Monday, October 28, 2019

భగినీ  హస్త.
      భోజనం.
--------------------------------------
కార్తీక మాసంలో  శు"" విదియ. నాడు వచ్చే రోజుకు భగినీ హస్త భోజనము  లేక. అన్నా చెల్లెలు  పండుగ అంటారు.  ఇది ఈ సంవత్సరం 29-10-2019 మంగళవారం వచ్చినది.
               కారణం
              .-------------
సూర్య భగవానికి ఒక కుమారుడు  ఒక కుమార్తె.
వారి పేర్లు  "" యమధర్మరాజు & యమున.  యమునకు అన్నగారు అనగా విపరీతమైన. అభిమానం.
అమె అన్నగారు  " యమధర్మరాజు""  గారిని   ఎన్నో సార్లు తన ఇంటికి  భోజనము నకు రమ్మని పిలిచేది. కాని ఆయనకు తీరిక ఉండేది కాదు. యమలోకంలో  పాపులను  శిక్షించే పనిలో రాత్రి వరకు తీరిక ఉండదు. పాపం  చెల్లెలు  కోరిక. తీర్చలేదని భాధపడేవాడు. కాలము  గడచిపోతూఉంది. అనుకోకుండా  ఒకనాడు  ఆయనకు చెల్లెలు  ఇంటికి  వెళదామని అనకున్నాడు. ఆ రోజు  కార్తీక శుద్ద విదియ
"' యమధర్మరాజు "" చెల్లెలి ఇంటి  వచ్చాడు.  రాక రాక వచ్చిన అన్నయ్య ను చూచి
చెల్లెలు  "" యమున"" సంతోషంగా  అన్నయ్య. కు ఇష్టమైన. పదార్థాలు  వండి  దగ్గర కూర్చుని  కొసరి కొసరి వడ్డించింది.  "" యమధర్మరాజు "" త్రుప్తిగా భోజనము  చేసి  చెల్లెలు తో ప్రేమగా  చెల్లీ నాకు ఇషమైన పదార్థములు తో భోజనము పెట్టావు. నీకు ఏదైనా  వరం ఇస్తానని  చెప్పగా " యమున" అన్నయ్యా  లోకకల్యాణము కోసం  నాకు ఒక వరము ఇవ్వు.
ఈ రోజు  న ఎవరైనా  అక్క& చెల్లెలు  ఇంటికి  ఏ అన్నయ్య & తమ్ముడు  భోజనంచేస్తాడో  నీవు ఎట్టి పరిస్థితి లో వారి జోలికి వెళ్ళవద్దు. ఇది నా కోరిక అనగా "" యమధర్మరాజు ""
లోకకల్యాణం కోసం అడిగావు కనుక " తధాస్తు"
అని చెల్లెలు ను దీవించి  వెళ్ళాడు. అనగా రేపటి రోజున. అక్క & చెల్లెలు  చేతివంట ఎవరైతే భోజనం చేస్తారో వారికి అపముృత్యు దోషములను  ఉండవు. 
కనుక అందరు సోదరి చేతి భోజనం చేసి  కనుమరుగై న బంధుత్వాన్ని కలుపుకొని సుఖముగా ఉండాలని కోరుకుంటూ


     .🙏🏻🙏🏻🙏🏻 🙏🏻🙏🏻🙏🏻

Sunday, October 27, 2019

*కార్తీక పురాణం*

1వ అధ్యాయం

శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండమునందలి ఆర్యావర్తమందు నైమిశారణ్యములో శౌనకాది మహామునులతో నొక ఆశ్రమమును నిర్మించుకొని సకల పురాణములు, పుణ్య చరిత్రలు వారికి వినిపించుచూ సూతమహాముని కాలం గడుపుచుండెను. ఒకనాడు శౌనకాది మునులు గురుతుల్యుడగు సూతుని గాంచి, ‘ఆర్యా ! తమ వలన అనేక పురాణేతిహాసములను, వేదవేదాంగ రహస్యములను సంగ్రహముగా గ్రహించినారము. కార్తీక మాస మహత్యమును కూడా వివరించి, దాని ఫలమును తెలుపగోరుచుంటిమి గాన తమరా వ్రతమును వివరించవలసినది అని కోరిరి.

అంత నా సూతమహర్షి, ‘ఓ ముని పుంగవులారా ! ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్తయగు బ్రహ్మను కోరుకొనగా బ్రహ్మదేవుడు అతనికి విష్ణుమూర్తి లక్ష్మీ దేవికి, సాంబశివుడు పార్వతీ దేవికీ తెలియజేసిన విధముగా నా గాధను వినిపించెను.
అట్టి పురాణ కథను మీకు తెలియజేయుదును. ఈ కథను వినుటవలన మానవులకు ధర్మార్ధములు కలుగటయే గాక, వారు యిహమందును, పరమందును, సకలైశ్వర్యములతో తులతూగుదురు. కావున శ్రద్ధగా నాలకింపుడని యిట్లు చెప్పెను.

పూర్వము ఒకానొక దినంబున పార్వతీ పరమేశ్వరులు గగనంబున విహరించుచుండగా పార్వతీ దేవి, ‘ప్రాణేశ్వరా సకలైశ్వర్యములు కలుగజేయునట్టిది, సకల మానవులు వర్ణభేదములు లేక ఆచరించదగినది, శాస్త్ర సమ్మతమైనది, సూర్యచంద్రులున్నంత వరకు ఆచరింపబడేది యగు వ్రతమును వివరింపుడని కోరెను.

అంతట మహేశ్వరుడు మందహాస మొనరించి. ‘దేవీ ! నీవు అడుగుచున్న వ్రతము స్కాందపురాణమున చెప్పబడియున్నది. దానినిప్పుడు వశిష్ట మహాముని మిథిలాధీశుడగు జనక మహారాజునకు వివరింపబోవుచున్నాడు. చూడుమా మిథిలా నగరము వైపూ, అని మిథిలా నగరపు దిశగా చూపించెను .

అట, మిథిలా నగరములో వశిష్టుని రాకకు జనకుడు సంతసించి అర్ఘ్యపాద్యములతో సత్కరించి, కాళ్ళు కడిగి, ఆ జలమును శిరస్సుపై జల్లుకొని ‘మహాయోగీ! మునివర్యా ! తమ రాక వల్ల నేను, నా శరీరము, నా దేశము, నా ప్రజలు పవిత్రులమైతిమి. తమ పాద ధూళీ చే నా గేహము పవిత్రమైనది. తమ రిటకేల వచ్చితిరో సెలవొసంగుడూ, అని వేడుకొనెను.

అందులకు వశిష్టుడు ‘జనక మహారాజా! నేనొక మహాయజ్ఞుము చేయతలపెట్టితిని. దానికి కావలసిన అర్ధ బలమును, అంగ బలము నిన్నడిగి క్రతువు ప్రారంభించవలెనని నిశ్చయించి యిటువచ్చితినీ, అని పలుకగా, జనకుడు, ‘ముని చంద్రమా!’ అటులనే యిత్తును. స్వీకరింపుడు. కానీ. చిరకాలము నుండి నాకొక సందేహము కలదు. తమబోటి దైవజ్ఞులనడిగి సంశయమును తీర్చుకోదలిచితిని. నాయదౄష్టము కొలది ఈ అవకాశము దొరికినది. గురు రత్నా! సంవత్సరములో కల మాసములలో కార్తీక మాసమే ఏలనంత పవిత్రమైనది? ఆ కార్తీక మాస గొప్పతనమేమి? అను సంశయము నాకు చాలా కాలము నుండి యున్నది. కావున తాము కార్తీక మహత్మ్యము గురించి వివరింపవలసినదీ, అని ప్రార్థించెను.

వశిష్ట మహాముని చిరునవ్వు నవ్వి ‘రాజా! తప్పక నీ సంశయమును తీర్చగలను. నే చెప్పబోయే వ్రత కథ సకల మానవులు ఆచరించదగినది. సకల పాపహరమైనది అయివున్నది. ఈ కార్తీక మాసము హరిహర స్వరూపము. ఈ మాసమునందాచరించు వ్రతము యొక్క ఫలమింతని చెప్పనలవి కాదు. వినుటకు గూడా ఆనందదాయకమైనది. అంతియే గాక వినినంత మాత్రమునే ఎట్టి నరక బాధలు లేక యిహమందును, పరమందును, సౌఖ్యమును పొందగలరు, నీబోటి సజ్జనులు యీ కథను అడిగి తెలుసుకొనుట ఉత్తమమైనది. శ్రద్ధగా ఆలకింపుమని యిట్లు చెప్పసాగెను.

వశిష్టుడు కార్తీక వ్రత విధానము తెలుపుట

ఓ మిథిలాధీశ్వరా! జనక మహారాజా! ఏ మానవుడైనను, ఏ వయసు వాడైనను, ఉచ్ఛ, నీఛ అనే భేదము లేక కార్తీక మాసములో, సూర్య భగవానుడు తులారాశియందుండగా, వేకువ జామున లేచి కాలకృత్యములను తీర్చుకొని, స్నానమాచరించి, దానధర్మములను, దేవతా పూజలను చేసినచో దాని వలన అగణిత పుణ్యఫలము లభించును. కార్తీక మాస ప్రారంభము నుండియు యిట్లు చేయుచూ, విష్ణుసహస్ర నామార్చన, శివలింగార్చన, ఆచరించుచుండవలెను. ముందుగా కార్తీక మాసమునకు ఆధిదేవతయగు దామోదరునికి నమస్కరించి, ‘ఓ దామోదరా! నేను చేయు కార్తీక వ్రతమునకు ఎట్టి ఆటంకములు రానీయక నన్ను కాపాడుమ’, అని ధ్యానించి, వ్రతమును ప్రారంభించవలెను.

కార్తీక స్నాన విధానము

‘ఓ రాజా!’ ఈ వ్రతమాచరించు దినములలో సూర్యోదయమునకు పూర్వమే లేచి, కాలకృత్యములు తీర్చుకొని, నదికి బోయి స్నానమాచరించి గంగకు, శ్రీమన్నారాయణునకు, పరమేశ్వరునకు, భైరవునకు, నమస్కరించి, సంకల్పము చెప్పుకొని, మరలా నీట మునిగి సూర్య భగవానునకు అర్ఘ్యప్రదాన మొసంగి, పితృదేవతలకు క్రమ ప్రకారముగా తర్పణములొనర్చి గట్టుపై మూడు దోసిళ్ళ నీళ్ళు పోయవలెను.

ఈ కార్తీక మాసములో పుణ్య నదులైన గంగ, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర, యమున, మున్నగు నదులలో ఏ ఒక్క నదిలోనైననూ స్నానమాచరించిన యెడల గొప్ప ఫలము కలుగును. తడి బట్టలు వీడి, మడి బట్టలు కట్టుకొని, శ్రీమహావిష్ణువుకు ప్రీతి కరమైన పుష్పములను తానే కోసితెచ్చి నిత్య ధూప, దీప, నైవేద్యములతో భగవంతునికి పూజ చేసి, గంధము తీసి భగవంతునికి సమర్పించి, తాను బొట్టు పెట్టుకొని, పిమ్మట అతిధి అభ్యాగతులను పూజించి, వారికి ప్రసాదమిడి, తన ఇంటి వద్ద కానీ, దేవాలయములో కానీ, లేక రావిచెట్టు మొదట కానీ కూర్చుండి కార్తీక పురాణమును చదువవలయును. ఆ సాయంకాలము సంధ్యావందనము ఆచరించి. శివాలయమందు కానీ, విష్ణ్వాలయమందు కానీ, లేక తులసి తోట వద్ద కానీ, దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యమును తయారు చేయించి స్వామికి సమర్పించి, అందరికీ పంచిపెట్టి, తర్వాత తాను భుజింపవలెను. మరునాడు మృష్టాన్నముతో భూత తృప్తి చేయవలయును.

ఈ విధముగా వ్రతమాచరించిన స్త్రీ, పురుషులకు పూర్వమందును, ప్రస్తుత జన్మమందును చేసిన పాపము పోయి మోక్షమునకు అర్హులగుదురు. ఈ వ్రతము చేయుటకు అవకాశము లేని వారు, వ్రతము చేసిన వారలను జూచి, వారికి నమస్కరించినచో వారికి కూడా తత్సమాన ఫలము దక్కును.

ప్రథమాధ్యాయం మొదటి రోజు పారాయణము సమాప్తము.Forwarded by PLN CHARLU 
కార్తీక మాసం.                          స్నాన, దాన, జపాలు, పూజలు, ఉపవాస వ్రతాలు, దీపాలు వెలిగించడం, వనభోజనాలు వంటి వాటిని చేయడం వల్ల జన్మజన్మల పాపాలను ప్రక్షాళన చేసి అనంతమైన పుణ్యఫలాలను ప్రసాదించే మహిమాన్వితమైన మాసం "కార్తీకమాసం'. చాంద్రమానం ప్రకారం కార్తీకమాసం ఎనిమిదవది. శరదృతువులో రెండవ మాసం. ఈ మాసంలోని పూర్ణిమ నాడు చంద్రుడు కృత్తికా నక్షత్ర సమీపంలో సంచరిస్తూ ఉండడం వల్ల ఈ మాసానికి "కార్తీకమాసం" అని పేరు వచ్చింది.

"న కార్తీక నమో మాసః
న దేవం కేశవాత్పరం!
నచవేద సమం శాస్త్రం
న తీర్థం గంగాయాస్థమమ్"

అని స్కంద పురాణంలో పేర్కొనబడింది. అంటే "కార్తీకమాసానికి సమానమైన మాసము లేదు. శ్రీమహావిష్ణువుకు సమానమైన దేవుడు లేడు. వేదముతో సమానమైన శాస్త్రము లేదు గంగతో సమానమైన తీర్థము లేదు." అని అర్ధం.కార్తీకమాసం శివకేశవులిద్దరికీ అత్యంత ప్రీతికరమైన మాసం. కార్తీకమాసంలో ప్రతీరోజూ తెల్లవారుఝూముననే స్నానమాచరించవలెను.అప్పుడే అది కార్తీక స్నానమవుతుంది. నిత్యం దీపాన్ని వెలిగించినా, ఆరాధించినా, దీపమును కార్తీకమాసంలో వెలిగించడం, నదిలో దీపాలను వదలడం , ఆకాశ దీపాలను వెలిగించడం, దీపదానం చేయడం వంటి ఆచారాలను పాటించవలేను. కార్తీకమాసమంతా ఇంటి ముందు ద్వారానికి ఇరువైపులా సాయంకాలం దీపాలను వెలిగించవలెను. అట్లే సాయంత్ర సమయంలో శివాలయాల్లో గానీ వైష్ణవాలయాల్లోగానీ గోపురద్వారం వద్దగానీ, దేవుని సన్నిదానంలోగానీ ఆలయప్రాంగణంలోగానీ దీపాలు వెలిగించిన వారికి సర్వపాపములు హరించి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని శాస్త్ర వచనం. ఇతరులు వెలిగించిన దీపం ఆరిపోకుండా చూడడం కూడ పుణ్యప్రదమే. కార్తీక సోమవారాలు లేదా పౌర్ణమినాడుగాని లేక ఇతర దినాల్లో అయినా సాయంసమయాలలో శివాలయంలో ఉసిరికాయపైన వత్తులను ఉంఛి దీపం వెలిగించడం శ్రేష్టం. ఆవునెయ్యితో దీపం వెలిగించడం శ్రేష్టం. లేదంటే నువ్వులనూనెతోగానీ, కొబ్బరినూనెతోగానీ, నెయ్యితోగాని, అవిశనూనెతోగానీ, ఇప్పనూనెతోగానీ, లేదంటే కనీసం ఆముదంతోనైనా దీపమును వెలిగించవలెను. అంతే కాకుండా కార్తీకమాసంలో దీపదానం చేయాలని శాస్త్రవచనం. కార్తీకమాసంలొ ముప్పై రోజులలో దీపం పెట్టలేనివారు శుద్ధద్వాదశి, చతుర్దశి, పూర్ణిమ దినాల్లో తప్పక దీపం పెట్టాలని శాస్త్ర వచనం. ఈ విధంగా కార్తీకమాసంలో దీపాలను వెలిగించడం , దీపదానం చేయడం వల్ల సకల జీవరాశులే కాకుండా రాళ్ళూ, రప్పలు, వృక్షాలు వంటివి కూడా ముక్తి పొందుతాయని పురాణ కథనం.
కార్తీకమాసంలో ఆచరించాల్సిన విధులు.
కార్తీక స్నానాన్ని ఆశ్వీయుజ బహుళ అమావాస్య అంటే దీపావళి రోజు నుంచి ప్రారంభించవలెను. నెలంతా కార్తీక స్నానం చేయడం మంచిది. వీలుకానివారు సోమవారాల్లోనూ శుద్ధ ద్వాదశి, చతుర్దశి, పౌర్ణిమరోజుల్లోనైనా తప్పక ఆచరించవలెను.
శుద్ధ ద్వాదశినాడు తులసి పూజ చేయవలెను.
ఈ నెలంతా శ్రీమహావిష్ణువును తులసీదళములు, జాజిపూలతో పూజించవలెను.
ఈ నెలంతా శివుడిని మారేడుదళములతోనూ , జిల్లేడుపువ్వులతోనూ పూజించవలెను.
ఈ మాసంలో కార్తీక పురాణాన్ని పారాయణం చేయడం మంచిది.
కార్తీక మాసంలో పండుగలు
శుక్లపక్ష విదియ : భాతృ ద్వితీయ
దీనికే యమ ద్వితీయ, భగినీ హస్త భోజనం అని పేర్లు, ఈ దినం పురుషులు సొంత ఇంటిలో భోజనం చేయరాదు. ఈ దినం సోదరి ఇంటిలోగాని, లేదంటే సోదరితో సమానమైనవారి ఇంట భోజనం చేయవలెను. ఈ విధంగా చేస్తే అపమృత్యుభయం, నరకలోకభయం తొలగిపోతాయి. అంతే కాకుండా భోజనం పెట్టిన సోదరి కలకాలం పుణ్యస్త్రీగా ఉంటూందని శాస్త్రవచనం.
శుక్లపక్ష చవితి " నాగుల చవితి
కార్తీక శుక్లపక్ష చవితినాడు మన రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో నాగులచవితి పర్వదినం జరుపుకుంటారు.
శుక్లపక్ష ఏకాదశి : ప్రభోదన ఏకాదశి
ఆషాడ శుక్ల పక్ష ఏకాదశి నాడు పాలకడలిలో శేషశయ్యపై శయనించి, యోగనిద్రలో గడిపిన శ్రీమహావిష్ణువు ఈ దినం నిద్ర నుంచి మేల్కొంటాడు. కాబట్టి దీనికి 'ఉత్థాన ఏకాదశీ లేదా 'ప్రబోధన ఏకాదశి ' అని పేర్లు. ఈ దినం ఉపవాస వ్రతం పాటించి శ్రీమహావిష్ణువును పూజించవలెను. అంతేకాకుండా తొలి ఏకాదశినాడు ప్రారంభమైన చాతుర్మాస్య వ్రతానికి ఈ ఏకాదశి చివరిరోజు.
శుక్లపక్ష ద్వాదశి: క్షీరాబ్ది ద్వాదశి
పూర్వం కృతయుగంలో దేవతలు, దానవులు అమృతం కోసం క్షీరసాగర మధనం చేసింది ఈ రోజే. అందుకే దీనికి క్షీరాబ్ది ద్వాదశి ,చిలుకుద్వాదశి అని పేర్లు. శ్రీమహాలక్ష్మిని శ్రిమహావిష్ణువు వివాహం చేసుకున్నది కూడా ఈనాడే ఈ రోజు ఇంటి యందున్న తులసికోట వద్ద శ్రీమహావిష్ణువును లక్ష్మీసమానురాలైన తులసిని పూజించవలెను.
శుక్లపక్ష చతుర్దశి : వైకుంఠ చతుర్ధశి
వైకుంఠవాసుడైన శ్రీమహావిష్ణువు ఈ దినం వైకుంఠంను వదిలి వారణాసి వెళ్ళి పరమశివుడిని పూజించినట్లు కథనం. ఈ నాడు శైవాలయాలకు వెళ్ళి దీపం వెలిగించవలెను
శుక్లపక్ష పూర్ణిమ :
ఈ దినం శివాలయాల్లో నిర్వహించే 'జ్వాలాతోరణం ' ను దర్శించడం మంచిది. సాయంత్రం సమయంలో శివాలయంలోగానీ,వైష్ణ్వాలయంలోగానీ దీపాలను వెలిగించవలెను. ఈ దినం శ్రీ సుబ్రహ్మణ్యస్వామిని పూజించడం, మార్కండేయ పురాణం దానం చేయడం విశేష ఫలితాలను ఇస్తుంది.
కృష్ణపక్ష చవితి : కరక చతుర్ధి
ఇది వినాయకుడుకి సంబంధించినది. ఈ వ్రతం మహిళలు చేయడం మంచిది.
వృశ్చిక సంక్రమణం
ప్రత్యక్ష భగవానుడైన శ్రీసూర్యభగవానుడు ఈరోజు తులారాశి నుండి ఎనిమిదవ రాశి అయిన వృశ్చికరాశిలోనికి ప్రవేశిస్తూ ఉన్నాడు. ఈ సందర్భంగా సంక్రమణ స్నానాలు, పూజలు, జపాలు, దానాలు , దేవాలయ సందర్శనలు చేయడం వల్ల సర్వవిధాలా శుభఫలితాలను ఇస్తుంది.
కార్తీకమాసంలో విధులను పాటించడం ద్వారా ఆధ్యాత్మిక పరమైన ఫలాలను పొందడమే కాకుండా మారుతున్న సామాజిక పరిస్థితులు, ఆహారపు అలవాట్ల వల్ల కొత్తగా తలెత్తుతూ ఉన్న ఆరోగ్య సమస్యల నుంచి ఉపసమనం పొందవచ్చుForwarded by PLN Charlu 
*Spiritual Seekers 🙏*

*ఆటంక వాసనలు.....*

శ్లో || లోకానువర్తనం త్యక్త్వా త్యక్త్వా దేహాను వర్తనం |
శాస్త్రాను వర్తనం త్యక్త్వా స్వాధ్యాసాపనయం కురు ||

ప్రతి...

లోకానువర్తనం త్యక్త్వా=జనులు పోవురీతిని వదిలి; దేహాను వర్తనం త్యక్త్వా=దేహం నేననే భావాన్ని విడిచి; శాస్త్రాను వర్తనం త్యక్త్వా= శాస్త్రాలను అనుసరించటం వదిలి; స్వ అధ్యాస అపనయం కురు= నీ అధ్యాసను పోగొట్టుకో;

వ్యాఖ్య...

ఆత్మగా భావిస్తూ జీవించటంలో ముఖ్యమైన ఆటంకాలు.. 3, అనువర్తనం = గ్రుడ్డిగా సదా అనుసరించటం.

1) లోకానువర్తనం త్యక్త్వా...

జనులంతా ఎలా వెళ్తున్నారో చూచి గ్రుడ్డిగా అలాగే ఆధ్యాత్మికరంగంలో ఉన్న మనమూ వ్యవహరించటం కూడదు. సామాన్యంగా ఈ లోకంలో ప్రతివారూ తామున్న స్థితి నుంచి ఉన్నతస్థితికి ఎగబ్రాకటానికి ప్రయత్నిస్తారు. ధన సంపాదన, వస్తు సంపాదన, పదవీ సంపాదన, భోగ సంపాదన, రాజ్య సంపాదన, ఐశ్వర్య సంపాదన, ఇలా అన్నింటిని సంపాదించటమే ధ్యేయంగా పెట్టుకొని దానికి తగిన కర్మలు చేస్తారు. వాటివల్ల ఆ జన్మలో కలిగే ఫలితాలకే ప్రాధాన్యత ఇస్తారు. "ఆ తర్వాత ఏమిటి..? అని ఆలోచించరు. ఇదే లోకానువర్తనం". అలాగే భార్యాబిడ్దల పోషణ, బంధుమిత్రాదులతో సంబంధం - ఇవన్నీ బంధాలని భావించకుండానే బంధంలో పడిపోతుంటారు. ముక్తిని కోరే మనం గ్రుడ్డిగా లోకంలోని జనులను అనుసరిస్తే ఈ జన్మ వృధా అయినట్టే. జన్మరాహిత్యానికి ఏ ప్రయత్నమూ జరగనట్టే.

కనుక ఇలా గ్రుడ్డిగా అనుసరించటం కాకుండా జీవితాన్ని ఉన్నత ఆదర్శం వైపు త్రిప్పాలి. ఇప్పటిదాకా కొనసాగిస్తున్న జీవితాన్ని మార్చుకోవాలి. ఒక బాలుడు యవ్వనంలో ప్రవేశించగానే జీవిత విధానాన్ని మార్చుకుంటాడు. ఒక యువకుడు వృద్ధుడు కావటంతోనే జీవిత విధానం మారిపోతుంది. ఒక యువతి పెళ్ళి చేసుకోగానే పరిసరాలు మారిపోతాయి, జీవనవిధానం మారిపోతుంది. అలాగే మనం ఆధ్యాత్మిక మార్గంలో భగవంతుని వైపు ప్రయాణం సాగించాలంటే ఇందులో నిలదొక్కుకోవాలంటే ఇప్పటి వరకు సాధారణ జనుల మార్గంలో నడిచే నీవు నీ జీవన విధానాన్ని మార్చుకోవాలి.

తల్లిదండ్రులను, భార్యాబిడ్డలను, ఇళ్ళువాకిళ్ళను అందరి లాగా పట్టుకొని ప్రాకులాడరాదు. బరువులు, భాద్యతలు అంటూ అన్నీ నెత్తిన వేసుకొని, తనకు లేని, ఎప్పటికీ రాని సుఖాల కోసం పరుగులు తీస్తూ గ్రుడ్డిగా నీ తోటి వారిని అనుసరిస్తూ జీవించే విధానం పశుజీవనమే. అందుకే దీనిని వదలి తెలివిగా, మెలకువగా జీవించాలి. ఆధ్యాత్మిక రంగంలో ఉన్నతస్థితిలో ఉన్నవారిని ఆశ్రయించి వారు చూపిన మార్గంలో నీ జీవితాన్ని నడిపించాలి. అయ్యో నలుగురు నడిచే బాటను నడవాలి గదా..! అని దిగులు పడరాదు. లోకాన్ని చూచి భయపడరాదు. అందరూ బురదగుంటలో దిగుతున్నారు గదా..! అని మనమూ దిగరాదు.

2) దేహాను వర్తనం త్యక్త్వా...

దేహం మీద విపరీతమైన ప్రేమను పెంచుకొని ఎప్పుడూ దాని పోషణలోనే దాని అలంకరణలోనే మునిగిపోకూడదు. అది కోరే కోర్కెలను తీర్చే బానిసవు కావద్దు. ఇష్టమైన తిండికోసం, ఆకర్షణీయంగా కనపడటం కోసం, దేహానికి వెట్టిచాకిరీ చేయరాదు. అలాగని సాధకుడు దేహాన్ని పట్టించుకోకుండా ఉండరాదు. అది "సిద్ధుల పని". సాధకుడు ఈ దేహంతోనే సాధనలు సాగించాలి. శ్రవణ, మనన, నిధిధ్యాసనలకు ఈ దేహమే ఆధారం కనుక తగినంత సాత్విక ఆహారాన్నిస్తూ తగినంత దేహపోషణ చేసుకుంటూ, అనారోగ్యం రాకుండా కాపాడుకుంటూ ఒకవేళ అనారోగ్యం చేస్తే ఔషధాలు వాడుతూ దానిని చక్కగా పోషించుకోవాల్సిందే. అయితే అతికూడదు.

3) శాస్త్రాను వర్తనం త్యక్త్వా...

శాస్త్రాలన్నీ కీకారణ్యాల వంటివి. వాటిపై విపరీత వ్యామోహాన్ని పెంచుకొని, అన్నీ తెలుసుకోవాలని తపనపడితే జీవితమంతా కృషి చేసినా చాలదు. చతుర్వేదాలు, షడంగాలు, షట్ శాస్త్రాలు, 18 పురాణాలు, ఉపపురాణాలు, భగవద్గీత, చరిత్ర, భూగోళం, భూగర్భశాస్త్రం, వైద్యం, న్యాయశాస్త్రం.. ఎన్నో.. ఇవిగాక నాట్య నృత్య శిల్పం, సంగీతం, లలితకళలు, యోగా ఇలా ఎన్నో శాస్త్రాలను తెలుసుకోవాలని అనుకోరాదు. అన్నీ తెలుసుకోవటం సమయం వృధాచేసుకోవటమే. ఆధ్యాత్మికరంగంలో ఉన్నవారు మోక్ష ప్రదాయక గ్రంధాలనే చదవాలి గాని పాండిత్య ప్రతిభకై ప్రాకులాడరాదు ఉత్తేజాన్ని మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి గదా అని చెత్త నవలలు చదవరాదు. ఈ మూడింటిని లోకవాసన, దేహవాసన, శాస్త్రవాసన, వాసనాత్రయం అంటారు. ఈ మూడింటిని వదలాలి. వదలి ఏంచేయాలి..

"స్వ - అధ్యాస - అపనయం - కురు"...

నీ అధ్యాసను తొలగించుకో. ఈ దేహమే నేననే భావనను తొలగించుకో...

1) కనుక మోక్షమార్గంలో నడిచే మహాత్ములను అనుసరించాలి. వారి బోధలను వినాలి. ఆచరించాలి. వారి ఆచరణను జాగ్రత్తగా పరిశీలించాలి.

2) అలాగే దేహాన్ని ఆరోగ్యాంగా ఉంచుకోవాలి.

3) అవసరమైనంత వరకు శాస్త్రాలను అధ్యయనం చెయ్యాలి. వాటి లోతులను గ్రహించాలి. తెలివిగా వాటిని ఆచరించాలి.

ఇలా చేస్తూ గ్రుడ్డిగా అనుసరించటాన్ని వదలి వాసనలను అంతం చేయాలి. నిజంగా ఈ 3 వాసనలను అంతం చేయగలిగితే మిగిలిన వాసనలన్నీ రద్దై పోతాయి. ఎందుకంటే మిగిలిన వాసనలన్నీ దాదాపుగా ఈ మూడింటిలో ఏదో ఒక దానిపై ఆధారపడి ఉన్నాయి.

ఈ 3 వాసనలే ముక్తి మార్గంలో ప్రధాన ఆటంకాలు...

*|| ఓం నమః శివాయ ||forwaded by Surendra pss
లక్ష్మి పూజ

శ్రీ లక్ష్మీదేవి
తిథి
ఆశ్వయుజ మాసంలో వచ్చే అమావాస్య దినమున జరుపుకుంటారు.



ఇతిహాసము
ఈ రోజున శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో కలిసి బలి చక్రవర్తి యొక్క కారాగృహములో బంధించబడి వున్న దేవతలందరిని విముక్తి చేశాడు, ఆ తరువాత దేవతలందరు క్షీరసాగరములోకి వెళ్ళి పడుకొన్నారు, అను కథ వున్నది.



పండుగను జరుపుకొనే పద్ధతి
తెల్లవారుజామున మంగళ స్నానాన్ని ఆచరించిన తరువాత దేవుణ్ణి పూజిస్తారు. మధ్యాహ్నం సమయంలో పితృదేవతలకు శ్రాద్ధము మరియు బ్రాహ్మణులకు భోజనం పెడతారు, సాయంత్రము తమ పూజ స్థలాన్ని లతలు, పుష్పాలు మరియు ఆకులతో అలంకరించి లక్ష్మీదేవి, శ్రీ విష్ణు మరియు కుబేరున్ని పూజిస్తారు. ఇలా లక్ష్మీపూజ రోజున ఈ విధిని ఆచరించబడుతుంది.



లక్ష్మీదేవి పూజ చేసేటప్పుడు ఆసనాన్ని సిద్ధం చేయాలి. దానిపైన అష్టదళ పద్మం గాని లేదా స్వస్తిక చిహ్నాన్ని గాని అక్షింతలతో తయారు చేసి దానిపై లక్ష్మీదేవి విగ్రహమును స్థాపించాలి. కొన్ని ప్రాంతాల్లో కలశముపై పూజ పళ్ళెమును ఏర్పాటుచేసి తరువాత లక్ష్మీదేవి విగ్రహమును స్థాపన చేస్తారు.

లక్ష్మీదేవి ప్రక్కనే కుబేరుడి ప్రతిమను ఏర్పాటు చేయాలి. తరువాత లక్ష్మీ దేవితో పాటు దేవతలందరికీ చక్కెర వేసిన ఆవుపాలుతో తయార చేసిన పదార్థమును నైవేద్యంగా పెడతారు. ధనియాలు, బెల్లం, పొట్టుతో వున్న పేలాలు, చక్కెర బిల్లలు మొదలగు పదార్థములను లక్ష్మీదేవికి సమర్పించి ఆ తరువాత వాటిని ప్రసాదంగా బంధువులకు పంచుతారు. ఎండిన గోంగూర పుల్లలకు వొత్తులు చుట్టి వెలిగించి దక్షిణం వైపు చూపించి పితృదేవతలను ప్రార్థ్ధిస్తారు. బ్రాహ్మణులకు మరియు ఆకలితో వున్నవారికి అన్నదానం చేస్తారు. ఈ రోజు రాత్రికి నిద్రపోకుండా జాగరణ చేస్తారు. ఎందుకంటే ఆశ్వయ్యుజ అమావాస్య రోజు రాత్రిపూట లక్ష్మీదేవి ఆదర్శవంతమైన గృహం కోసం వెదుకుతూ తిరుగుతు వుంటుంది. ఎక్కడైతే చారిత్రవంతులు, కర్తవ్యదక్షులు, ఓపిక గలవారు, ధర్మనిష్ఠ గలవారు, భగవత్భక్తి మరియు క్షమాశీలులైన పురుషులు మరియు గుణవంతులైన, పతివ్రతా స్త్రీలు నివసించే గృహంలో మాత్రమే లక్ష్మీదేవి నివసించడానికి ఇష్టపడుతుంది.



లక్ష్మి దేవితో కుబేరుడిని పూజించిటకు మహత్యం
లక్ష్మి దేవి సంపదను ప్రసాదించే తల్లి, దేవత కుబేరుడు కోశాధికారి. చాలామందికి ధనాన్ని సంపాదించే కళను కలిగి వుంటారు. కానీ వారికి ఎలా పొదుపు చేయాలో తెలియక వృధా ఖర్చులు చేసి ధనాన్ని అంతా పోగొట్టుకుంటారు . వాస్తవానికి ధనాన్ని సంపాదించడంతోపాటు దానిని ఆదా చేయడం, తగిన చోట ఖర్చు పెట్టడం చాలా ముఖ్యంమైనది. దేవత కుబేరుడు తానే కోశాధికారి కాబట్టి ఈ కళను నేర్పే దేవత. కాబట్టి ఈ పండుగకు లక్ష్మి దేవిని, దేవత కుబేరున్ని పూజించమని చెప్తారు. ప్రజలందరూ, ముఖ్యంగా వ్యాపార వర్గాల వారు ఈ పండుగను ఎంతో శోభాయమానంగా, ఉత్సాహంగా జరుపుకుంటారు.



లక్ష్మీపూజ యొక్క ప్రాముఖ్యత
సాధారణంగా అమావాస్యను అశుభ దినముగా పరిగణిస్తారు; కానీ ఆశ్వయుజ మాసంలో వచ్చే అమావాస్యకు మాత్రం మినహాయింపు వుంది. ఈ అమావాస్య దినమును శుభముగా భావించడమైనది; అయినప్పటికీ అన్ని సందర్భాలకు శుభ దినముగా పరిగణించరు; అందువల్ల ఈ దినమును శుభదినముగా పిలువడంకన్నా ఆనందమయ దినముగా పరిగణించడము సరియైనది.



లక్ష్మీదేవికి చేయవలసిన కొన్ని ప్రార్ధనలు
లక్ష్మి పూజలో లెక్కల పుస్తకాలను అమ్మవారి ముందు ఉంచి ఇలా ప్రార్ధించాలి. ‘ఓ దేవి నీవు అనుగ్రహహించిన సంపదను సత్కార్యానికి మరియు దైవకార్యానికి ఉపయోగించాము. పూర్తి చేసిన లెక్కలను మీ ముందు వుంచుతున్నాము తల్లి. వీటిని అంగీకరించుము. రాబోయే సంవత్సరంలో కూడా మా లక్ష్యం ఎల్లప్పుడు కొనసాగేటట్లు దీవించు తల్లి’.

‘నేను చేపట్టే ప్రతి కార్యంలో నాతోవుండి నా అవసరాలను తీర్చడానికి నాకు చైతన్యాన్ని ఇచ్చే దైవ శక్తి నాలో వుంది. కాబట్టి ఆ దైవశక్తి కూడా నా భాగస్వామియే. ఏడాది పొడవునా నేను సంపాదించిన ధనము యొక్క లెక్క మరియు దానిని ఉపయోగించిన విధానం, ఈ పుస్తకాలలో చివరి పైసా వరకు లెక్క వ్రాయబడింది. నేను ఈ రోజు మీ ముందు పరిశీలన కోసం ఉంచాను. నీవే సాక్షి తల్లి. నేను మీ నుండి ఏమీ దాచలేను. నేను నిన్ను గౌరవించాను మరియు దైవకార్యానికి మాత్రమే ఉపయోగించాను. ఓ నిష్కలంకమైన మరియు శుద్ధమైన లక్ష్మీదేవి నేను నిన్ను ఎలాంటి అన్యాయమైన చర్యకు ఉపయోగించలేదు’.

‘ఇదంతయు సరస్వతి దేవి యొక్క అనుగ్రహం వల్లనే సంభవమైనది. నేను విచక్షణ మరియు నైతిక విలువలు కలిగివున్నాను. ఇందువల్లనే నాలోని ఆత్మబలము తక్కువ కాలేదు. నాకు మరియు నా కుటుంబానికి సుఖము, సమాధానము లభించినది. నేను భగవంతుని సహకారంతో ఆయనను స్మరించుకుంటూ ఖర్చు చేశాను. నేను ధనాన్ని సన్మార్గంలో ఉపయోగించకపోతే నీవు నాతో ఉండవని ఎల్లప్పుడు గుర్తుపెట్టుకున్నాను. అందువల్ల హే లక్ష్మీదేవి, నేను చేసిన ఖర్చును సమ్మతించుటకు మీరు నన్ను దేవునికి శిఫారసు చేయుము; ఎందుకంటే నీ శిఫారసు లేకుండ ఆయన నన్ను మన్నించడు. నా దృష్టికి వచ్చే తప్పులను పునరావృతం చేయకుండా ప్రయత్నిస్తాను. అందువల్ల, హే లక్ష్మీదేవి మరియు సరస్వతి దేవి, మీ కృపను నాకు ప్రసాదించుము మరియు నా ద్వారా జీవితమంతా హితము కొరకు వినియోగించుటకు జరుగనిమ్ము.’

ఆధ్యాత్మిక ప్రాముఖ్యత : పై విధంగా లక్ష్మీదేవి మరియు సరస్వతిదేవికి ప్రార్థించడమువలన జీవునిలో వున్న కర్తుత్వము యొక్క సూక్ష్మతలంపు తగ్గి తన స్వభావము అంతర్ముఖమౌతుంది. ఇందువలన నిర్మాణమయ్యే మోహము దానిలో పడకుండ అతని ప్రవర్తనలో వినయశీలత ఏర్పడుతుంది.



లక్ష్మీపూజ రోజున తీయవలసిన ముగ్గు


లక్ష్మీతత్వమును ఆకర్షింపజేసుకొనే 11 చుక్కలు మరియు 11 వరుసల ముగ్గు



లక్ష్మీపూజ రోజున రాత్రికి ఇల్లును ఎందుకు ఊడ్చుతారు ?
అలక్ష్మీని తొలగించుట
మనలో గుణాలను నిర్మాణము చేసినను, దోషాలను తొలగించుకొనే ప్రక్రియలో ముందడుగు వేసినప్పుడే సద్గుణాలకు గొప్పతనము వస్తుంది. ఇప్పటి వరకు మనము లక్ష్మీని (ధనము) ఎలా సంపాదించాలి, అని తెలుసుకున్నాము. దీనితో పాటు అలక్ష్మీ నాశనము కూడ కావాలి; అందువల్ల ఈ రోజున కొత్త చీపురు కొంటారు. చీపురును లక్ష్మీగా భావిస్తారు.

ఆచరించు విధానము : ఆ చీపురుతో అర్ధరాత్రి ఇల్లు ఊడ్చి ఆ దుమ్మును బయట పడేయాలి అని చెప్తారు. దీనిని అలక్ష్మీని తొలగించడం అంటారు. సాధారణంగా రాత్రికి ఇల్లు ఊడ్చి దుమ్ము బయట పడేయటం ఎప్పుడూ చేయరు. కేవలము ఈ రాత్రికి చేస్తారు. దుమ్మును ఊడ్చుతున్నప్పుడు చాటను చిన్న కర్రతో వాయించి అలక్ష్మీని బయటికి నెట్టేస్తారు.

సందర్భం : సనాతన ప్రచురణ ‘పండుగలు, ఉత్సవాలు మరియు వ్రతాలు’


లక్ష్మీ చంచలమైనదని, చెప్పుటకు కారణములు
ఏ దేవుని ఉపాసన చేస్తారో ఆ దేవుని తత్వము ఉపాసకుని వద్దకు వస్తుంది మరియు దాని అనుసారంగా లక్షణాలు కనబడుతాయి, ఉదా. శ్రీలక్ష్మీయొక్క ఉపాసన చేసినచో, ధనప్రాప్తి అవుతుంది. ఈ ఉపాసన తగ్గినచో, అహం జాగృతమై ఆ దేవత తత్వము ఉపాసకున్ని వదలి వెళ్ళిపోతుంది. అప్పుడు స్వంత తప్పును ఒప్పుకోక మనుష్యులు లక్ష్మీ చంచలమైనదని అంటుంటారు. కాని ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయమేమింటే, లక్ష్మీ చంచలమై వున్నట్లయితే తను శ్రీవిష్ణువు చరణాలను ఎప్పుడో వదిలేసి వుండేది.Forwarded by Jyoti Reddy 
దీపావళి పండుగ విశిష్టత మరియు లాభాలు.!

దీపావళి అమావాస్య రోజున సూర్యచంద్రులిద్దరూ స్వాతి నక్షత్రం లో ఉంటారు, ఈ సమయం లో స్నానం చేయడం ఎంతో మంచిది. కాబట్టి పొద్దున్నే తల స్నానం చేసి ఆ తరువాత తెల్లటి దుస్తులు ధరించడం ద్వారా మంచి జరుగుతుంది.

తెలుగు ప్రజలు ఎంతో ఆనందోత్సాహాల తో చేసుకునే పండుగ దీపావళి. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ఆ రోజు ఆరుబయట చేసే సందడి అంతా ఇంతా కాదు. చిన్న, పెద్దా పటాకులు కాలుస్తూ..దీపాలు పెడుతు ఖుషీ ఖుషీగా గడుపుతారు. దీపావళి అంటే దీపాల క్రమం. దీపం వెలుగును పంచుతుంది. చైతన్యాన్ని ప్రతిఫలిస్తుంది. కమ్ముకున్న కారుచీకటి చీల్చివేస్తుంది. ఏటా ఆశ్వయుజ అమావాస్య నాడు దీపావళిని జరుపుకుంటారు. హిందువులు ప్రతి రోజు పూజ చేసేటప్పుడు దీపం వెలిగిస్తారు. పండుగలకూ తప్పనిసరిగా దీపారాధన చేస్తాం.

దీపం పరబ్రహ్మస్వరూపం. అలాంటి దీపాలతో చేసే అపురూపమైన పండుగ దీపావళి. హిందువుల ముఖ్యమైన పండుగల్లో దీపావళి ఒకటి. ఆ రోజు ప్రతి ఇంటి ముందు దీపాలు ప్రకాశిస్తూనే ఉంటాయి. ప్రతి పండుగకు పిండి వంటలు, కొత్త బట్టలు, సరదాలు, దీపారాధనలు ఉంటాయి. మరి దీపావళికి మాత్రమే దీపాల ప్రదర్శన ఎందుకు…? ఆరు బయట దీపాల పెట్టడం వెనుక కారణం ఏంటి..? కార్తీక మాసంలో తులసిని పూజించి.. తులసి ముందు ఒక్క దీపాన్నైనా ఉంచితే మంచి జరుగుతుందని హిందువుల నమ్మకం.

అమావాస్య నాడు చనిపోయిన పితృదేవతలకు తర్పణం విడిచే ఆచారం ఉంది. ఆ ప్రకారం పురుషులు జలతర్పణం విడుస్తుంటారు. ఇక్కడ వినిపించే ఇంకో పురాణ కథ ఏమిటంటే… మహాలయ పక్షంలో స్వర్గం నుంచి భూలోకానకి పితృదేవతలు దిగివచ్చి.. దీపావళి రోజున పితృలోకాలకు తిరిగి పయణమవుతారట. అలా వెళ్లే పితృదేవతలకు వెలుతురు చూపించడం కోసం ఆరు బయట దీపాలు వెలిగించే ఆచారం వచ్చిందట.

ఇంటి గడపకు పూసే పసుపు, వాకిట ముందు వేసే రంగవళ్లులు… ఇలా అనాదిగా వస్తున్న ప్రతి ఆచారం వెనుక ఓ శాస్త్రీయ కారణం ఉంది. దీపావళి వెనకు కూడా అలాంటి కారణాలు ఉన్నాయి. పురాణాల ప్రకారం దీపావళి పండగను చెడు తొలగిపోయి మంచి మొదలవ్వాలనే ఉద్దేశంతో నిర్వహిస్తారు. వ్యాపారాభివృద్ధి, అష్ట ఐశ్వర్యాలు సిద్ధించాలని లక్ష్మీకటాక్షం కోసం పూజలు చేస్తారు. దీపావళి నాటి దీపకాంతి సహస్ర సూర్యులకాంతికి మించిందని శాస్త్రం చెబుతోంది. ఆ రోజు ఆవునేతితో లేదా నువ్వుల నూనేతో దీపారాధన చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందట. ఎందుకంటే దీపంలో లక్ష్మీ దేవి ఉంటుందట. దీని వెనుక కూడా ఓ కథనం ఉంది.

దేవతల అధిపతి ఇంద్రుడు శ్రీమహాలక్ష్మిని పూజిస్తూ…అమ్మా.. సామాన్యులు నీ కృపను పొందాలంటే ఏం చేయాలని అడుగాడట. అప్పుడు లక్ష్మీ దేవి ‘నన్ను త్రికరణశుద్ధిగా ఆరాధించే భక్తులకు ఎన్నడూ, ఏ లోటూ ఉండదు. దీపం వెలిగించి, ప్రార్థించే భక్తులకు అష్ట ఐశ్వర్యాలను ప్రసాదిస్తాను’ అని బదులిస్తుందట. అప్పటి నుంచి దీపంలో లక్ష్మీదేవి రూపాన్ని దర్శించుకోవడం ఆనవాయితీగా మారింది. దీపావళి రోజు దీపాలతోనే పండుగ కాబట్టి… ఆ రోజు లక్ష్మీదేవిని ఆరాధించే ఆచారం ఏర్పడింది. ఇక శాస్త్రీయ కోణంలో చూసినా దీపావళికి చాలా ప్రాధాన్యత ఉంది. వర్షాకాలం తర్వాత వచ్చే పండుగ దీపావళి.

వర్షాల కారణంగా నీళ్లు ఎక్కడ బడితే అక్కడ నిలిచిపోయి.. క్రిమి కీటకాలు బాగా వృద్ధి చెందుతాయి. వాటి వల్ల ప్రజలు అనారోగ్యం పాలవుతారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆరుబయట దీపాలు వెలిగించడం వల్ల చాలా కీటకాలు వెలుగుకు ఆకర్షితమై దీపంలో పడి చనిపోతాయి. ఇక దీపావళి నాడు కాల్చే టపాసులు, మతాబులు.. వాటి నుంచి వచ్చే పొగ.. దోమలు మొదలైన వాటిని మట్టుపెడతాయి.forwaded By Jyoti Reddy 
*నరకాసుర వధ - దీపావళి*
         
              నరకాసురుడు ఇంద్రుని తల్లి అదితి కుండలాలను దోచు కుంటాడు. నరకునిమూలంగావరుణుడుగొడుగునూ,మేరువు తనలోనిభాగమైన మణిపర్వతాన్నీ కోల్పోతారు. నరకుని ఆగడాలకు తాళలేక ఇంద్రాదులు శ్రీకృష్ణునితో మొరపెట్టుకుంటారు. శ్రీకృష్ణుడు నరకాసుర సంహారం చేయడానికి బయలు దేరుతాడు.

            ఆ సందర్భాన కృష్ణుని భార్యామణి సత్యభామ భర్తతో ఇలా అంటుంది---*స్వామీ! ప్రాణేశా! నీవు విజృంభించి రాక్షసగణాలను సంహరిస్తుంటే* *నీయుద్ధచాతుర్యాన్ని చూడాలని ఉంది.మన్నించి నన్నుకూడా నీ వెంట రణరంగానికి తీసుకొనివెళ్లు.* ~ అపుడు కృష్ణస్వామి ప్రాణేశ్వరితో ఇలా
అంటాడు--

*సీ.సమదపుష్పంధయ ఝంకారములుగావు,*
                            *భీషణ కుంభీంద్ర బృంహితములు*
    *వాయునిర్గతపద్మ వనరేణువులుగావు,*
                           *తురగ రింఖాముఖోద్ధూత రజము*
    *లాకీర్ణజలతరంగాపాతములుగావు,*
                           *శత్రుధనుర్ముక్త సాయకములు*
     *కలహంస సారస కాసారములుగావు,*
                          *దనుజేంద్ర సైన్యకదంబకములు*

 *తే.కమల కల్హార కుసుమ సంఘములుగావు,*
     *చటులరిపు శూలఖడ్గాది సాధనములు,*
     *కన్య! నీవేడ?రణరంగ గమనమేడ?*
     *వత్తు వేగమ , నిలువుము, వలదు వలదు*
                        ---భాగవతం,౧౦స్కం,ఉ.భా.౧౫౩

*భావం:*

            *సత్యభామా! అక్కడ వినిపించేది మత్తిల్లిన తుమ్మెదల*
*రొదలుకావు,మహామదగజాల ఘీంకారాలు.ఆచోట నిను చుట్టుకునేది గాలికి చెదరిన తామరపుప్పొళ్లుకాదు సుమా, గుర్రాల గిట్టల కొనలవలన* *రేకగిన ధూళి.అక్కడ సరసులోని నీటిఅలలతుంపురుల జడికాదు కురిసేది, శత్రువుల ధనువుల నుంచి వదలిన శరపరంపరలు. అది* *రాయంచలూ  బెగ్గురు పక్షులూ ఉండే సరస్సుకాదు, వైరివర్గం ప్రయోగించే* *కత్తులూ శూలాలూ యుద్ధపరికరాలు ఉంటాయి. నీవేమిటి!*
*యుద్ధ భూమికి రావడమేమిటి? నేను తొందరగానే వస్తాను. నీవు ఇక్కడే* *అంతఃపురంలో హాయిగా, ఉండు. నా వెంట రానే రావద్దు.*

      కృష్ణుని మాటలకు ఆత్మాభిమానంగల సత్యభామ *నీ‌భుజాలు అనే కోటల* *చాటున ఉన్నపుడు నాకేమీకాదు.నీ వెంట తప్పక వస్తాను." అంటూ కృష్ణునికి గౌరవంగా వలపుతో చేతులు మోడ్చింది.*

       కృష్ణుడు కాదనలేక సత్యభామను వెంటతోడ్కొని
గరుడారూఢులై ఆకాశమార్గాన ప్రాగ్జోతిషపురంవైపు పయనిస్తారు.

         నరకునకూ కృష్ణునకూ యుద్ధం జరుగుతూ ఉంటుంది.అపుడు సత్యభామ తన జడను గట్టిగా చుట్టగా‌ చుట్టింది. పోకముడిని గట్టిగా బిగించుకుంది. నగలుసవరించుకుంది. తన ముఖచంద్ర కాంతులు వ్యాపించగా వీరప్రతా పాటోపంతో శ్రీకృష్ణునిముందు వీరవనితలా నిలిచింది.

*క.జన్యంబున దనుజుల దౌ*
   *ర్జన్యము లుడుపంగ గోరి చనుదెంచిన సౌ*
   *జన్యవతి జూచి యదురా*
   *జన్యశ్రేష్ఠుండు సరస సల్లాపములన్ -భాగ,౧౦స్క ఉ.౧౭౧*
*క.లేమా!  దనుజుల గెలువగ*
   *లేమా?  నీవేల కడగి లేచితి విటు  రా!*
   *లే!  మాను  మానవేనిన్*
   *లే  మా విల్లందికొనుములీలంగేలన్ -భాగ,౧౦స్క.ఉ.౧౭౨*

          కృష్ణుడు తన విల్లును సత్యభామకు ఇచ్చినాడు. ఆమె రణం
మీద ఉండే తహతహతో అల్లెతాడు బిగించింది. శత్రుసైన్యం
తత్తరపాటుపడేలా అల్లెత్రాడును మోగించింది.ఆ ధ్వనికి ఏనుగులు మొదలయినవి మూర్ఛిల్లినవి.

*సీ.సౌవర్ణ కంకణ ఝణఝణ నినదంబు*
                            *శింజినీ రవముతో జెలిమిసేయ*
    *దాటంక మణిగణ ధగధగ దీప్తులు*
                            *గండమండల రుచి గప్పికొనగ*
    *ధవళతరాపాంగ ధళధళ రోచులు*
                            *బాణజాలప్రభాపటలి నడప*
     *శరజాత  ఘుమఘుమ శబ్దంబు పరిపంథి*
                           *సైనిక కలకల స్వనము నుడుప*

 *తే. వీర శృంగార భయ రౌద్ర విస్మయములు*
     *గలసి భామిని యయ్యెనో కాక యనగ*
     *నిషువు దొడువుట దివుచుట యేయుటెల్ల*
     *నెఱుగ రాకుండ నని సేసె నిందువదన*
                                         -భాగవ,౧౦స్కం,ఉ,౧౭౭

*భావం:*

           సత్యభామ యుద్ధంచేస్తుంటే ఆమె బంగారుగాజుల ఝణఝణ ధ్వనీ, అల్లెతాటిధ్వనీ ఏకమయ్యాయి.ఆమె చెవి పోగులలో పొదిగిన మణుల ధగధగమనే కాంతులు,చెక్కిళ్ల. కాంతులనుకప్పివేశాయి.ఆమెకడకన్నుల తళతళకాంతులు బాణాలకాంతులను అణచివేశాయి.ఆమె వదలిన బాణాల
ఘుమఘుమారావం సైనికుల కలకలాన్ని మాన్పింది.వీర, శృంగార, భయానక, రౌద్ర, అద్భుత  రసాలు  కలసి  ఈ *వీరనారిగా* రూపొందిందా అనుకొనేలా ఆమె కనబడుతోంది. ఆమెబాణాలనుఎప్పుడువింటియందు కూర్చుతుందో,ఎప్పుడు
నారిని  లాగుతుందో, ఎప్పుడు  బాణాన్ని   ప్రయోగిస్తుందో తెలియడం లేదు.

*మ.పరుజూచున్ వరుజూచు నొంపనలరింపన్,రోషరాగోదయా*
    *విరతభ్రూకుటిమందహాసములతో వీరంబు శృంగారమున్*
 *జరగన్,గన్నులగెంపుసొంపు బరగం జండాస్త్రసందోహమున్*
 *సరసాలోక సమూహమున్ నెఱపుచుం జంద్రాస్యహేలిగతిన్*
                                         -భాగవ,౧౦స్కం,ఉ.౧౭౮
*భావం :*

                 సత్యభామ వయ్యారపు పోకడలు పోతూ  రోషంతో ఏర్పడిన కనుబొమలతో, వీరరసం అతిశయిల్లగా వాడిఅయిన అస్త్రా లను ప్రయోగిస్తూ  నరకాసురుణ్ణి   పీడించడానికి ప్రయత్నిం చింది.అనురాగంవల్ల జనించిన చిరునవ్వుల్ని చిందిస్తూ,శృంగారరసం ఉద్దీపోంచగా, సొగసయిన కనులతో, రసమయమైన చూపులను ప్రసరింపజేస్తూ భర్త శ్రీకృష్ణుణ్ణి ఆనందింపజేయడానికి యత్నించింది.ఇలా వీర శృంగారాలను ప్రదర్శించిన వీరశృంగారనారి  సత్యభామ.

*మ.అలినీలాలక చూడ నొప్పెసగె ప్రత్యాలీఢ పాదంబుతో*
    *నలిక స్వేద వికీర్ణకాలకలతో నాకర్ణికానీత స*
    *ల్లలితజ్యానఖ పుంఖ దీధితులతో లక్ష్యావలోకంబుతో*
    *వలయాకార ధనుర్విముక్త విశికవ్రాతా హతారాతియై.*
                                    -భాగవత,౧౦స్కం,ఉ.౧౭౯

*భావం:*

              సత్యభామ సొగసు ఉట్టిపడేలా దానవులతో యుద్ధం చేసేటపుడు విలుకానివలె ఎడమకాలు ముందుంచి నిలి చింది.ఆమె ముంగురులు నొసలిచెమటలో చెదిరాయి.ఆమె  చెవివరకూ లాగిన అల్లెతాటినిపట్టుకున్న చేతివేళ్ల గోళ్లకాం తులూ,అమ్ములవెనుకభాగపుకాంతులూ అంతటావ్యాపి
స్తున్నాయి.ఆమె చూపు గురితప్పలేదు. ఆమె నారిని లాగడంవల్ల గుండ్రంగా అయిన వింటినుండి బాణాలువదలి శతృవులను సంహరించింది. ఇలా సత్యభామ తన యుద్ధ వైశారద్యాన్ని ప్రదర్శించింది.

*సీ.'బొమ్మపెండ్లిండ్లకు బోనొల్లాననుబాల*
                              *రణరంగమునకెట్లు రాదలంచె?*
   *మగవారి గనిన దా మఱుగు చేరెడు నింతి*
                            *పగవారి గెల్వనేపగిది జూచె?*
    *పసిడి యుయ్యెలలెక్క భయమందు భీరువు*
                           *ఖగపతి స్కంధమే పగిది నెక్కె?*
    *సఖులకోలాహలస్వనములోర్వని కన్య*
                           *పటహభాంకృతులకెబ్భంగి నోర్చె?*

*ఆ. నీలకంఠములకు నృత్యంబు గఱపుచు*
                           *నలసి తలగిపోవు నలరుబోడి*
     *యే విధముననుండె నెలమి నాలీఢాది*
                           *మానములను రిపంలమాన మడప?*
                                        -భాగవత,౧౦స్కం,ఉ.౧౮౦
*సీ. వీణె జక్కగబట్ట వెరవెరుంగనికొమ్మ*
                           *బాణాసనం బెట్లు పట్ట నేర్చె?*
    *మ్రాకున దీగె గూర్పంగ నేరని లేమ*
                          *గుణము నే క్రియ ధనుఃకోటి గూర్చె?*
    *సరవి ముత్యము గ్రువ్వజాలని యబల యే*
                           *నిపుణత సంధించె నిశిత శరము?*
    *చిలుకకు పద్యంబు సెప్పనేలని తన్వి*
                               *యస్త్రమంత్రము లెన్న డభ్యసించె?*

*ఆ. పలుకు మనిన పెక్కు పలుకని ముగుద యే*
                                *గతి నొనర్చె సింహగర్జనములు?*
     *అనగ మెఱసె త్రిజగదభిరామ,గుణధామ,*
                                  *చారుసత్యభామ,సత్యభామ!*
                                        -భాగవత,౧౦స్కం,ఉ,౧౮౧

                   సత్యభామ అల్లెతాడుమోత ఉరుముగా,దేవతలు చాతక పక్షులుగా,ధనుస్సు ఇంద్రధనుస్సుగా,శ్రీకృష్ణుడు మేఘంగా,  తాను మెఱుపు తీగగా,బాణాలు నీటితుంపురులుగా, రాక్ష సులు అనే కార్చిచ్చు ఆరిపోగా వర్షాకాలాన్నో సృష్టించింది.

*సీ.రాకేందు బింబమై రవిబింబమైయొప్పు*
                             *నీరజాతేక్షణ నెమ్మొగంబు,*
    *కందర్పకేతువై ఘనధూమకేతువై*
                              *యలరు పూబోడి చేలాంచలంబు,*
     *భావజు పరిధియై ప్రళయార్కు పరిధియై*
                            *మెఱయు నాకృష్టమై మెలత చాప,*
     *మమృత ప్రవాహమై యనలసందోహమై*
                              *తనరారు నింతి సందర్శనంబు,*

*ఆ.హర్షదాయోయై మహారోషదాయియై,*
                               *పరగు ముద్దరాలి బాణ వృష్టి,*
   *హరికి నరికి జూడ నందంద శృంగార*
                              *వీర రసము లోలి విస్తరిల్ల.*
                                                  -౧౦స్కం,ఉ,౧౮౩

            సత్యభామాదేవి ఇలా హరికి అరికి మధ్య శృంగార వీర  రసాలను విస్తరింప జేసింది.సత్యభామ   ప్రయోగించిన వాడిబాణాలకు తాళలేక, ధైర్యంకోల్పోయిన   రాక్షససేనలు  చెదరిపోయి నరకాసురుని మరుగు జొచ్చాయి. అపుడు కృష్ణుడు సత్యభామ యుద్ధప్రయత్నాలను నివారిస్తూ ఇలా
అన్నాడు--

*క.'కొమ్మా! దానవనాథుని*
   *కొ  మ్మాహవమునకు తొలగె గురువిజయము గై*
   *కొమ్మా! మెచ్చితి నిచ్చెద*
   *కొ  మ్మాభరణములు నీవు కోరినవెల్లన్'     -౧౦,ఉ,౧౮౭*

               శ్రీకృష్ణుడు సరససల్లాపాలతో కళావిశారద అయిన సత్యభామను
బహుమానించి,ఆమె చేతిలో ఉన్న ధనువును తిరిగి తీసు కున్నాడు.అపుడు నరకాసురుడు కృష్ణుడు ఇలా అన్నాడు-

*క.మగువ మగవారి ముందఱ*
   *మగతనములు సూప రణము మానుట నీకున్*
   *మగతనముగాదు; దనుజులు*
   *మగువలదెస జనరు మగలమగ లగుట హరీ!*

(మగల మగలగుట-మగాళ్లకే మగాళ్లం, అంటే వీరులకే వీరులం)

నరకాసురుడు ఇలా అనగా కృష్ణుడు----

*క. నరకా! ఖండించెద మ*
    *త్కరకాండాసన విముక్త ఘన శరముల భీ*
    *కరకాయు నిన్ను సుర కి*
    *న్నరకాంతలు సూచినేడు నందం బొందన్    -౧౦ఉ,౧౯౧*

                శ్రీకృష్ణుడు దివ్యాస్త్రమైన శతఘ్నితో నరకుని భటులను మహా సంక్షోభానికి గురిచేశాడు.కృష్ణుడు బాణాలతో ఖండించిన గుర్రాలూ, గదతో బద్దలు చేసిన ఏనుగులూ,  చక్రంతో ఖండితశిరస్కులైన రాక్షససైన్యం హాహాకారాలు చేస్తూ పారిపోయారు ~ రత్నమయకుండల సమేతమైన నరకాసురుని తలను
శ్రీకృష్ణుడు తన సుదర్శనచక్రంతో ఖండించాడు.నరకుడు రోదిస్తూ యుద్ధ భూమి మీద పడిపోయాడు.

             దేవతలుమింటినుండిపూలవానకురిపించారు. భూలోకంలో
మానవాళి అమావాస్య చీకటి తొలగిందని ఆనందంతో దీపావళిని సంతరించి పండుగ చేసుకున్నారు. నరకుని చెఱలో ఉన్న పదారువేల కన్నియలు బంధవి ముక్తు లయ్యారు, ఈప్సితార్థాన్ని పొందారు. భూదేవి శ్రీకృష్ణుని స్తంతించింది-

            *ఆ.ధాతగన్న మేటితండ్రికి నజునికి*
               *నీకువందనంబునేనొర్తు*
               *నిఖిలభూతరూప!నిరుపమ!ఈశ! ప*
               *రాపరాత్మమహిత!యమిత చరిత!*

దీపావళి శుభాకాంక్షలతో

వైద్యంవేంకటేశ్వరాచార్యులు‌. మీభాగవత శ్రీచరణ రేణువు
                     వైద్యంవేంకటేశ్వరాచార్యులు‌🙏