Tuesday, October 8, 2019

*-:విజయదశమి శుభాకాంక్షలు:-*

విజయదశమి నాడు ఆచరించవలసిన కృత్యాలలో భాగంగా నక్షత్రోదయ సమయంలో జమ్మిచెట్టు వద్ద అపరాజితాదేవిని ఆరాధించడంతోబాటుగా  పాలపిట్ట దర్శనం చేసుకోవడం కూడా ఆచారం ఉన్నది,కొన్ని ప్రాంతాలలో జమ్మి ఆకులను బంగారంగా భావించి వీటితోబాటుగా ఆరే ఆకులను, కొంత ధనాన్ని పరస్పరం ఇచ్చిపుచ్చుకుని  పెద్దల ఆశీస్సులందుకంటారు.
🎄🌲🌳🌴🌱🌿☘🍀🍃🎋

జమ్మిచెట్టు దర్శన సమయంలో చదవ వలసిన శ్లోకాలు:-

*శమీ శమయతే పాపం*
       *శమీ శత్రు  వినాశినీ।*
  *అర్జునస్య ధనుర్థారీ*
       *రామస్య ప్రియదర్శినీ॥*

*ఆరరాజ మహారాజ*
       *వనరాజ వనస్పతే।*
  *ఇష్టదర్శన మృష్టాన్న*
       *కష్ట దారిద్ర్య నాశనీ॥*

*శమీం కమలపత్రాక్షీం*
       *శమీం కణ్టకధారిణీం।*
  *ఆరోహతు శమీం లక్ష్మీః*
       *నౄణామాయుష్య వర్ధినీ॥*

*నమో విశ్వాస వృక్షాయ*
       *పార్ధ శస్త్రాస్త్ర ధారిణే।*
  *త్వత్తః పత్రం ప్రతీచ్ఛామి*
       *సదా మే విజయీ భవ॥*

*అమంగలానాం శమనీం*
       *దుష్కృతస్యచ నాశినీం।*
  *దుస్స్వప్ననాశినీం ధన్యాం*
       *ప్రపద్యే~హం సదా శమీమ్॥*

✒ *పులుపుల వేంకట ఫణి కుమార శర్మా*
*వి+జయ+దశ+మి*


ప్రాచీన రుషులు ఏ పేరుని పెట్టినా అందులో గమనించాల్సిన అనేక రహస్యాలు– అక్షరాల్లో, పదాల్లో, పదాల విరుపుల్లో... ఇలా ఉండనే ఉంటాయి. వాటిని తెలుసుకున్న పక్షంలో పండుగలలో దాగిన గొప్పదనం అర్థమై పదికాలాల పాటు మనం ఈ పండుగ సంప్రదాయాన్ని కొనసాగించగలిగిన వాళ్లం– ముందు తరం వాళ్లకి అందజేయగలిగిన వాళ్లం కూడా కాగలం. ఈ దృష్టితో చూస్తే ఈ పండుగ పేరు ‘జయదశమి’ కాదు. విజయ దశమిట.పైగా విజయ ‘దశ’మి ఏమిటి? పదిరోజులపాటు సాగే పండుగట ఇది. మంచిదే! పదిరోజుల పాటే ఉందుకు సాగాలి? సరే! పదిరోజులపాటూ పండుగ చేసుకోకుండా ‘10వ రోజునే ఎందుకు పండుగగా చేసుకోవాలి? ఈ పదిరోజుల్లోనూ మరి మూలా నక్షత్రం రోజున సరస్వతీ పూజా, దుర్గాష్టమి రోజున దుర్గాపూజా కూడా ఉంటూంటే, విజయంమాత్రం 10వ రోజునే వచ్చిందంటూ ‘విజయదశమి’ నాడే విశేష పూజని ఉదయం సాయంకాలాల్లో చేస్తారా? ఎందుకని? ఇలా ఎంతగా ఆలోచించడం మొదలెడితే అంతా ఆశ్చర్యంగానే ఉంటుంది కదా! లోపలికి వెళ్లి రహస్యాలని తెలుసుకుందాం!

జయం వేరు– విజయం వేరు
కేవలం మనకున్న అంగబలంతో (మనుష్యుల సహాయం) అర్ధ (దాడి చేయడానికి కావలసిన ధనం) బలంతో ఎదుటివారి మీదికి వెళ్లి గెలుపుని సాధించగలిగితే– గెలిస్తే దాన్ని ‘జయం’ అనాలంది శాస్త్రం. ఇలా సాధించిన ‘జయం’ ఎప్పుడూ శాశ్వతంగా ఉండదు. ఇది నిజం కాబట్టే ఈ యుద్ధంలో గెలుపుని సాధించిన రాజు పైసారి యుద్ధంలో గెలుపుని సాధించని సందర్భాలెన్నో కనిపిస్తాయి మనకి. అశాశ్వతమైన గెలుపుని ‘జయం’ అనాలంది ధర్మశాస్త్రం. అదే మరి ‘విజయ’ మైతే అది సంపూర్ణం శాశ్వతం కూడా. జయానికీ విజయానికీ మధ్యనుండే తేడా అనేది అంగ బలాన్నీ అర్ధబలాన్నీ మరింతగా సమీకరించుకున్న కారణంగా వచ్చేది కాదు. *‘జయం’* అంటే మనుష్య శక్తితో సాధించబడేదీ, సాధించుకునేదీ. అయితే విజయ మనేది మనకి రాబోతున్న గెలుపుకి భగవంతుని అనుగ్రహం తోడైతే లభించేది ఔతుంది.

మనకి కావలసిన అన్ని శక్తులూ ఉన్నా భగవంతుని అనుగ్రహం లేని పక్షంలో మనకి కలిగే గెలుపు సంపూర్ణం శాశ్వతం కానే కాదు. ఇది నిజం కాబట్టే అర్జునునికి ఉన్న పేర్లలో ఒకటి ‘విజయు’డనేది. అంటే ఎల్లకాలమూ అతనికి భగవదనుగ్రహం ఉంటూనే ఉంటుంది సుమా! అని తెలియజెప్పడమన్నమాట. ఆ కారణంగానే అర్జునుని కంటె గొప్పవాళ్లైన ఏకలవ్యుడూ కర్ణుడూ కూడా అతణ్ణి గెలవలేకపోయారు. పైగా ఏవేవో కారణాల వల్ల ఓడిపోయారు కూడా. మళ్లీ ఇదే అర్జునునికి, భగవదనుగ్రహమనేది ఆ భగవంతుడైన శ్రీకృష్ణుడు ఈ లోకాన్ని వీడి వెళ్లినప్పుడు (నిర్యాణమైనప్పుడు) ఉండే వీలే లేకపోయింది. ఆ కారణంగానే అంతఃపుర కాంతలందరికీ రక్షణగా ఉంటూ ఆ స్త్రీలని తెస్తూన్న సందర్భంలో దోవలు కొట్టేవాళ్లంతా అర్జునుని మీద తిరగబడి అర్జునుణ్ణి కావడి బద్దలతో మోదారు. అంటే ఏమన్నమాట? కృష్ణుడున్నంతకాలమే అర్జునునికి ఆ శక్తి ఉండి ‘విజయు’డయ్యాడు. ఆయన గతించాక అర్జునుడు కేవలం ‘పార్థునిగా’నే (కుంతీదేవి పుత్రునిగా మాత్రమే) అయిపోయాడు.

కాబట్టి జయమంటే గెలుపు– విజయమంటే భగవంతుని కృపానుగ్రహాల కారణంగా లభించిన గెలుపని అర్థమన్న మాట! అందుకే సంప్రదాయం తెలిసిన ఎవరికైనా ముఖ్యమైన పని మీద వెళ్తున్నామంటూ చెప్పి పాదాభివందనాన్ని చేస్తే– ‘జయోస్తు’ అనరు. ‘విజయోస్తు’ అనే ఆశీర్వదిస్తారు. ‘నీకు గెలుపు లభించుగాక! దానికి పరమేశ్వరుని అనుగ్రహం ఉండుగాక! ఆ కారణంగా నీది శాశ్వతమైన గెలుపుగా మారుగాక!’ అని దాని అర్థమన్నమాట.

తనంత తానుగా ఆ అమ్మే ఓ దేవత అవుతూంటే, మళ్లీ ఆమెకి గెలుపుకోసం మరో దేవతానుగ్రహం కావాలా? అప్పుడే కదా ఆమె జయం– విజయం– ఔతుంది? ఇదేమిటనిపిస్తుంది.
రాక్షసులూ దేవతలూ అనే ఇద్దరూ ఆయా స్థానాలని పొందింది కేవలం తమకి తాముగా ఆచరించిన తపస్సు వల్లనే. అంటే సాధించిన తపశ్శక్తి కారణంగానే.ఈ నేపథ్యం లో రాక్షసులు ఎక్కడ దేవతలని జయించలేమో? అనే దృష్టితో మరింత మరింత తపస్సుని చేశారు. వాళ్లు ఎంత స్థాయి తపస్సుని చేశారంటే– తానొక్కతే గాని వెళ్లి యుద్ధానికంటూ దిగితే చాలనంత. దాంతో ఆమె *గణపతి నుండి పాశాన్నీ, కుమారస్వామి నుండి శక్తి ఆయుధాన్నీ, తన భర్త శంకరుని వద్దనుండి శూలాన్నీ, శ్రీ మహావిష్ణువు నుండి చక్రాన్నీ...* ఇలా ఇన్నింటినీ ధరించి (8మంది దేవతల నుండి 8 తీరుల తపశ్శక్తిని ఆయుధాల రూపంలో స్వీకరించి అష్టభుజిగా) ఆమె రోజుకొక్క రాక్షసుణ్ణి చొప్పున వధించుకుంటూ వచ్చి  9 మంది రాక్షసులని వధించాక 10 రోజున 10వ రాక్షసుడైన మహిషుణ్ణి వధించింది. ఇలా 9 దాటి 10 వ వధ కాబట్టీ, విజయాన్ని సాధించిన 10వ రోజు కాబట్టీ ‘విజయదశమి’అయింది.
అది 10 (దశ)కున్న గొప్పదనం.
10 అనేది పూర్ణసంఖ్య. తన వెనుక 9 ఇంటిని అండగా కలిగిన సంఖ్య.

దిక్కుల సంఖ్య 10. తూర్పు దక్షిణ పశ్చిమ ఉత్తరాలు నాలుగూ, ఈశాన్య ఆగ్నేయ నిరృతి వాయవ్యమనే విదిక్కులూ (దిక్కుకీ దిక్కుకీ మధ్యన ఉండేవి) నాలుగు, పైనా కిందా అనే రెండూ కలిపి 10 మాత్రమే.
శ్రీ హరి ఈ లోకంలో ఉన్న అందరినీ (84 లక్షల జీవరాశుల్ని) రక్షించే నిమిత్తం ఎప్పటికి ఏది అవసరమో గమనించి అప్పటికి ఆ అవతారాన్నెత్తుతూ క్రమంగా మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన పరశురామ శ్రీరామ బలరామ కృష్ణ అనే 9 అవతారాలని ముగించి ఇక తప్పదనే దృష్టితో ‘కల్కి’ అవతారాన్నెత్తి మొత్తం అందర్నీ సంహరించి యుగానికి ముగింపుని 10వ అవతారంతోనే చేశాడు.
పది తర్వాత అంకెలన్నిటిలోనూ పది అంకె ప్రవస్తావన ఉంటూనే ఉంటుంది. ఏకాదశి (1+10=11), ద్వాదశ (2+10=12) త్రయోదశ (3+10=13) చతుర్దశ (4+10=14)... ఈ తీరుగా ఉంటూనే ఉంటుంది.

వ్యక్తి శరీరం కూడా బాల్యం– బుద్ధిబలం– శరీరబలం – కంటిబలం తగ్గడం– శుక్రశక్తి తగ్గడం– రక్తం తగ్గడం– మానసిక ధైర్యం తగ్గడం– శరీరం స్పర్శనీ, కళ్లు చూపునీ, చెవులు వినికిడినీ, ముక్కు వాసననీ, నాలుక రుచినీ కోల్పోతుంది ప్రతి పదేళ్లకీ. (1 నుండి 10 వరకూ బాల్యం, 11 నుండి 20 వరకూ బుద్ధిబలం... ఇలా ఎదిగిన శరీరం తగ్గుదలవైపుకి వెళ్తూ 91 నుండి 100కి అన్ని అవయవాల దిగుదలకీ వ్యక్తి గురవుతూ ఉంటే ఇక్కడ కూడా ప్రాధాన్యం 10 కే కదా!

కేవలం ఓటమి అనేదే లేకపోవడం కాదు. పవిత్రత కూడా ఏమాత్రమూ చెడకపోవడం ఉంటుంది ఈ విజయదశమి రోజున. అమ్మవారు ఈ విజయదశమి రోజునజమ్మిచెట్టు నీడన ఉంటుంది. జమ్మిచెట్టునే సంస్కృతంలో శమీ అంటారు. లోకంలో ఎక్కడైనా అపవిత్రత అనేది ఉండే చోటుగా శ్మశానాన్ని చెప్తారెవరైనా. ఆశ్చర్యకరమైన అంశమేమంటే జమ్మిచెట్టు– అమ్మవారు ఈ విజయదశమి రోజున ఎక్కడ ఏ ప్రదేశంలో ఉంటారో, అది అపరాజితాస్థలం. ఆ జమ్మిచెట్టు మాత్రమే శ్మశాన స్థలాన్ని కూడా పవిత్రీకరించగల శక్తి కలది.  ఈ కారణంగానే అమ్మవారు జమ్మిచెట్టు కింద కూర్చుని దర్శనమిస్తూ– అ– పరాజిత–నని తన గూర్చి మనకి అర్థమయ్యేలా అనుగ్రహిస్తారు అందర్నీ వీరు, వారు అనే భేదం లేకుండా!
ఇంత లోతు అర్థం కల 10వ తిథి అయిన దశమి నాడు అమ్మ రాక్షసులపై విజయాన్ని సాధించింది.అందుకే అపరాజిత ఇంతటి విజయాన్ని సాధించిందీ, 9 దాటి 10వ నాడు విజయ రహస్యాన్ని మనకందించిందీ అమ్మ కాబట్టే ఆమెకి ఈ విజయదశమి నాటి పేరు ఆమె చేసి నకృత్యాలని బట్టి– అ– పరాజిత– అని. పరాజయం (ఒటమి) అనేదే ఎరుగని తల్లి– లేని తల్లి. (న+ పరాజిత= అపరాజిత)
*తన్నో దుర్గిః ప్రచోదయాత్‌!*

 డా. మైలవరపు శ్రీనివాసరావు
*సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్వార్ద సాధికే*
*శరణ్యేత్ర్యంబకే గౌరీ నారాయణీ నమోస్థుతే*

        

Monday, October 7, 2019

లలితాసహస్రనామ స్త్రోత్ర ఫలితం
లలితా సహస్రనామ స్తోత్రం వ్యాస ప్రోక్తం కాదు. అది సాక్షాత్తు లలితాదేవి యొక్క అనుగ్రహం చేత ఆమె యొక్క ఆజ్ఞ చేత వశిన్యాది దేవతలు పలికితే ఈ స్తోత్రం ప్రచారం లోకి వచ్చింది. ఈ నామాలని ఎవరు అనుసంధానం చేస్తారో ఎవరు ప్రతిరోజు ఈ లలిత సహస్ర స్తోత్రాన్ని చదువుతూ ఉంటారో వారి యందు నాకు ప్రీతి కలిగి వారికి సంబంధించిన సమస్త యోగక్షేమాలను తానే స్వయంగా విచారణ చేస్తాను అని అమ్మవారు ఆనాడు ప్రతిన పూనింది. కాబట్టి కలియుగంలో మనకి లలిత సహస్రనామం వంటి సహస్రనామ స్తోత్రం లభించడం కేవలం భగవంతుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణం తప్ప అన్యము కాదు. ఇది తల్లి యొక్క పూర్ణానుగ్రహముగా మనకు అందినటువంటి స్తోత్రం.
నామము అంటే పేరు. లలితా సహస్రనామ స్తోత్రము అని ఒక మాట అంటున్నాం.....కానీ బాహ్యంలో అది రహస్య నామా స్తోత్రం అనే విషయాన్ని కాసేపు పక్కన పెట్టండి. లలితా సహస్రనామ స్తోత్రం అని అవసరం అవతుందా!!! ఆవిడ పేరు లలిత అయతే ఆవిడని సహస్రము అంటే అనంతము అని పేరు. అనంతము అంటే లెక్కపెట్టలేనన్న్ని. సహస్ర శీర్ష వదనా సహస్రాక్షీ సహస్రపాత్‌ అంటే ఖచ్చితంగా లెక్కపెట్టడానికి 1000 తలకాయలు ఉన్నది అని కాదు దాని అర్ధం. అనంతమైన తలలు కలిగినది అని. అనంతమైన నామములు ఎందుకు ఉండాలి?? ఒక రూపం ఏర్పడితే ఆ రూపాన్ని గుర్తుపట్టి పిలవడానికి ఒక నామం అవసరం.
మనసుతో పలకాలి:
లలితా సహస్రనామ స్తోత్రం చదవడం అంటే లలితా సహస్రనామ స్తోత్రం కొన్నాళ్ళకి నోటికి వచ్చేసి అప్పచెప్పేయడము కాదు. లలితా సహస్రనామ స్తోత్రం చదివేటప్పుడు ఒక్కొక్క నామం చెప్తున్నప్పుడు ఒక్కొక్క గుణం ప్రకాశించినటువంటి కారణం చేత మననస్సును హత్తుకుని నిలబడి పోవాలి.
భవానిమాతే లలితాదేవి:
ఎరుపు రంగు దుస్తులు కట్టు కొన్న, ప్రేమమయ చూపులు కలిగిన పాశము, అంకుశం, పుష్పం చెరకు గడను నాలుగు చేతులలో ధరించిన అణిమాది సిద్ధులను కలిగిన శివుని భార్య అయిన భవానియే లలిత. రావణుని చంపాలంటే ఆదిత్య హృదయం పారాయణం చేస్తేనే సాధ్యం. ఆ మహామంత్రాన్ని శ్రీరాముడికి చెప్పిన వారు అగస్త్య మహాముని. అటు వంటి అగస్త్య మహాముని ఆత్మతత్వమును తెలుసుకోవాలను కుంటాడు. ఆ విషయం ఎంత త్వరగా తెలుసుకుంటే జీవుడు అంత త్వరగా పరమాత్మను చేరుకుంటాడు. జనన మరణ జంఝాటం నుండి తప్పించుకోగలుగుతాడు. అందుకుగాను అగస్త్య మహాముని శ్రీలలితను స్మరించేందుకు నామతారకమును అనుగ్రహించవలసినదిగా హయగ్రీవుడిని కోరుతాడు. ఏ పేరిట పిలిస్తే, ఆ తల్లి పలుకు తుందో ఆ పేర్లన్నీ హయగ్రీవుని అశ్వకంఠముతో ఆశువుగా వస్తాయి. ఈనామ సహస్రమే లలితా సహస్రం. ఇవి వేయినామాలు. ఇందులో కామాక్షి, పార్వతి, దుర్గ, మహాకాళి, సరస్వతి, భవాని, నారాయణి, కల్యాణి, రాజరాజేశ్వరి మహాత్రిపురసుందరి, వైష్ణవి, మహేశ్వరి, చండికా, విశాలాక్షి, గాయిత్రి అనేక దేవి రూపాలు కనపడతాయి. శ్రీలలితా సహస్రనామములు కేవలం స్తోత్రం కాదు. ఇది గొప్ప శాస్తము,గొప్ప ప్రమాణం.
183 శ్లోకములలో చెప్పబడినది:
ఈ వేయినామాలు 183 శ్లోకములలో చెప్పబడినవి. శ్రీమాతా అను నామముతో మొదలై లలితాంబికా అనునామముతో పూర్తవుతుంది. విడివిడిగా చదువుతే ఓం శ్రీమాత్రేనమః అని చదవాలి. అర్థము తెలుసుకునే చదవాలి. అలా వీలుకానప్పుడు నామజపము వలె చదవాలి. ఎలా చదివినా భక్తితో చదివితే పుణ్యం వస్తుంది. శ్రీమాత ఈ నామముతో మొదలవుతుంది. ఈ నామమము వివరణ ఇవ్వబడుతున్నది. శ్రీమాతా శ్రీదేవి మాతృమూర్తి అయి సృష్టికి కారకురాలైనది. తల్లి, తండ్రి, గురువు రూపములోవున్నది. శ్రీఅంటే లక్ష్మి.మాతృ సహజమైన మమకారం అందిస్తుంది. ప్రేమతో కూడిన కాఠిన్యం ప్రదర్శిస్తూ సమస్తప్రాణి కోటిని సరిదిద్దుతుంది. ప్రతినామము ఒక మంత్రం. ఈ నామములు చదివితే వచ్చే ఫలితం క్లుప్తంగా తెలుసుకొందాం. జీవితం తరిస్తుంది. అపమృత్యువు పోతుంది. ఆయుష్షు పెరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. సర్వపాపాలు తొలగిపోతాయి. ఇంతకు మించిన ఆనందం మరొకటి ఉండదు.అందుకే శ్రీలలితా సహస్రనామాలు చదువుదాం ,చదివించుదాం, ముక్తిని పొందుదాం.
(సేకరణ)
శ్రీమాత్రే నమః

శ్రీదేవీ శరన్నవరాత్రులలో అమ్మవారు తోమ్మిదవరోజున *శాక్తేయానుసారము సిద్ధిదాత్రిగా సౌమ్యమున మహిషాసురమర్థని గా దర్శనమిస్తుంది*

*శ్రీ సిద్ధి ధాత్రీ దేవి*

సర్వవిధ సిద్ధులను ప్రసాదించు తల్లిగనుక సిద్ధి దాత్రి. పరమేశ్వరుడు సర్వ సిద్ధులను దేవి కృపవలనే పొందెనని దేవీపురాణమున పేర్కొనబడింది. ఈమె పరమశివునిపై దయదలచి, ఆయన శరీరమున అర్ధబాగమై నిలచెను. సిద్ధిధాత్రీదేవి చతుర్భుజ, సింహవాహన. ఈమె కమలముపై ఆసీనురాలై యుండును. ఈమె కుడివైపున ఒకచేతిలో చక్రమును, మఱొకచేతిలో గదను ధరించును. ఎడమవైపున ఒక కరమున శంఖమును, మఱియొక హస్తమున కమలమును దాల్చును. నిష్ఠతో ఈమెను ఆరాధించువారికి సకలసిద్ధులును కరతలామలకము.

ఈమె కృపచే భక్తులయొక్క, సాధకులయొక్క లౌకిక, పారమార్ధిక మనోరథములన్నియును సఫలములగును. సిద్ధిదాత్రి మాత కృపకు పాత్రుడైన భక్తునకు కోరికలెవ్వియును మిగిలియుండవు. అట్టివానికి భగవతీదేవి చరణ సన్నిధియే సర్వస్వమగును. భగవతీమాత యొక్క స్మరణ ధ్యాన పూజాదికముల ప్రభావము వలన ఈ సంసారము నిస్సారమని బోధ పడును. తన్మహత్వమున నిజమైన, పరమానందదాయకమైన అమృతపదము ప్రాప్తించును.

*శ్లోకం*

సిద్ధగంధర్వయక్షాద్యై, అసురైరమరైరపి
సేవ్యమానాసదా భూయాత్‌ సిద్ధిదా సిద్ధిదాయినీ

*శ్రీ మహిషాసురమర్థిని దేవి*

అమ్మవారి నవఅవతారాల్లో మహిషాసురమర్దినీదేవిని మహోగ్రరూపంగా భావిస్తారు. దేవీనవరాత్రులలో  అమ్మ మహిషాసురుడిని సంహరించిన అశ్వయుజ శుద్ధ నవమిని ‘మహర్నవమి’గా జరుపుకుంటారు. సింహవాహనాన్ని అధిష్టించి ఆయుధాలను ధరించిన చండీదేవి సకల దేవతల అంశలతో మహాశక్తి స్వరూపంగా  మహిషమర్ధనిగా దర్శనమిస్తుంది.

ఈ తల్లిని పూజిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. మహిషాసురమర్దిని ఆరాధన వల్ల భయాలన్నీ తొలగిపోతాయి. సర్వకార్యాల్లో విజయం సిద్ధిస్తుంది.

అమ్మవారికి చండీసప్తి పారాయణ.. హోమం జరిపి.. గారెలు,పానకం,వడపప్పు నివేదన విశేషం..

*మహిషమస్తక నృత్తవినోదిని,
స్ఫుటరణన్మణి నూపుర మేఖలా
జననరక్షణ మోక్షవిధాయినీ,
జయతి శుంభనిశుంభ నిషూదినీ*🌹🌹🌸🌸🌸🙏🙏🙏💐💐

Sunday, October 6, 2019

AMBA AKSHARAMALA

మహా మృత్యుంజయ మంత్ర విశిష్టత

మీరు తెలుసుకోండి , మీకు తెలిసిన వారికి తెలియజేయండి , అందరికీ తెలిసేందుకు దయచేసి షేర్ చేయండి . మీకు తెలిసిన పెద్దవారికి , దర్శించే వీలు లేని వారికి చూపించండి , ఇవి చదవలేని వారికీ తెలియజేయండి. దేవుడు ఎలా అనుగ్రహిస్తాడో , ఎప్పుడు దర్శనభాగ్యం కలిగిస్తాడో,ఏ సాధన సూచిస్తాడో మన ఊహకు అందదు.అందరికీ దర్శనభాగ్యం కలగాలి , ఆధ్యాత్మిక విషయాలు తెలియజేయాలన్నదే " సంభవామి యుగే యుగే "ఫేస్ బుక్ పేజీ ద్వారా మా ప్రయత్నం...

త్ర్యంబకం యజామహే
సుగంధిం పుష్టివర్థనం
ఉర్వారుక మివ బంధనాత్
మృత్యోర్ముక్షీయ మామృతాత్

ఈ మహా మృత్యుంజయ మంత్రాన్ని జపించడం వల్ల, దైవ ప్రకంపనలు మొదలై, మనలను ఆవరించి ఉన్న దుష్టశక్తులను తరిమికొడతాయి. తద్వారా మంత్రాన్ని పఠించినవారికి ఓ శక్తివంతమైన రక్షణ కవచం ఏర్పడుతుంది. ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు, దురదృష్టాల నుంచి బయటపడేందుకు,మహా మృత్యుంజయ మంత్రాన్ని పఠిస్తుంటారు. ఈ మంత్రానికి సర్వరోగాలను తగ్గించే శక్తి ఉంది.

ఈ మహామృత్యుంజయ మంత్రానికి మార్కండేయ మంత్రం అనే పేరు కూడా ఉంది. మార్కండేయుడు ఈ మంత్రమును పఠించి, మృత్యువు నుంచి బయటపడ్డాడని ప్రతీతి. ఇంకా పరమశివుని రుద్రస్వభావాన్ని సూచిస్తూ ఈ మంత్రం రుద్రమంత్రమని, ఆ స్వామి మూడు కన్నులను సూచిస్తూ మృతసంజీవనీ మంత్రమని పిలువబడుతోంది.
ఈ మంత్రాన్ని త్ర్యంబక మంత్రమనడంలో కూడా ఎంతో గూఢార్థం ఉంది. శివతత్వంలో "మూడు" కు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఆ స్వామి త్రినేత్రుడు, త్రిగుణాకారుడు, త్రి ఆయుధుడు, త్రిదళాలతో కూడిన బిల్వాలను ఇష్టపడేవాడు, మూడు అడ్డురేఖలను నామంగా కలిగినవాడు, త్రిజన్మ పాప సంహారుడు, త్రిశూలధారుడు, త్రికాలధిపతి, త్రిలోకరక్షకుడు, మరి ఆస్వామి మంత్రాన్ని జపించితే మనకు రక్షణ లభించకుండా ఉంటుందా? అందులో సందేహమేముంది. ఈ మహామృత్యుంజయ మంత్రాన్ని ప్రాత: కాలన్నే 108 సార్లు, ప్రదోషకాలంలో 108 సార్లు పఠిస్తే ఎటువంటి రోగాలు దరిచేరవు. ఈ మంత్రం యొక్క గూఢార్థాన్ని తెలుసుకున్నప్పుడు మనకు అపరిమితానందం కలుగుతుంది.
ఓం: భగవంతుడు ప్రప్రథమంగా సూక్ష్మ జ్యోతిగా వెలుగొంది, అనంతరం చెవులకు వినబడేట్లుగా ఓ నాదం వినబడిందనీ, ఆ నాదమే ప్రణవ నాదమని, అదే ఓంకారమని చెప్పబడింది. ఇదొక శక్తి స్వరూప ధ్వని. అ-ఉ-మల సంగమమమే ఓంకారం. ఋగ్వేదం నుండి ' అ ' కారం. యజుర్వేదం నుండి ' ఉ ' కారం, సామవేదం నుండి ' మ ' కారాలు పుట్టి,ఆ మూడింటి సంగమంతో ' ఓంకారం ' ఉద్భవించింది. ఓంకారానికి మూలం నాదం. ఆ నాదం భగవద్రూపం. ఓంకారం ప్రార్థనగా మనకు ఉపకరిస్తుటుంది. అందుకే ప్రతి మంత్రం ఓంకారంతో ప్రారంభమై ఓంకారంతోనే ముగుస్తుంటుంది. నామం శబ్ద ప్రతీక. సర్వ శబ్దాలను తనలో నిమగ్నం చేసుకునే శబ్దాక్షరం ఓంకారం. కాబట్టి ప్రతి మంత్రానికి ఓంకారం ముందుండి, ఆ మంత్రానికి శుభాన్ని, మంగళాన్ని చేకూర్చుతుంది. అందుకే దేహద్వారాలైన ఇంద్రియాలన్నిటినీ నిగ్రహించి, మనస్సును స్థిరపరచుకుని, యోగధారణ బలంతో ప్రాణశక్తిని సహస్రారంలో నిలిపి, పరబ్రహ్మ స్వరూపమైన ప్రణవాన్ని ఉచ్ఛరిస్తూ పరమాత్మను స్మరించాలి.

త్ర్యంబకం: భూత, భవిష్యత్, వర్తమానాలకు శివుని మూడవ నేత్రం ప్రతిరూపం. ఇంద్ర, అగ్ని, సామతత్వాలను కలిగి ఉన్నందున శివుడు త్రినేత్రుడనబడుతున్నాడు. త్ర్యంబక మంటే మూడు నేత్రాలని అర్థం. శివుని భ్రూమధ్యంలో నున్న సూక్ష్మరూప నేత్రం మూడవ నేత్రం. ఇది అతీంద్రియ శక్తికి మహాపీఠం. దీనినే జ్యోతిర్మఠం అని అంటారు. శివుని మూడవ నేత్రానికి దాహకశక్తి, సంజీవన శక్తి రెండూ ఉన్నాయి. ఆ స్వామి తన ప్రసన్నవదనంతో, చల్లని చూపులతో మనలను సదా రక్షిస్తున్నాడు. అందుకే ఆ స్వామిని త్యంబకం అని కీర్తిస్తున్నాం.

యజామహే: అంటే ద్యానిస్తున్నానని అర్థం. అంతేగా మరి. సర్వవేళలా మనకు రక్షగా ఉన్న స్వామిని మనస్ఫూర్తిగా ధ్యానించాలి. ఒకప్పుడు సముద్ర మథనం జరిగింది. అకస్మాత్తుగా సెగలు కక్కుతూ హాలాహలం పైకి వచ్చింది. ఆ విష్పు ప్రచండ జ్వాలలకు సమస్తలోకాలు తల్లడిల్లిపోయాయి. సర్వత్రా ఆర్తనాదాలు…హాహాకారాలు. సమస్తలోకజనం ఆ స్వామిని ధ్యానించగా, ఆ దృశ్యాన్ని చూసి క్రిగిపోయిన స్వాఇ, హాలాహలన్ని తన కంఠంలో నిలుపుకుని నీలకంఠుడై సమస్తలోకాలను కాపాడాడు. ఆ స్వామిని ప్రార్థిద్దాం.

సుగంధిం: సు-మంచిదైన, గంధ – సువాసన ద్రవ్యం. ఆ స్వామి మనపై మంచి సువాసనలతో కూడుకున్న గంధం నలుదిశలా పరిమళాలను వెదజల్లినట్లు మనలను తన భక్త జన వాత్సల్యమనే సుగంధాన్ని ఇచ్చి పెంచుతున్నాడు. ఆయనకు తన పిల్లలమైన మన పట్ల అలవికానంత ప్రేమ, వాత్సల్యం, ఆయన ఎంత భక్తజన ప్రియుడంటే, ఆ స్వామిని పూజించడానికి మందిరం కావాలని ఆడగడు. చెట్టుకింద, గట్టుమీద ఎక్కడైనా ఆయన లింగరూపాన్ని పెట్టుకుని పూజించవచ్చు. ఆయనకు నైవేద్యం కూడా అవసరం లేదు. ఒక బిల్వపత్రం, ఒక కొబ్బరికాయ, జలాభిషేకం చేసినా స్వామి సంతోషించి మన కోరికలను నెరవెరుస్తాడు.

పుష్టివర్థనం : మనం పుష్టిగా ఉండేట్లు సాకుతున ఆ స్వామి సర్వత్రా నెలకొనిఉన్నాడు. సృష్టియావత్తు ఆయన ఆధీనంలో ఉంది. ఆయన మనలను తప్పక కాపాడుతాడు. ఇందుకు గుహుని కథే ఒక ఉదాహరణ. గుహుడనే వేటగాడు ఒకరోజున ఏదైనా జంతువును వేటాడాలని వెదికి వెదికి విసిగి పోయాడు. చీకటి పడుతున్నా అతని కంట ఒక జంతువు కూడ కనబడలేదు. ఈలోపు ఎక్కడి నుంచో ఒక పులి వచ్చి అతడిని వెంబడించసాగింది. దాని బారి నుంచి తప్పుకోవడానికై వేటగాడు పరుగులు పెడుతూ ఒక చెట్టుపైకి ఎక్కాడు. అయినా ఆ పులి అతడిని వదల్లేదు. చెట్టుకిందే ఉన్న పులి గుహుడు ఎప్పుడు దిగి వస్తాడా అని కాపుకాయసాగింది. గుహుడు ఎక్కిన చెట్టు ఒక మారేడు చెట్టు. ఏమీ తోచక ఒక్కొక్క మారేడు దళాన్ని కిందికి తుంపి విసిరేయసాగాడు. ఆ దళాలు చెట్టు మొదట్లో నున్న శివలింగంపై పడసాగాయి. ఆరోజు శివరాత్రి కూడా. పులిభయంతో వేటగాడు, వేటగానిని తినాలన్న కాంక్షతో పులి, జాగరణ చేయడంతో, శంకరుడు రెండు జీవాలకు మోక్షాన్ని ప్రసాదించాడు. అందుకే సర్వ వ్యాపకుడైన ఆ స్వామి మనలను కంటికి రెప్పలా కాపాడుతుంటాడు.
ఉర్వారుకం – ఇవ – బంధనం : దోసకాయ పక్వానికి వచ్చినపుడు, దానికి తొడిమ నుంచి విముక్తి లభించినట్లుగానే ఆ స్వామి మనలను అన్ని సమస్యల నుంచి గట్టెక్కించుతాడు.

మృతోర్ముక్షీయ: అలా సమస్యల నుంచి గట్టెక్కించే స్వామిని, మనలను మృత్యువు నుంచి కూడ రక్షణ కల్పించమని కోరుకుంటున్నాం. మృత్యువు అంటే భౌతికపరమైన మరణం మాత్రమేకాదు. ఆధ్యాత్మికపరంగా చేతనం లేకుండా ఉండటం కూడా మృత్యు సమానమే. భక్తి ప్రవత్తులు లేని జీవనం కూడా నిర్జీవమే.
ప్రకృతిలో అందాన్ని ఆస్వాదించలేక అంతా వికారంగా ఉందనుకునేవారికి, అంతా వికారంగానే కనబడుతుంది. ప్రతి విషయానికి సందేహపడే సదేహప్రాణికి అంతా అనుమానమయంగానే ఉంటుంది. ఇటువంటి వన్నీ చావువంటివే. ఇలా మనలను అన్నిరకాల మరణాల నుంచి విముక్తులను చేసి, మన జీవితాలను సంతోషమయం చేయమని స్వామిని ప్రార్థిస్తున్నాం మనం.

అమృతాత్ : స్వామి అల్ప సంతోషి, సులభప్రసన్నుడు. అందుకే శ్రీనాథమహాకవి ఆయనను ఈ క్రింది విధంగా స్తుతించాడు.
శివుని శిరమున కాసిన్ని నీళ్ళు జల్లి
పత్తిరిసుమంత నెవ్వడు పార వైచు
కామధేను వతడింట గాడి పసర
మల్ల సురశాఖి వానింట మల్లె చెట్టు
శివలింగంపై కాసిని నీళ్ళు చల్లి, మారేడు పత్రిని లింగంపై విసిరేసినప్పటికీ, ఆ భక్తుని ఇంట కామధేనువు ఇంటి పశువుగా మారుతుంది. కల్ప తరువు ఆ భక్తుని ఇంట మల్లెచెట్టుగా ఉంటుంది. అంతటి దయామయుడు పరమశివుడు.

మనకున్న చిరంజీవులలో ఆంజనేయస్వామి ఒకరని మనకు తెలుసు. అయితే ఆ ఆంజనేయునికి చిరంజీవత్వాన్ని ప్రసాదించింది శివుడే. ఆ కథ ప్రకారం,
రావణ వథానంతరం అయోధ్యకు చేరుకున్న రామ చంద్రుడు ప్రజారంజకంగా పరిపాలన గావిస్తున్నాడు. ఒకరోజు అగస్త్యమహర్షి తదితరులు శ్రీరామచంద్ర మూర్తిని దర్శించుకుని హనుమంతుని ప్రశంసించ సాగారు. అప్పుడు శ్రీరాముడు, మహావీరుడైన లక్ష్మణుని ప్రశంసింపక, ఎందుకు హనుమంతుని పొగుడుతున్నారని అడిగాడు. అప్పుడు అగస్త్యాది మునులు, హనుమంతుడు రుద్రాంశ సంభూతుడని, హనుమంతునితో సరితూగగల బలపరాక్రమ వంతులు ఎవరూ లేరని, అతని బలం గురించి అతనికి తెలియకపోవడమే శాపమని, అందుచేతనే అతడు వాలిని సంహరించలేకపోయాడని చెప్పారు. అలాగే నూరు యోజనాలు దాటి లంకను చేరడం, అతి చిన్న రూపాన్ని ధరించడం, సీతమ్మవారిని దర్శించడం, లంకాదహనం వంటివన్నీ సామాన్యులు చేయలేరని చెప్పారు. అదేవిధంగా బాల హనుమ, సూర్యుని చూసి ఎగిరి వెళ్ళి, ఇంద్రుని వజ్రాయుధ ఘాతానికి గురై భూమిపై పెడతాడు. అప్పుడు ఆంజనేయుని తండ్రి వాయుదేవుడు కుమారుని ఉజ్జయినికి తీసుకెళ్ళి శివార్చన చేసి, శివుని కరుణతో బాల ఆంజనేయుడు చిరంజీవిగా ఉండేట్లు వరాన్ని పొందాడు. ఇప్పటికీ మనం ఉజ్జయినిలో ఆంజనేయునికి చిరంజీవత్వాన్ని అనుగ్రహించిన హనుమత్కేశ్వర లింగాన్ని చూడగలం. ఈ విధంగా స్వామి తన భక్తులను మృత్యువు నుంచి కాపాడి, ఆయురారోగ్యాలతో కూడిన జీవితాన్ని ప్రసాదిస్తాడు.

ఈ మృత్యుంజయ మంతాన్ని శ్రద్ధతో పఠిస్తే, అకాలమృత్యువులు, ప్రమాదాల నుంచి రక్షణ లభిస్తుంది. ఇంత మహిమాన్వితమైన మహామృత్యుంజయ మంత్రాన్ని జపించడం వల్ల, దైవిక ప్రకంపనలు మన చుట్టూ ఆవరించి, సమస్త దుష్ట శక్తులు మన దరికి చేరకుండా కాపాడబడతాము.
మృత్యుర్యస్వాప సేచనం అని శ్రుతులు చెబుతున్నాయి. అంటే మృత్యువు శివునికి ఊరగాయ వంటిదని అర్థం. మృత్యువును జయించాలనుకునే వ్యక్తులు పరమశివుని రక్షణకోరితే సరిపోతుందని ఋగ్వేదం అంటున్నది. తనను ఆశ్రయించేవారి యొక్క మృత్యువును నివారించేవాడు కాబట్టి శివుడు మృత్యుంజయుడు అని కూడ పిలువబడుతున్నాడు. ఎవరైతే పుణ్యభీతితో శివుని ఉపాసిస్తారో, వారికి ఆ జన్మలోనే కర్మసంచయాన్ని (ఆగామితో సహా) పటాపంచలు చేసే శక్తిని శివుడు ప్రసాదిస్తాడు. అందుకు మృత్యుంజయ మంత్రాన్ని శ్రద్ధగా పఠించి ఆయురారోగ్యాలను పొందుదాం.

అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ