Tuesday, March 12, 2019

*మైలకాలంలో పూజలు*

సనాతన ధర్మశాస్త్రాలను స్మృతులు అంటారు. వాటిలో ఈ విషయాలన్నీ నిర్ణయించారు. పురుడుని జాతాశౌచం అంటారు. మరణిస్తే మృతాశౌచం అని అంటారు. జాతాశౌచం సమయంలో గృహంలో జరుపుకునే నిత్య పూజలు పదోరోజు వరకు పనికిరావు.

తల్లిదండ్రులు మరణిస్తే మృతాశౌచం తీరిపోయాక ఇంట్లో పూజలు మామూలుగానే చేసుకోవాలి. కొందరు ఏడాది దాక దీపం కూడా పెట్టరాదంటారు. కానీ అది తప్పు. గృహారాధన మైల సమయంలో తప్ప ఎప్పుడూ ఆపకూడదు. మామూలుగా ఆలయాలలో దైవదర్శనం దోషంకాదు. అయితే ఉత్సవాలు నిర్వహించడం, ఆలయాల్లో గోత్రనామాలతో పూజలు చేయించుకోవడం పనికిరాదు.

ఒక వ్యక్తి తన తండ్రితో కలిపి మూడు తరాల దాకా పితృకార్యాలు చేయాలి. తాను ఉన్నంతవరకు చేస్తాడు. ఆ తర్వాత మొదటితరంపోయి ఇతనితో కలిపి మూడుతరాలకు ఇతని కొడుకు చేస్తాడు.

వివాహం, గృహప్రవేశం ఇతర శుభకార్యాల తర్వాత ఆరునెలల దాటాక అదే గృహంలో పితృకార్యాలు చేయవచ్చు. అలాగే కర్మకాండలు జరిగిన గృహంలో వివాహాలు జరగవచ్చు. చనిపోయినవారి కొడుకులకు సంవత్సరం వరకు వివాహం చేయరాదు. కూతుళ్ళకు మాత్రం చనిపోయిన వారికి కన్యాదాన ఫలం దక్కేందుకు గాను అదే సంవత్సరం వీలైతే వివాహం చేస్తారు. బ్రహ్మచారులకు మైలకాలం తీరిపోయాక ఇక ఏ అశౌచం ఉండదు.

అశౌచ సమయాలలో ఏ పారాయణ అయినా బయటకు వినపడకుండా మనసులో చదువుకోవచ్చు. కొత్తవి ప్రారంభించరాదు.

భగవన్నామ స్మరణ అన్ని వేళలా శ్రేయోదాయమైనదే.

*శుభంభూయాత్*

No comments:

Post a Comment