యర్థం.Forwarded by Jaganmohan I vaturi

No comments:

Post a Comment