Sunday, October 6, 2019

మహా మృత్యుంజయ మంత్ర విశిష్టత

మీరు తెలుసుకోండి , మీకు తెలిసిన వారికి తెలియజేయండి , అందరికీ తెలిసేందుకు దయచేసి షేర్ చేయండి . మీకు తెలిసిన పెద్దవారికి , దర్శించే వీలు లేని వారికి చూపించండి , ఇవి చదవలేని వారికీ తెలియజేయండి. దేవుడు ఎలా అనుగ్రహిస్తాడో , ఎప్పుడు దర్శనభాగ్యం కలిగిస్తాడో,ఏ సాధన సూచిస్తాడో మన ఊహకు అందదు.అందరికీ దర్శనభాగ్యం కలగాలి , ఆధ్యాత్మిక విషయాలు తెలియజేయాలన్నదే " సంభవామి యుగే యుగే "ఫేస్ బుక్ పేజీ ద్వారా మా ప్రయత్నం...

త్ర్యంబకం యజామహే
సుగంధిం పుష్టివర్థనం
ఉర్వారుక మివ బంధనాత్
మృత్యోర్ముక్షీయ మామృతాత్

ఈ మహా మృత్యుంజయ మంత్రాన్ని జపించడం వల్ల, దైవ ప్రకంపనలు మొదలై, మనలను ఆవరించి ఉన్న దుష్టశక్తులను తరిమికొడతాయి. తద్వారా మంత్రాన్ని పఠించినవారికి ఓ శక్తివంతమైన రక్షణ కవచం ఏర్పడుతుంది. ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు, దురదృష్టాల నుంచి బయటపడేందుకు,మహా మృత్యుంజయ మంత్రాన్ని పఠిస్తుంటారు. ఈ మంత్రానికి సర్వరోగాలను తగ్గించే శక్తి ఉంది.

ఈ మహామృత్యుంజయ మంత్రానికి మార్కండేయ మంత్రం అనే పేరు కూడా ఉంది. మార్కండేయుడు ఈ మంత్రమును పఠించి, మృత్యువు నుంచి బయటపడ్డాడని ప్రతీతి. ఇంకా పరమశివుని రుద్రస్వభావాన్ని సూచిస్తూ ఈ మంత్రం రుద్రమంత్రమని, ఆ స్వామి మూడు కన్నులను సూచిస్తూ మృతసంజీవనీ మంత్రమని పిలువబడుతోంది.
ఈ మంత్రాన్ని త్ర్యంబక మంత్రమనడంలో కూడా ఎంతో గూఢార్థం ఉంది. శివతత్వంలో "మూడు" కు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఆ స్వామి త్రినేత్రుడు, త్రిగుణాకారుడు, త్రి ఆయుధుడు, త్రిదళాలతో కూడిన బిల్వాలను ఇష్టపడేవాడు, మూడు అడ్డురేఖలను నామంగా కలిగినవాడు, త్రిజన్మ పాప సంహారుడు, త్రిశూలధారుడు, త్రికాలధిపతి, త్రిలోకరక్షకుడు, మరి ఆస్వామి మంత్రాన్ని జపించితే మనకు రక్షణ లభించకుండా ఉంటుందా? అందులో సందేహమేముంది. ఈ మహామృత్యుంజయ మంత్రాన్ని ప్రాత: కాలన్నే 108 సార్లు, ప్రదోషకాలంలో 108 సార్లు పఠిస్తే ఎటువంటి రోగాలు దరిచేరవు. ఈ మంత్రం యొక్క గూఢార్థాన్ని తెలుసుకున్నప్పుడు మనకు అపరిమితానందం కలుగుతుంది.
ఓం: భగవంతుడు ప్రప్రథమంగా సూక్ష్మ జ్యోతిగా వెలుగొంది, అనంతరం చెవులకు వినబడేట్లుగా ఓ నాదం వినబడిందనీ, ఆ నాదమే ప్రణవ నాదమని, అదే ఓంకారమని చెప్పబడింది. ఇదొక శక్తి స్వరూప ధ్వని. అ-ఉ-మల సంగమమమే ఓంకారం. ఋగ్వేదం నుండి ' అ ' కారం. యజుర్వేదం నుండి ' ఉ ' కారం, సామవేదం నుండి ' మ ' కారాలు పుట్టి,ఆ మూడింటి సంగమంతో ' ఓంకారం ' ఉద్భవించింది. ఓంకారానికి మూలం నాదం. ఆ నాదం భగవద్రూపం. ఓంకారం ప్రార్థనగా మనకు ఉపకరిస్తుటుంది. అందుకే ప్రతి మంత్రం ఓంకారంతో ప్రారంభమై ఓంకారంతోనే ముగుస్తుంటుంది. నామం శబ్ద ప్రతీక. సర్వ శబ్దాలను తనలో నిమగ్నం చేసుకునే శబ్దాక్షరం ఓంకారం. కాబట్టి ప్రతి మంత్రానికి ఓంకారం ముందుండి, ఆ మంత్రానికి శుభాన్ని, మంగళాన్ని చేకూర్చుతుంది. అందుకే దేహద్వారాలైన ఇంద్రియాలన్నిటినీ నిగ్రహించి, మనస్సును స్థిరపరచుకుని, యోగధారణ బలంతో ప్రాణశక్తిని సహస్రారంలో నిలిపి, పరబ్రహ్మ స్వరూపమైన ప్రణవాన్ని ఉచ్ఛరిస్తూ పరమాత్మను స్మరించాలి.

త్ర్యంబకం: భూత, భవిష్యత్, వర్తమానాలకు శివుని మూడవ నేత్రం ప్రతిరూపం. ఇంద్ర, అగ్ని, సామతత్వాలను కలిగి ఉన్నందున శివుడు త్రినేత్రుడనబడుతున్నాడు. త్ర్యంబక మంటే మూడు నేత్రాలని అర్థం. శివుని భ్రూమధ్యంలో నున్న సూక్ష్మరూప నేత్రం మూడవ నేత్రం. ఇది అతీంద్రియ శక్తికి మహాపీఠం. దీనినే జ్యోతిర్మఠం అని అంటారు. శివుని మూడవ నేత్రానికి దాహకశక్తి, సంజీవన శక్తి రెండూ ఉన్నాయి. ఆ స్వామి తన ప్రసన్నవదనంతో, చల్లని చూపులతో మనలను సదా రక్షిస్తున్నాడు. అందుకే ఆ స్వామిని త్యంబకం అని కీర్తిస్తున్నాం.

యజామహే: అంటే ద్యానిస్తున్నానని అర్థం. అంతేగా మరి. సర్వవేళలా మనకు రక్షగా ఉన్న స్వామిని మనస్ఫూర్తిగా ధ్యానించాలి. ఒకప్పుడు సముద్ర మథనం జరిగింది. అకస్మాత్తుగా సెగలు కక్కుతూ హాలాహలం పైకి వచ్చింది. ఆ విష్పు ప్రచండ జ్వాలలకు సమస్తలోకాలు తల్లడిల్లిపోయాయి. సర్వత్రా ఆర్తనాదాలు…హాహాకారాలు. సమస్తలోకజనం ఆ స్వామిని ధ్యానించగా, ఆ దృశ్యాన్ని చూసి క్రిగిపోయిన స్వాఇ, హాలాహలన్ని తన కంఠంలో నిలుపుకుని నీలకంఠుడై సమస్తలోకాలను కాపాడాడు. ఆ స్వామిని ప్రార్థిద్దాం.

సుగంధిం: సు-మంచిదైన, గంధ – సువాసన ద్రవ్యం. ఆ స్వామి మనపై మంచి సువాసనలతో కూడుకున్న గంధం నలుదిశలా పరిమళాలను వెదజల్లినట్లు మనలను తన భక్త జన వాత్సల్యమనే సుగంధాన్ని ఇచ్చి పెంచుతున్నాడు. ఆయనకు తన పిల్లలమైన మన పట్ల అలవికానంత ప్రేమ, వాత్సల్యం, ఆయన ఎంత భక్తజన ప్రియుడంటే, ఆ స్వామిని పూజించడానికి మందిరం కావాలని ఆడగడు. చెట్టుకింద, గట్టుమీద ఎక్కడైనా ఆయన లింగరూపాన్ని పెట్టుకుని పూజించవచ్చు. ఆయనకు నైవేద్యం కూడా అవసరం లేదు. ఒక బిల్వపత్రం, ఒక కొబ్బరికాయ, జలాభిషేకం చేసినా స్వామి సంతోషించి మన కోరికలను నెరవెరుస్తాడు.

పుష్టివర్థనం : మనం పుష్టిగా ఉండేట్లు సాకుతున ఆ స్వామి సర్వత్రా నెలకొనిఉన్నాడు. సృష్టియావత్తు ఆయన ఆధీనంలో ఉంది. ఆయన మనలను తప్పక కాపాడుతాడు. ఇందుకు గుహుని కథే ఒక ఉదాహరణ. గుహుడనే వేటగాడు ఒకరోజున ఏదైనా జంతువును వేటాడాలని వెదికి వెదికి విసిగి పోయాడు. చీకటి పడుతున్నా అతని కంట ఒక జంతువు కూడ కనబడలేదు. ఈలోపు ఎక్కడి నుంచో ఒక పులి వచ్చి అతడిని వెంబడించసాగింది. దాని బారి నుంచి తప్పుకోవడానికై వేటగాడు పరుగులు పెడుతూ ఒక చెట్టుపైకి ఎక్కాడు. అయినా ఆ పులి అతడిని వదల్లేదు. చెట్టుకిందే ఉన్న పులి గుహుడు ఎప్పుడు దిగి వస్తాడా అని కాపుకాయసాగింది. గుహుడు ఎక్కిన చెట్టు ఒక మారేడు చెట్టు. ఏమీ తోచక ఒక్కొక్క మారేడు దళాన్ని కిందికి తుంపి విసిరేయసాగాడు. ఆ దళాలు చెట్టు మొదట్లో నున్న శివలింగంపై పడసాగాయి. ఆరోజు శివరాత్రి కూడా. పులిభయంతో వేటగాడు, వేటగానిని తినాలన్న కాంక్షతో పులి, జాగరణ చేయడంతో, శంకరుడు రెండు జీవాలకు మోక్షాన్ని ప్రసాదించాడు. అందుకే సర్వ వ్యాపకుడైన ఆ స్వామి మనలను కంటికి రెప్పలా కాపాడుతుంటాడు.
ఉర్వారుకం – ఇవ – బంధనం : దోసకాయ పక్వానికి వచ్చినపుడు, దానికి తొడిమ నుంచి విముక్తి లభించినట్లుగానే ఆ స్వామి మనలను అన్ని సమస్యల నుంచి గట్టెక్కించుతాడు.

మృతోర్ముక్షీయ: అలా సమస్యల నుంచి గట్టెక్కించే స్వామిని, మనలను మృత్యువు నుంచి కూడ రక్షణ కల్పించమని కోరుకుంటున్నాం. మృత్యువు అంటే భౌతికపరమైన మరణం మాత్రమేకాదు. ఆధ్యాత్మికపరంగా చేతనం లేకుండా ఉండటం కూడా మృత్యు సమానమే. భక్తి ప్రవత్తులు లేని జీవనం కూడా నిర్జీవమే.
ప్రకృతిలో అందాన్ని ఆస్వాదించలేక అంతా వికారంగా ఉందనుకునేవారికి, అంతా వికారంగానే కనబడుతుంది. ప్రతి విషయానికి సందేహపడే సదేహప్రాణికి అంతా అనుమానమయంగానే ఉంటుంది. ఇటువంటి వన్నీ చావువంటివే. ఇలా మనలను అన్నిరకాల మరణాల నుంచి విముక్తులను చేసి, మన జీవితాలను సంతోషమయం చేయమని స్వామిని ప్రార్థిస్తున్నాం మనం.

అమృతాత్ : స్వామి అల్ప సంతోషి, సులభప్రసన్నుడు. అందుకే శ్రీనాథమహాకవి ఆయనను ఈ క్రింది విధంగా స్తుతించాడు.
శివుని శిరమున కాసిన్ని నీళ్ళు జల్లి
పత్తిరిసుమంత నెవ్వడు పార వైచు
కామధేను వతడింట గాడి పసర
మల్ల సురశాఖి వానింట మల్లె చెట్టు
శివలింగంపై కాసిని నీళ్ళు చల్లి, మారేడు పత్రిని లింగంపై విసిరేసినప్పటికీ, ఆ భక్తుని ఇంట కామధేనువు ఇంటి పశువుగా మారుతుంది. కల్ప తరువు ఆ భక్తుని ఇంట మల్లెచెట్టుగా ఉంటుంది. అంతటి దయామయుడు పరమశివుడు.

మనకున్న చిరంజీవులలో ఆంజనేయస్వామి ఒకరని మనకు తెలుసు. అయితే ఆ ఆంజనేయునికి చిరంజీవత్వాన్ని ప్రసాదించింది శివుడే. ఆ కథ ప్రకారం,
రావణ వథానంతరం అయోధ్యకు చేరుకున్న రామ చంద్రుడు ప్రజారంజకంగా పరిపాలన గావిస్తున్నాడు. ఒకరోజు అగస్త్యమహర్షి తదితరులు శ్రీరామచంద్ర మూర్తిని దర్శించుకుని హనుమంతుని ప్రశంసించ సాగారు. అప్పుడు శ్రీరాముడు, మహావీరుడైన లక్ష్మణుని ప్రశంసింపక, ఎందుకు హనుమంతుని పొగుడుతున్నారని అడిగాడు. అప్పుడు అగస్త్యాది మునులు, హనుమంతుడు రుద్రాంశ సంభూతుడని, హనుమంతునితో సరితూగగల బలపరాక్రమ వంతులు ఎవరూ లేరని, అతని బలం గురించి అతనికి తెలియకపోవడమే శాపమని, అందుచేతనే అతడు వాలిని సంహరించలేకపోయాడని చెప్పారు. అలాగే నూరు యోజనాలు దాటి లంకను చేరడం, అతి చిన్న రూపాన్ని ధరించడం, సీతమ్మవారిని దర్శించడం, లంకాదహనం వంటివన్నీ సామాన్యులు చేయలేరని చెప్పారు. అదేవిధంగా బాల హనుమ, సూర్యుని చూసి ఎగిరి వెళ్ళి, ఇంద్రుని వజ్రాయుధ ఘాతానికి గురై భూమిపై పెడతాడు. అప్పుడు ఆంజనేయుని తండ్రి వాయుదేవుడు కుమారుని ఉజ్జయినికి తీసుకెళ్ళి శివార్చన చేసి, శివుని కరుణతో బాల ఆంజనేయుడు చిరంజీవిగా ఉండేట్లు వరాన్ని పొందాడు. ఇప్పటికీ మనం ఉజ్జయినిలో ఆంజనేయునికి చిరంజీవత్వాన్ని అనుగ్రహించిన హనుమత్కేశ్వర లింగాన్ని చూడగలం. ఈ విధంగా స్వామి తన భక్తులను మృత్యువు నుంచి కాపాడి, ఆయురారోగ్యాలతో కూడిన జీవితాన్ని ప్రసాదిస్తాడు.

ఈ మృత్యుంజయ మంతాన్ని శ్రద్ధతో పఠిస్తే, అకాలమృత్యువులు, ప్రమాదాల నుంచి రక్షణ లభిస్తుంది. ఇంత మహిమాన్వితమైన మహామృత్యుంజయ మంత్రాన్ని జపించడం వల్ల, దైవిక ప్రకంపనలు మన చుట్టూ ఆవరించి, సమస్త దుష్ట శక్తులు మన దరికి చేరకుండా కాపాడబడతాము.
మృత్యుర్యస్వాప సేచనం అని శ్రుతులు చెబుతున్నాయి. అంటే మృత్యువు శివునికి ఊరగాయ వంటిదని అర్థం. మృత్యువును జయించాలనుకునే వ్యక్తులు పరమశివుని రక్షణకోరితే సరిపోతుందని ఋగ్వేదం అంటున్నది. తనను ఆశ్రయించేవారి యొక్క మృత్యువును నివారించేవాడు కాబట్టి శివుడు మృత్యుంజయుడు అని కూడ పిలువబడుతున్నాడు. ఎవరైతే పుణ్యభీతితో శివుని ఉపాసిస్తారో, వారికి ఆ జన్మలోనే కర్మసంచయాన్ని (ఆగామితో సహా) పటాపంచలు చేసే శక్తిని శివుడు ప్రసాదిస్తాడు. అందుకు మృత్యుంజయ మంత్రాన్ని శ్రద్ధగా పఠించి ఆయురారోగ్యాలను పొందుదాం.

అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ

Saturday, October 5, 2019

_*ముక్తస్థితి*_

_*"మృత్యువును జయించడం అంటే మృత్యుభయం నుంచి బయటపడటమే. అదే ముక్తి..! "*_

_‘కన్నుతెరిస్తే జననం, కన్నుమూస్తే మరణం... రెప్పపాటు కాలం మనిషి జీవితం’ అన్నారొక కవి._

_ఆ స్వల్ప వ్యవధిలోనే మనిషికి అంతులేని ఆరాటం... అలుపెరగని పోరాటం... అలవిమాలిన అహంకారం... అదుపులేని మమకారం._

_వజ్రాలు మింగి అరగదీసుకోగల వయసులో అటుకులు కొనగలపాటి ఆర్థిక స్థోమత ఉండదు. వజ్రాలు కొనిదాచే స్థితికి ఎదిగేసరికి అటుకులు సైతం అరగవు._

_ఈ సత్యం మనిషికి బాగా తెలుసు. అంగీకరించాలంటే మాత్రం మనసొప్పదు._

_ఈ భూమ్మీద ఉన్నది మూడొంతులు నీరు. మిగిలిన భాగం మనిషి కన్నీరు. ‘నాకు చాలా ఇష్టమైనది వర్షంలో నడక... ఎందుకంటే నా కన్నీళ్ళు ఎవరికీ కనబడవు కనుక’ అన్నాడు సుప్రసిద్ధ ‘హాస్య’ నటుడు చార్లీ చాప్లిన్‌._

_గొప్ప హాస్యంగా చలామణీ అయ్యే ప్రతివాక్యం అంచునా పరమ దుఃఖపుఛాయ తొణికిసలాడుతూనే ఉంటుంది !_

_*‘ఈ ప్రపంచమంతా దుఃఖమయమే... మనిషి మాత్రం దాన్ని ఆనందంగా భ్రమపడతాడు’* అన్నాయి ఉపనిషత్తులు._

_‘అత్యంత పదునైన కత్తి అంచున పూసిన తేనెను ఆత్రంగా నాలికతో నాకుతుంటాడు మనిషి’ అనేది వాటి వివరణ._

_మృత్యువు అనే పదానికి ఉపనిషత్తులు ‘ఏమరిపాటు’ అని అర్థం చెప్పాయి._

_ఈ పరాకు విషయంలో వేమనయోగి ఇలా వివరించాడు. *‘పిండ మగుచు తల్లి పెనుగర్భమున నుండి పూర్వకర్మమెంచి పొరలిఏడ్చు... ధరణి పుట్టగానె మరచి వర్తించురా’* అన్నాడు._

_ఏమరిపాటు అనే మాటకు అర్థం అది !_

_తాను సుఖించడానికే పుట్టాను- అనుకోవడం ఏమరిపాటు._

_యక్ష ప్రశ్నల్లో ధర్మరాజు ఈ విషయాన్నే మరో రకంగా చెప్పాడు._

_‘ఈ ప్రపంచంలో అన్నింటికన్నా ఆశ్చర్యకరమైనది ఏది ?’ అని యక్షుడు అడిగాడు._

_‘తన కళ్ళముందే అనునిత్యం ఇంతమంది పరలోకగతులు అయిపోతున్నా తాను మాత్రం ఈ భూమ్మీద శాశ్వతంగా ఉండిపోతానని మనిషి నమ్ముతాడు. ఇది చాలా విస్మయం కలిగించే విషయం’ అన్నాడు ధర్మనందనుడు._

_*ఒక పరమసత్యం పట్ల అలా ఏమరిపాటుగా ఉండటమే- మృత్యుస్థితి. దానిపట్ల చక్కని ఎరుక కలిగి ఉండటమే ముక్తస్థితి.*_

_పుట్టినరోజు పేరుచెప్పి వినోదాల్లో, విలాసాల్లో ఉల్లాసంగా మునిగితేలే మనిషికి- "ఆయుర్దాయం ఒక ఏడాది కరిగిపోయిందని ఏమాత్రం గుర్తులేకపోవడమే ఏమరిపాటు అంటే !"_

_ఆ సత్యాన్ని ఎరుకలో ఉంచుకొని మరీ ఈ రోజును ఏ బెంగాలేకుండా ఆనందంగా గడపడం ముక్తస్థితి._

_హజ్రత్‌ బాబాజాన్‌ (బాబాజిన్‌) అనే సూఫీ యోగిని పసిబాలుడైన మెహర్‌ బాబాను దగ్గరకు తీసుకొని ఒక్కసారి ముద్దాడగానే- ఆ చిరుస్పర్శ అనుభవానికి ఆయన సంవత్సరంపాటు గాఢమైన సుషుప్తి అవస్థలోకి జారుకొని దరిమిలా గొప్ప యోగిగా ప్రపంచానికి వ్యక్తం అయ్యారని ‘ఆత్మపూజోపనిషత్తు’లో ఆచార్య రజనీష్‌ పేర్కొన్నారు._

_ఏమరిపాటు నుంచి బయటపడటం అంటే అది. అలా పరాకునుంచి బయటపడిన మనిషి మృత్యుస్థితి నుంచి ముక్తస్థితిలోకి ప్రవేశిస్తాడు. జీవన్ముక్తుడిగా అనుక్షణం వర్తమానంలో జీవిస్తాడు. సమయం వచ్చేసరికి మృత్యువును ఆహ్వానించే స్థితికి చేరుకుంటాడు. ఏమరిపాటు లేకుండా ఎరుకతో జీవించడమే ముక్తస్థితి._

_చదరంగం ముగిశాక రాజు, బంటు ఒకే పెట్టేలోకి జారుకుంటారు._

_జీవనయానం ముగిశాక కోటీశ్వరుడు, నిరుపేద ఒకే మట్టిలోకి చేరుకుంటాడు._

_ఈ సత్యం మనసులోకి ఇంకితే ఆరాట పోరాటాలకు, అహంకార మమకారాలకు చోటుండదు._

_మోహర్‌బాబాను స్పర్శానుభవం ఏ స్థితికి చేర్చిందో, ఒక సత్యవాక్యం సైతం మనిషిని అదే స్థితికి చేర్చగలుగుతుంది. ఏమరిపాటుకు లోనవకుండా కాపాడుతుంది._

_తాడును పామనుకొని భయపడినంతసేపు అది మృత్యుస్థితి. నిజం తెలియగానే కలిగేది ముక్తస్థితి !_

_*మృత్యువును జయించడం అంటే మృత్యుభయం నుంచి బయటపడటమే. అదే ముక్తి..!*_

🙏🇮🇳
*విజయదశమి రోజున జమ్మిచెట్టు పూజిస్తే..*

      జమ్మిచెట్టు విజయానికి సంకేతం. శమీవృక్షంలో అగ్ని నిక్షిప్తమై ఉంటుందని పురాణాలు చెప్తున్నాయి. అగ్ని వీర్యమే సువర్ణం అంటారు.
జమ్మిచెట్టు విజయానికి సంకేతం. శమీవృక్షంలో అగ్ని నిక్షిప్తమై ఉంటుందని పురాణాలు చెప్తున్నాయి. అగ్ని వీర్యమే సువర్ణం అంటారు. అందుకే  జమ్మి బంగారం కురిపించే కల్పవృక్షంగా పూజలందుకుంటోంది. అందుకే యజ్ఞ యాగాదుల వేళ జమ్మి కొమ్మల రాపిడి ద్వారా మాత్రమే అగ్నిని సృష్టిస్తారు. అలాంటి శమీ వృక్షం దేవీ రూపమని, విజయదశమి రోజు శమీపూజ చేసేవారికి అమ్మలగన్న అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుందని దేవీ భాగవతం చెప్తోంది.

          రావణుడిపై యుద్ధానికి వెళ్లే ముందు శ్రీరాముడు శమీ పూజ చేసినట్లు రామాయణం ద్వరా తెలుస్తోంది. ద్వాపరయుగంలో అజ్ఞాత వాసానికి వెళ్లేముందు పాండవులు తమ ఆయుధాలను జమ్మిచెట్టుపైనే ఉంచి అజ్ఞాతవాసం ముగిసిన తర్వాత విజయ దశమినాడు ఉత్తర గోగ్రహణం కోసం అర్జునుడు శమీ వృక్షాన్ని పూజించి గాండీవాన్ని ధరించి అద్భుత విజయాన్ని అందుకున్నట్లు మహాభారతం చెప్తోంది. దసరా రోజు శమీ పూజ చేసేవారికి అమ్మవారి కృప లభించటమే గాక శనిదోష నివారణ జరుగుతుందట. దసరా సాయంత్రం వేళ ఆలయాలు, చెరువుల వద్ద ఉండే జమ్మి చెట్టుకు నీళ్లు పోసి ప్రదక్షణలు చేస్తారు. శాస్త్రోక్తంగా జమ్మిని పూజించి జమ్మి ఆకును ప్రసాదంగా స్వీకరిస్తారు. దీనిని బంగారంగా భావించి పెద్దలు, కుటుంబ సభ్యులకు ఇచ్చి నమస్కరిస్తారు. తాము అందుకొన్న జమ్మి ఆకులను ఇంట్లోని పూజాస్థలంలో, ధనస్థానంలో దాచుకోవటం శుభప్రదం.

*శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశినీ*
*అర్జునస్య ధనుర్దారీ రామస్య ప్రియదర్శిని*
*శమీ కమల పత్రాక్షి శమీ కంటక హారిణి*
*ఆరోగ్యంతు సదాలక్ష్మీ ఆయు: ప్రాణాంతు రక్షతు*
*ఆదిరాజ మహారాజ వనరాజ వనస్పతే*
*ఇష్ట దర్శన మృష్టాన్నం కష్ట దారిద్య్ర నాశనం*

అనే ఈ శ్లోకాన్ని చెప్తూ శమీపూజ చేయాలని పెద్దలంటారు.

            అంతేగాకుండా.. దేవదానవులు పాలసముద్రాన్ని చిలికినప్పుడు ఆవిర్భవించిన దేవతా వృక్షాల్లో శమీవృక్షమూ ఉంది. నాడు శమీవృక్షంతోబాటు ఆవిర్భవించిన తులసి, పారిజాత, బిల్వ వృక్షాలకు వనమాలి అనే ఓ అధిష్టాన దేవత ఉందనీ, ఆమెనే శమీ దేవత అంటారు. వినాయక పూజలో జమ్మి ఆకును ఉపయోగిస్తారు. త్రేతాయుగాన వనవాససమయంలో శ్రీరాముడు కుటీరాన్ని జమ్మి చెట్టు కలపతోనే నిర్మించినట్లు పురాణాలు చెప్తున్నాయి.
_*నారదుడి కొడుకులు ....*_
 *ఎవరు ??*

           ఆజన్మ బ్రహ్మచారి  అయిన నారద మహర్షికి ఒక రోజు విచిత్రమైన కోరిక కలిగింది. సంసారం మాయ అంటారు కదా ! అదేంటో తెలుసుకోవాలనే కుతూహలం కలిగి, తన కోరిక విష్ణుమూర్తికి తెలియజేస్తాడు. భూలోకం లో ఒక కొలను (కాకినాడ దగ్గర, సర్పవరం భావనారాయణ గుడి ఎదురుగా వున్న తటాకము) చూపించి అందులో స్నానం చేసి రమ్మంటాడు విష్ణువు. సరేనంటూ అందులో దిగి స్నానం చేసి వచ్చేసరికి, నారదుడి ఒక స్త్రీ గా మారి, పూర్వ జన్మ జ్ఞానాన్ని కోల్పోతాడు. అంతలో అటుగా వచ్చినె ఒక రాజు, స్త్రీ రూపం లో‌ వున్న నారదుడిని చూసి మోహించి ఆమెను వివాహము చేసికుంటాడు. వీరికి 60 మంది సంతానం కలుగుతారు. కొన్నేళ్ళ తరువాత శతృవులతొ జరిగిన యుధ్ధము లో , రాజు తన 60 మంది సంతానం తొ సహా మరణిస్తారు.

            స్త్రీ రూపం లో వున్న నారదుడు అంతులేని దుఃఖానికి గురవుతాడు. మరణించిన వారికి ఉత్తరక్రియలు జరిపించి తరువాత  తాను పూర్వం స్నానం చేసిన కొలనులో స్నానం చేయడంతో, అతనికి స్త్రీ రూపం పోతుంది. అయినా పుత్రులు యుధ్ధంలో మరణించిన దుఃఖము నుంచి తేరుకోలేకపోతాడు.

           అప్పుడు విష్ణువు ప్రత్యక్షమై, ఇదంతా తన మాయ వల్ల జరిగిందని చెపుతాడు. నారదుడి సంతానం పేరు శాశ్వతంగా నిలిచి వుండేలా వారు పేర్లే కాలప్రమాణాలుగా మారి, సంవత్సరం పేర్లుగా మారుతాయని వరమిచ్చాడు.

         అలా నారదుడి సంతానమైన ప్రభవ, విభవ, శుక్ల తదితర 60 మంది పేర్లే ఇప్పుడు మనం వుపయోగిస్తున్న సంవత్సరం పేర్లుగా వ్యాప్తిలోకి వచ్చాయి.

 *ఓం నమోః నారాయణాయ...*
*ఓం నమోః భావ నారాయణాయ*
*శారదా ప్రార్థన*

*నమస్తే శారదే దేవి కాశ్మీరపురవాసిని*
*త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాదానం చ దేహి మే || ౧ ||*

*యా శ్రద్ధా ధారణా మేధా వగ్దేవీ విధివల్లభా*
*భక్తజిహ్వాగ్రసదనా శమాదిగుణదాయినీ || ౨ ||*

*నమామి యామినీం నాథలేఖాలంకృతకుంతలామ్*
*భవానీం భవసంతాపనిర్వాపణసుధానదీమ్ || ౩ ||*

*భద్రకాళ్యై నమో నిత్యం సరస్వత్యై నమో నమః*
*వేదవేదాంగవేదాంతవిద్యాస్థానేభ్య ఏవ చ || ౪ ||*

*బ్రహ్మస్వరూపా పరమా జ్యోతిరూపా సనాతనీ*
*సర్వవిద్యాధిదేవీ యా తస్యై వాణ్యై నమో నమః || ౫ ||*

*యయా వినా జగత్సర్వం శశ్వజ్జీవన్మృతం భవేత్*
*జ్ఞానాధిదేవీ యా తస్యై సరస్వత్యై నమో నమః || ౬ ||*

*యయా వినా జగత్సర్వం మూకమున్మత్తవత్సదా*
*యా దేవీ వాగధిష్ఠాత్రీ తస్యై వాణ్యై నమో నమః || ౭ ||*
* బెజవాడ ఆలయంలో రాజద్వారం పై ఉండే ఈ పద్యం గురించి మీకు తెలుసా !?

అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల బెద్దమ్మ, సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ దన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ దుర్గ, మాయమ్మ, కృపాబ్ధి యిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్!!

విజయవాడ కనకదుర్గమ్మ తల్లి కోవెలలో ఇప్పటికీ రాజద్వారం మీద ఈ పద్యం రాసి ఉంటుంది. ఈ పద్యం పైకి ఒకలా కనపడుతుంది. మీరు తెలిసికాని, తెలియకకాని పోతనగారు వ్రాసిన పద్యములు కొన్ని నోటికి వచ్చినవి మీరు చదివినట్లయితే అవి సత్ఫలితాలనే ఇచ్చేస్తాయి.

ఎందుకు అంటే మీరు కొన్ని కొన్ని చదవకూడదు. కొన్ని కొన్ని చేయకూడదు. పక్కన గురువు వుంటే తప్ప మేరువుని, శ్రీచక్రమును ఇంట్లోపెట్టి పూజ చెయ్యలేరు. అది మనవల్ల కాదు. మీరు బీజాక్షరములను ఉపాసన చెయ్యలేరు. అది కష్టం.

కానీ పోతనగారు ఈ దేశమునకు బహూకరించిన గొప్ప కానుక ఆయన రచించిన భాగవత పద్యములు.

’అమ్మలనుకన్న దేవతా స్త్రీలయిన వారి మనస్సులయందు ఏ అమ్మవారు ఉన్నదో అటువంటి అమ్మని మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ – ఈ నాలుగింటికోసము నమస్కరిస్తున్నాను.

అటువంటి దుర్గమ్మ మాయమ్మ. ’ఇవీ ఆయన ఈ పద్యంలో చెప్పిన విషయములు, మీరు చెయ్యలేని ఒక చాలా కష్టమయిన పనిని పోతనగారు చాలా తేలికగా మీకు ప్రమాదం లేని రీతిలో మీతో చేయించేయడాని కని ఇటువంటి ప్రయోగం చేశారు.

’అమ్మలగన్నయమ్మ’ – అమ్మలని చెప్పబడ్డవారు ఎవరు? మనకి లలితాసహస్రం ’శ్రీమాతా’ అనే నామంతో ప్రారంభమవుతుంది. ’శ్రీమాతా’ అంటే ’శ’కార ’ర’కార ’ఈ’కారముల చేత సత్వరజస్తమోగుణాధీశులయిన బ్రహ్మశక్తి, విష్ణుశక్తి రుద్రశక్తులయిన రుద్రాణి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి – ఈ ముగ్గురికీ అమ్మ – ఈ మూడు శక్తులను త్రిమూర్తులకు ఇచ్చినటువంటి పెద్దమ్మ అమ్మ ఎవరు వున్నదో ఆయమ్మ – అంటే ’లలితాపరాభట్టారికా స్వరూపం’ – ఆ అమ్మవారికీ దుర్గాస్వరూపమునకు భేదం లేదు – అందుకని ’అమ్మలగన్నయమ్మ’ ’ముగ్గురమ్మల మూలపుటమ్మ’ – ఆ ముగ్గురు అమ్మలే మనం మహాకాళి, మహాలక్ష్మి, మహా సరస్వతి స్వరూపములుగా కొలిచే తల్లులు. ఈ ముగురమ్మల మూలపుటమ్మ.

’చాల పెద్దమ్మ’ – ఇది చాలా గమ్మత్తయిన మాట. చాల పెద్దమ్మ అనే మాటను సంస్కృతంలోకి తీసుకువెడితే మహాశక్తి – అండపిండ బ్రహ్మాండములనంతటా నిండిపోయిన బ్రహ్మాండమయిన శక్తిస్వరూపం. ఈ శక్తి స్వరూపిణి చిన్నపెద్దా భేదంలేకుండా సమస్త జీవరాశులలోను ఇమిడి ఉంది. అలా ఉండడం అనేదే మాతృత్వం. ఇది దయ. దీనిని సౌందర్యం అంటారు. దయకు సౌందర్యం అని పేరు. అది ప్రవహిస్తే సౌందర్యలహరి.

అండపిండ బ్రహ్మాండములనన్నిటినీ నిండిపోయి ఈ భూమిని తిప్పుతూ, లోకములనన్నిటినీ తిప్పుతూ ఇవన్నీ తిరగడానికి కారణమయిన అమ్మవారు ఎవరో ఆ అమ్మ.

’సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ’ – సురారి అనగా దేవతలకు శత్రువయిన వాళ్ళ అమ్మ. అనగా దితి. దితి అయ్యో అని ఏడిచేటట్టుగా ఆవిడకు కడుపుశోకమును మిగిల్చింది. అనగా రాక్షసులు నశించడానికి కారణమయిన అమ్మ. దేవతలలో శక్తిగా ఈమె ఉండబట్టే రాక్షసులు మరణించారు.

’తన్నులోనమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ’ – ఇదొక గొప్పమాట. అమ్మవారిని మనస్సులో నమ్ముకుని శక్తితో తిరుగుతున్న వారెవరు?

బ్రాహ్మి – మాహేశ్వరి – వైష్ణవి – మహేంద్రి
చాముండ – కౌమారి – వారాహి – మహాలక్ష్మి

మనకి సంప్రదాయంలో ’అష్టమాతృకలు’ అని ఉన్నారు. వాళ్ళని మనం ఎనిమిది పేర్లతో పిలుస్తూ ఉంటాము. బ్రాహ్మి, మహేశ్వరి, వైష్ణవి, మహేంద్రి, చాముండ, కౌమారి, వారాహి, మహాలక్ష్మి.

ఇలా ఎనమండుగురు దేవతలు ఉన్నారు. వీరిని ’అష్టమాతృకలు’ అని పిలుస్తారు. ఈ అష్టమాతృకలు శ్రీచక్రంలో దేవతలుగా ఉంటారు. వీరు నిరంతరము అమ్మవారిని లోపల కొలుస్తూ, అమ్మవారి వలన శక్తిని పొంది మనని ఉద్ధరిస్తూ ఉంటారు. ఈ ఎనమండుగురునే మనం కొలుస్తూ వుంటాము.

’రక్తాంబరాం రక్తవర్ణాం రక్త సౌభాగ్యసుందరాం వైష్ణవీం శక్తిమద్భుతాం’

అంటారు దేవీభాగవతంలో వ్యాసభగవానుడు. ఈ ఎనమండుగురికీ శక్తినిచ్చిన అమ్మవారెవరో ఆవిడే వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ – దుర్గమాయమ్మ – ఈ దుర్గమ్మ ఉన్నదే లలితాపరాభట్టారిక – ఆవిడ లలితా పరాభట్టారిక – ఆ అమ్మ మాయమ్మ.

’మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్’ – ఇప్పుడు ఆవిడ నాకు దయతో మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదలను ఇవ్వాలి. నాకు అర్హత ఉన్నదని ఇవ్వనక్కరలేదు. దయతో ఇచ్చేయ్యాలి.

అమ్మవారికి ’శాక్తేయప్రణవములు’ అని కొన్ని బీజాక్షరములు ఉన్నాయి. ఓం ఐంహ్రీంశ్రీంక్లీంసౌః – ఈ ఆరింటిని శాక్తేయ ప్రణవములు అని పిలుస్తారు. దానిని ఎలాబడితే అలా ఉపాసన చెయ్యకూడదు. కాబట్టి బీజాక్షరములను అన్నివేళలా ఉపాసన చేయలేము. కానీ ఇప్పుడు పోతనగారు ఒక గొప్ప ప్రయోగం చేశారు. మహత్వమునకు బీజాక్షరము ’ఓం’, కవిత్వమునకు బీజాక్షరము ’ఐం’, పటుత్వమునకు భువనేశ్వరీ బీజాక్షరము ’హ్రీం”, ఆ తర్వాత్ సంపదల్ – లక్ష్మీదేవి – ’శ్రీం’.

ఇపుడు ’ఓంఐంహ్రీంశ్రీం’ – అమ్మలగన్నయమ్మ ’శ్రీమాత్రేనమః’

మీరు బీజాక్షరములతో అస్తమానూ అలా అనడానికి వీలులేదు. కానీ మీరు రైలులో కూర్చున్నా, బస్సులో కూర్చున్నా స్నానం చెయ్యకుండా కూడా ఎక్కడ ఉన్నా కూడా – అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ – అంటున్నారనుకోండి అపుడు మీరు మరోరూపంలో ’ఓంఐంహ్రీంశ్రీం శ్రీమాత్రేనమః’ – ఓంఐంహ్రీంశ్రీం శ్రీమాత్రేనమః’ అనేస్తున్నారు.

మీరు అస్తమాననూ అమ్మను తలచుకున్నట్లు అవుతుంది. అపుడు అమ్మవారు చాలా తొందరగా మీకు పలుకుతుంది. అందుకే లలితా సహస్రం ’శ్రీమాతా’ అంటూ అమ్మతనంతో ప్రారంభమవుతుంది.

ఆవిడ రాజరాజేశ్వరి. అయినా ఆవిడముందు అమ్మా అమ్మా అనేసరికి ఆవిడి పొంగిపోతుంది. ఇన్నిమార్లు ఆ పద్యంద్వారా అటూ ఇటూ అమ్మని మీరు పిలుస్తుంటే విసుక్కోవడం చేతకాని దయాస్వరూపిణి అయిన అమ్మ మీకోరికను తీరుస్తుంది. ఇప్పుడు మీరు ’ఓంఐంహ్రీంశ్రీం శ్రీమాత్రే నమః’ అనలేకపోవచ్చు.

కానీ ’అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ’ అనడానికి కష్టం ఏమిటి?

ఈవిధంగా పోతనగారు శ్రీవిద్యా రహస్యములన్నిటిని ఔపోసనపట్టి తెలుగు వారందరికీ ఒక మహత్తరమయిన కానుకను బహూకరించిన మహాపురుషుడు ఆయన ఒక ఋషి. అందుకని ఆ పద్యమును అనుగ్రహించినారు.

ఆ తల్లి అనుగ్రహం అందరికీ లభించాలని ప్రార్థిస్తూ....

సర్వేజనా సుఖినోభవంతుForwarded by I. Jaganmohan 

Friday, October 4, 2019

*శరదిందు వికాస మందహాసం ~ స్పురదిందీవరలోచనాభి రామమ్*
*అరవిందసమాన సుందరాస్యాం ~ అరవిందాసన సుందరీ ముపాసే*  

*యాకుందేందు తుషార హార ధవళా ~ యాశుభ్ర వస్థ్రావృతా*  
*యావీణా వరదండ మండిత కరా ~ యా శ్వేత పద్మాసనా*
*యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతి ~ భిర్దేవై స్సదా పూజితా*
*సామాం పాతు సరస్వతీ ~ నిశ్శేష జాడ్యాపహా*

*పద్మ పత్ర విశాలాక్షీ ~ పద్మ కేసర వర్ణినీ*
*నిత్యం పద్మాలయా ~ దేవీ సామాం పాతు సరస్వతీ*