Sunday, April 12, 2020

జీవుడు జననమరణ పరంపరలో  తిరగడం-మృత్యుబంధనంలో చిక్కుకోవడమే. అమృత స్వరూపుడైన “శివుని” ఉపాసించినవారు, ఈ మృత్యుబంధనo నుండి విడివిడి  శాశ్వత “కైవల్య సిద్ది” ని పొందుతారు.—“మృత్యుంజయుడు”.
“శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం”---శరీరమున్నప్పుడే “తపోధర్మాదులు”కు అవకాశం ఉంటుంది.
కైవల్యసిద్ధికి భగవంతుడిచ్చిన వరం ఈ శరీరం, ఆయువు.”దీర్ఘాయువు” ఉన్నప్పుడే –గత జన్మల ‘సంచిత’, ‘ప్రారబ్ద’,పాపకర్మల్ని ఇప్పటి సత్కర్మల ద్వారా క్షయం చేసుకొని , దివ్యమైన నియమాల, సాధనాల ద్వారా జ్ఞానము సంపాదించి, ఇహంలోనే “ముక్తావస్థ”ను పొందగలం.
ఆయువునకు విఘాతం కలిగించకుండా, అకాల మృత్యువు వాతపడకుండా కాపాడేది ఆ “త్ర్యయంబకుడే”(త్రినేత్రుడే). త్రికాలదర్శి యైన సర్వజ్ఞుడు “సదాశివుడు”.
మృత్యుంజయ నామంతో ఉన్న “సదాశివమూర్తి”ని “శివపురాణం”ఇలా వివరిస్తోంది.
“హస్తాంభోజయుగస్థకుంభయుగళాదుద్ద్రుత తోయం శిర:!
సించింతం కరయోర్యుగేన దధతం స్వాంకే సకుంభౌ కరౌ:
అక్షస్రజ్ మృగహస్తమంబుజగతం మూర్ధస్థ చంద్రస్రవత్
పీయూప్రార్ధతనుం భజే సగిరిజం త్ర్యక్షం చ మృత్యుంజయమ్!!”
ఎనిమిది చేతులతో ఉన్న “మృత్యుంజయుడు”, ధవళ వర్ణ పద్మంలో, పార్వతీ సమేతుడై ఉన్నాడు.
కుడివైపున ఉన్న పై రెండు చేతులతో ఒక అమృత కలశాన్నీ, ఎడమన రెండు ఊర్ధ్వకరాలతో మరో అమృత కలశాన్నీ ధరించి, తనపై అభిషేకించుకుంటూ, మధ్య ఉన్న కుడి,ఎడమ చేతులలో ఒక దానితో “లేడి”నీ, మరోచేతిలో “అక్ష మాల”నీ మిగిలిన రెండు చేతులతో చెరో “అమృతకలశాన్ని” ధరించి తొడలపై ఉంచుకున్న మూర్తి, అమృతంతో తడిసిన సామి, మూడు కన్నులతో, చంద్రశేఖరునిగా ప్రకాశిస్తూన్నాడు “శివుడు”.
అమృత కలశాల ధారణ, శరీరమంతా అమృతంతో తడసి ఉండటం---““మృత్యుంజయత్త్వము”
చేత ధరించిన లేడి –మనస్సునకు—చంచలమైన మనస్సు “శివాధీనం” కావాలి.
అక్షమాల---విద్యకీ, గణానికీ సంకేతం.
మూడు కన్నులు-సూర్యచంద్రాగ్ని నేత్రాలే కాక, త్రికాలాలు దర్శించే సర్వజ్ఞ శక్తికి ప్రతీకలు.
“చంద్రుడు” ---అమృత కిరణుడు. ఆయనే “శివుని”తలపై పువ్వు==ఇది కూడా “అమృతత్వ సంకేతము”.
“శక్తి”తో ఉన్న సదాశివుడే “ధ్యానయోగ్యుడు”.
ధవళ వర్ణకమలం---వికసించిన శుద్ధ హృదయ పద్మమే—శుద్ధ సాత్త్వికత.
ఇది “మృత్యుంజయమూర్తి” తత్త్వం.
ఈ మూర్తిని ధ్యానించి , మృత్యుంజయుని నామాన్నీ, మంత్రాన్నీ, మననం చేయడం “అమృతత్వ సిద్ది”కి హేతువౌతుంది.
“ఓం! త్రయంబకం యజామహే  సుగంధిం పుష్టివర్ధనమ్!
ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మామృతాత్!!
మూడు కనుల స్వామి (త్ర్యంబకుడు) సుగంధభరితుడు. అనంత కళ్యాణ గుణాలే “సుగంధాలు”. ఆ కళ్యాణ గుణనిధి కనుక “సుగంధి”
పోషకత్వాన్నీ, అయుర్వర్ధనాన్నీ కలిగించి –పండిన దోసపండు తొడిమ నుండి సులభంగా విడినట్లుగా ‘మృత్యు బంధనం’ నుండి ఉపాసకుని విడిపించే “సదాశివుడు”-“మృత్యుంజయుడు”.
“ప్రమాదంవై మృత్యుమహంబ్రవీమి”-ఉపనిషత్తు వాక్యము.
ఏమరుపాటుయే “మృత్యువు”. “ఆత్మ”ను తెలుసుకోలేని అజ్ఞానమే ఏమరుపాటు. ఆ అజాగ్రత్త వలననే ఘోర మృత్యురూపమైన సంసార చక్రంలో తిరుగుట. ఈ అజ్ఞాన నాశనమే “మృత్యుంజయత్వం”
మృత్యులక్షణం కలిగిన జగతితో ముడిపెట్టుకున్న మోహపూర్వక తాదాత్మమే “మృత్యు బంధనం”. అంటే-అమృతస్వరూపుడైన పరమాత్మునితో బంధం. ఆ స్పృహ నుండి మనం విడకుండా, అమృతమైన పరమాత్మునితో తాదాత్మ్యం చెందడమే “మోక్షం”. ఈ అమృత బంధము క్రొత్తది కాదు. ఉన్నదే. అది తెలియక పోవడమే ‘మృత్యుబంధనం’. దీనిని వీడి, అమృతుని బంధం తెంచకుండా ఆయనతో లయించడమే “మృత్యుంజయo”. దానిని సిద్ధింప జేసుకోవాలని--- “మా అమృతాత్” అని పెర్కొన్నదీ మంత్రము.
“మృత్యుంజయ స్తోత్రము”---సర్వాభీష్టాలను కలిగించి, “ఆధివ్యాదులు”ను తొలగించి, ఆయువును రక్షించి, క్రమంగా “బ్రహ్మజ్ఞానము”  కారణమవుతుంది.forwaded By SUBRAHMANYAM M

No comments:

Post a Comment